Share News

రైతుకు పండుగ

ABN , Publish Date - Mar 14 , 2026 | 03:04 AM

రైతుల ఇంట ఆనందం వెల్లివిరిసింది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం అన్నదాత సుఖీభవ నిధుల జమ కార్యక్రమం పండుగలా సాగింది. క్షేత్రస్థాయిలో ఉండే రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) స్థాయిలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కర్షకులతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

రైతుకు పండుగ
రైతులకు నమూనా చెక్కును అందజేస్తున్న మంత్రి స్వామి, పక్కన ఎమ్మెల్యే బీఎన్‌, కలెక్టర్‌ రాజాబాబు తదితరులు

ఆర్‌ఎస్‌కే స్థాయిలో కార్యక్రమాలు

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సభలు ప్రత్యక్ష ప్రసారం

జిల్లాలో 1.88 లక్షల మందికి రూ.108.30 కోట్లు విడుదల

ఉత్సాహంగా పాల్గొన్న రైతులు, టీడీపీ శ్రేణులు

నియోజకవర్గానికి ఒక చోట ప్రత్యేక కార్యక్రమం

మద్దిపాడులో పాల్గొన్న మంత్రి శ్రీబాలవీరాంజనేయస్వామి

ఇతరచోట్ల కీలక ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు హాజరు

రైతుల ఇంట ఆనందం వెల్లివిరిసింది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం అన్నదాత సుఖీభవ నిధుల జమ కార్యక్రమం పండుగలా సాగింది. క్షేత్రస్థాయిలో ఉండే రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) స్థాయిలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కర్షకులతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అదేసమయంలో ప్రభుత్వ ఆదేశాలతో నియోజకవర్గానికి ఒకచోట ప్రత్యేకంగా సభలను నిర్వహించారు. కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వందల సంఖ్యలో రైతులు, మహిళలు, టీడీపీ శ్రేణులు హాజరయ్యారు.

ఒంగోలు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను విడుదల చేశారు. వాటిని శుక్రవారం రైతుల ఖాతాలకు జమచేయడంతో వారి ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్‌ పథకం, రాష్ట్రం లో అన్నదాత సుఖీభవ పథకం కలిపి ఇస్తున్న విషయం విదితమే. ఈనేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ గౌహతిలో జరిగిన సభలో పీఎం కిసాన్‌, కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. ఆ రెండు సభలను రైతులు వీక్షించేలా ఆర్‌ఎస్‌కేల వద్ద స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యనేతలు పాల్గొన్న కార్యక్రమాల వద్ద కూడా తొలుత పీఎం, సీఎం సభల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన అనంతరం నియోజకవర్గ, మండల స్థాయిలో నిధుల జమకు సంబంధించిన చెక్కులను విడుదల చేశారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో లక్షా 88వేల మంది రైతులకు మూడో విడత పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ కింద రూ.108.30 కోట్లు విడుదల కాగా రైతుల ఖాతాలకు జమ కావడం ప్రారంభమైంది.

ప్రత్యేక సభలో పాల్గొన్న నేతలు

మండల కేంద్రమైన మద్దిపాడులో సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయి ప్రత్యేక సభ జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, స్థానిక ఎమ్మె ల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌, కలెక్టర్‌ రాజాబాబుతోపాటు జిల్లా అధికారులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఒంగోలు రూరల్‌ మండలం యరజర్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, జేసీ కల్పనాకుమారి హాజరయ్యారు. కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అక్కడి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్‌ కలెక్టర్‌ హిమవంశీ పాల్గొన్నారు. కొండపి నియోజకవర్గంలోని పొన్నలూరు మండల కేంద్రంలో రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, దొనకొండ మండలం భూమనపల్లిలో జరిగిన కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 03:04 AM