ఉద్యానానికి ఊపు
ABN , Publish Date - Nov 12 , 2026 | 10:53 PM
రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఇప్పుడు ఉద్యాన రైతులకు ఊపునిస్తోంది. పండ్ల తోటల సాగుపై ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి దరఖాస్తులు వస్తున్నప్పటికీ.. పశ్చిమ ప్రకాశంలో ఈ తరహా సాగుకు బాగా డిమాండ్ పెరిగింది.
హార్టికల్చర్ హబ్‌పై పెరుగుతున్న ఆసక్తి
అందుబాటులో ప్రత్యేక వెబ్‌సైట్
ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే 1,902 మంది దరఖాస్తు
వచ్చిన వినతుల అమలుకు ఖర్చు అంచనా రూ.1003 కోట్లు
ప్రభుత్వ ప్రోత్సాహాలతో పెరగనున్న పండ్ల తోటల సాగు
రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఇప్పుడు ఉద్యాన రైతులకు ఊపునిస్తోంది. పండ్ల తోటల సాగుపై ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి దరఖాస్తులు వస్తున్నప్పటికీ.. పశ్చిమ ప్రకాశంలో ఈ తరహా సాగుకు బాగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయడంతో పశ్చిమాన భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో డ్రిప్ ఇరిగేషన్‌తో పండ్ల తోటల సాగు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. ఒక్క మార్కాపురం జిల్లా నుంచే 1465 మంది రైతులు హార్టికల్చర్ సాగుకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
మార్కాపురం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన సాగుకు ప్రోత్సాహాలు ఇచ్చే 10 జిల్లాల్లో ప్రకాశం, మార్కాపురం ఉండటం శుభపరిణామం. రైతులందరి ఆశ ఇప్పుడు హార్టీకల్చర్ హబ్ పైనే. ఉద్యాన రైతుల ఆశాదీపం హార్టికల్చర్ హబ్‌ను అక్టోబరు 2న అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రారంభించారు. ఆ తరువాత రైతులు వారికి కావలసిన అవసరాలను దరఖాస్తు రూపంలో పంపుకునేందుకు ఉద్యానశాఖ ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించి ఒక ఆన్‌లైన్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంట్లో రైతులు వారి వివరాలు, అవసరాలను తెలియజేస్తూ దరఖాస్తు పంపుకోవచ్చని కోరింది. ఈ నెల రోజుల వ్యవధిలో మార్కాపురం జిల్లా నుంచి 1,465, ప్రకాశం నుంచి 437 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుదారులకు చెందిన 3,415 ఎకరాల్లో ఉద్యాన సాగుకు ప్రోత్సాహకాలు కోరుతున్నారు. రైతులు వారి దరఖాస్తు ద్వారా కోరుకునే కొన్ని అంశాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.
దరఖాస్తు చేసుకునే అంశాలు
వాతావరణ మార్పులను తట్టుకునే ఉద్యానపంటల విస్తరణ, పంటల వైవిద్యీకరణకు అవసరమైన ప్రోత్సాహకాలు.
వ్యాధులను తట్టుకునే నాణ్యమైన పండ్ల మొక్కల సరఫరా
సూక్ష్మ సాగునీటి ఎరువుల పంపిణీ
సూక్ష్మ సేద్యంలో ఆటోమేషన్ పద్ధతి
ఇప్పటికే ఉన్న పండ్ల తోటల్లో ఉత్పాదకత పెంపు కోసం, పండ్ల నాణ్యత, సంరక్షణ
మంచి వ్యవసాయ పద్ధతులకు అవసరమైన సహాయం
వ్యవసాయ యాంత్రీకరణ పథకం
పంటకోత అనంతరం నిల్వ, రవాణా, ప్యాకింగ్ సౌకర్యాలు
రక్షిత సాగు విధానాలైన పాలిహౌస్, షేడ్‌నెట్‌ల కోసం రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
ప్రకాశం, మార్కాపురం జిల్లాల నుంచి ఇప్పటివరకు వచ్చిన 1,902 దరఖాస్తుల ద్వారా రైతులు కోరిన వాటి మంజూరుకు రూ.1003 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా రూపొందించారు. ఇంకా దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్ ద్వారా కొనసాగుతుందని, ఎంతమంది రైతులకైనా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఉద్యానహబ్ ద్వారా అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రైతుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా యాంత్రీకరణ, పాత తోటల పునరుద్ధరణ కోసం వస్తున్నాయి. ఈ అవకాశం ద్వారా జిల్లాలో ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెరుగుతుంది. రైతులు కూడా ఇప్పుడు ఉద్యానసాగుపై ఆసక్తి పెంచుకుంటున్నారని వస్తున్న దరఖాస్తులను బట్టి తెలుస్తోంది.