Share News

ఉద్యాన రైతుకు ఊతం

ABN , Publish Date - Oct 17 , 2026 | 02:22 AM

జిల్లాలో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ పథకం అమలుకు సంబంధిత అధికారులు శ్రీకారం చుట్టారు. తొలిగా పథకం లబ్ధితోపాటు విధివిధానాలపై రైతులకు అవగాహన కల్పించే ప్రక్రియను చేపట్టారు. అందుకోసం క్షేత్రస్థాయిలో రైతులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడంతోపాటు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు.

ఉద్యాన రైతుకు ఊతం
రైతుల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న హార్టికల్చర్‌ ఏడీ గోపీచంద్‌, పక్కన డీఏవో శ్రీనివాసరావు

పథ కం లబ్ధి, విధి విధానాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు

వారోత్సవాల పేరుతో ఆర్‌ఎస్‌కే స్థాయిలో సమావేశాల నిర్వహణ

అదే సమయంలో దరఖాస్తులు

అందుకోసం ప్రత్యేక యాప్‌ సిద్ధం

మూడేళ్లలో రూ.601 కోట్ల వ్యయంతో హార్టికల్చర్‌ ప్రణాళిక

ఒంగోలు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ పథకం అమలుకు సంబంధిత అధికారులు శ్రీకారం చుట్టారు. తొలిగా పథకం లబ్ధితోపాటు విధివిధానాలపై రైతులకు అవగాహన కల్పించే ప్రక్రియను చేపట్టారు. అందుకోసం క్షేత్రస్థాయిలో రైతులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడంతోపాటు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. సుమారు లక్ష కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌ను ప్రకటిం చింది. అందులో సీమలోని జిల్లాలతోపాటు ఉమ్మడి జిల్లాను కూడా చేర్చింది. ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం, ఆధునిక సాంకేతిక పద్ధతులు అమలు, మార్కెటింగ్‌, ఉత్పత్తుల నిల్వ, ప్రాసెసింగ్‌, రైతులకు అవగాహన ఇతరత్రా కీలక అంశాలను హార్టికల్చర్‌, అనుబంధమైన వ్యవసాయ, మైక్రో ఇరిగేషన్‌ శాఖల ద్వారా చేపట్టింది. నీటి సౌకర్యం కల్పన ఇరిగేషన్‌, రహదారులు, ఇతర సౌకర్యాలను పంచాయతీరాజ్‌శాఖ ద్వారా కల్పించనున్నారు. అందుకు సంబంధించిన నిధులను ఆయా శాఖలకు విడివిడిగా కేటాయిస్తున్నారు. అందులో హార్చికల్చర్‌ ద్వారా ప్రధాన కార్యక్రమాలు ప్రత్యేకించి రైతుల భాగస్వామ్యంతో నిర్వహించేవి అమలు చేయనున్నారు. ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని ఆరు నియోజకవర్గాలతోపాటు బాపట్ల జిల్లాలోకి వెళ్లిన పర్చూరు, చీరాల నియోజకవర్గాలు కూడా హార్టికల్చర్‌ ఒంగోలు ఏడీ పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ పథకం వాటికి అమలవుతుండగా ఈ పరిధిలో మూడేళ్లలో సుమారు రూ.601 కోట్లు ఈ శాఖ ద్వారా వ్యయం చేసేలా ప్రణాళికలు రూపొందించారు.

సాగు విస్తీర్ణం పెంపు

ప్రస్తుతం ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో సుమారు 32,702 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉండి దాదాపు 6.74లక్షల టన్నుల పంట ఉత్పత్తులు ఏటా వస్తున్నాయి. మూడేళ్లలో సాగు విస్తీర్ణాన్ని మరో 27వేల హెక్టార్లకుపైగా పెంచి సుమారు 14.28 లక్షల టన్నుల ఉత్పత్తులు వచ్చేలా ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం ఎనిమిది నియోజకవర్గాలను 10 క్లస్టర్లుగా విభజించి తొలి ఏడాదైన ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు క్లస్టర్లలో అమలు చేస్తున్నారు. తదనుగుణంగా జిల్లాలో ఉద్యాన శాఖ నేతృత్వంలో ఆశాఖ అధికారులు.. అలాగే వ్యవసాయ, మైక్రో ఇరిగేషన్‌ శాఖల అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఈనెల 12 నుంచి 17 వరకు వారోత్సవాలను చేపట్టారు.

ఎస్సీ, ఎస్టీ రైతులపై ప్రత్యేక దృష్టి

ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలోని రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) స్థాయిలో అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. ఈనెల 17లోపు ఎనిమిది నియోజకవర్గాల్లోని 451 ఆర్‌ఎస్‌కేలలో వీటిని పూర్తిచేయనున్నారు. ఇదేసమయంలో ఈ పథకం లబ్ధి కోరుకునే రైతుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించి అందులో వివరాలు నమోదు చేస్తున్నారు. మొక్కల సరఫరా నుంచి ఆధునిక సాగు పద్ధతులు, సూక్ష్మసేద్యం, అంతర పంటల నిర్వహణ, పంట ఉత్పత్తుల నిల్వ, ప్రాసెసింగ్‌ ద్వారా వాటి విలువ పెంపు, మార్కెటింగ్‌ తదితర అన్ని అంశాలపైనా రైతులకు ఈ సదస్సుల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు ఉద్యానశాఖ ఒంగోలు ఏడీ గోపీచంద్‌ తెలిపారు. రైతులు ఈ పథకం లబ్ధిని పొంది ఉద్యాన పంటల సాగు పెంపు, ఇప్పటికే సాగులో ఉన్న పంటలలో ఉత్పత్తి పెంపు చర్యలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ పథకం అమలులో ఎస్సీ, ఎస్టీ రైతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

Updated Date - Oct 17 , 2026 | 02:22 AM