సాంకేతికతకు పెద్దపీట
ABN , Publish Date - May 19 , 2026 | 03:09 AM
పాఠశాల విద్యలో ప్రభుత్వం సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. స్కూల్ సమాచారం, విద్యార్థుల మార్కులు, ఇతర వివ రాలన్నింటినీ యాప్‌లో నిక్షిప్తం చేస్తోంది..
లీప్ యాప్‌లో ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు హోంవర్క్‌లు
తల్లిదండ్రుల ఫోన్‌లలో ఇన్‌స్టాల్
ఒంగోలు విద్య, మే 18 (ఆంధ్రజ్యోతి) : పాఠశాల విద్యలో ప్రభుత్వం సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. స్కూల్ సమాచారం, విద్యార్థుల మార్కులు, ఇతర వివ రాలన్నింటినీ యాప్‌లో నిక్షిప్తం చేస్తోంది.. పాఠశాలలు, విద్యార్థులకు సంబంధించిన సమస్త సమాచారం అంద రికీ అందుబాటులో ఉంచేందుకు పాఠశాల విద్యాశాఖ కొత్తగా లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌లో విద్యార్థుల హాజరు, పరీక్షల్లో సాధించిన మార్కులు, మధ్యాహ్న భోజనం, పోటీ పరీక్షా ఫలితాలు, ఇతర వివరాలన్నింటినీ ఉంచుతున్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు సాధించిన మార్కులు, ఫెయిలైన వారికి నిర్వహిస్తున్న రెమిడియల్ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులను కూడా ఆ యాప్‌లో నమోదు చేస్తున్నారు. లీప్ యాప్ పాఠశాల విద్యలో కీలకంగా మారింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు హోంవర్క్, అసైన్‌మెంట్‌లు లీప్ యాప్ ద్వారానే ఇస్తారు. హోంవర్క్ ఏమి ఇచ్చారు, ఈ రోజు అసైన్‌మెంట్ ఏముంది అన్నది తల్లిదండ్రులు నేరుగా యాప్‌ను ఓపెన్ చేసి తెలుసుకునేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. బడిలో జరిగే పరీక్షల్లో తమ పిల్లలు సాధిస్తున్న మార్కులు, హాజరు తదితర వివరాలను తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. పాఠశాలల్లో ప్రవేశించే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల మొబైల్‌లో లీప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించింది.