దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:53 PM
దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలు చెప్పారు.
పలు పథకాలను అమలుచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కనిగిరిలో రూ.52.17లక్షల విలువైన సహాయ పరికరాలను అందజేసిన ఎంపీ, ఎమ్మెల్యే
కనిగిరి(పీసీపల్లి), జూలై17 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలు చెప్పారు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అలింకో(ఆర్టిఫిషియల్ లిమ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సహకారంతో ఏడీఐపీ ద్వారా అర్హులైన దివ్యాంగులకు అవసరమైన ఆధునిక సహాయ పరికరాలను శుక్రవారం కనిగిరిలోని అమరావతి గౌండ్స్‌లో వారు పంపిణీ చేశారు. 80 మందికి రూ.52.17లక్షల విలువైన బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, బ్రెయిల్‌కిట్‌లు, టీఎల్‌ఎమ్ కిట్‌లు, వాకింగ్ స్టిక్స్ తదితర సహాయ పరికరాలను అందజేశారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ మాగుంట మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నాయని చెప్పారు. ఏడీఐపీ కింద పార్లమెంట్ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 340మంది దివ్యాంగులకు సహాయ పరికరాలను అందజేశామన్నారు. ఈ ఒక్కరోజే కనిగిరిలో 80మందికి సహాయ పరికరాలను అందజేశామని చెప్పారు. మిగతా వారికి కూడా త్వరలోనే క్యాంపులు నిర్వహించి అవసరమైన వారందరికీ పరికరాలను అందజేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాప్రభుత్వం దివ్యాంగులకు రూ.6వేల పింఛన్‌ను అందజేస్తుందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీఏఎ్‌ససీఏసీ చైర్మన్ నారాయణస్వామి, కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం, కనిగిరి పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్, హెచ్‌ఎంపాడు, పామూరు మండల పార్టీ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎ్‌సటీఆర్), బొల్లా నరసింహారావు పాల్గొన్నారు.