Share News

ఎస్‌బీఎస్‌లో 60శాతం వెనక్కు!

ABN , Publish Date - May 20 , 2026 | 02:28 AM

పొగాకు వేలం తీరుపై తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులు పోరుబాట పట్టాలని తీర్మానించినా దక్షిణాది మార్కెట్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ వారిని నియంత్రించి వేలంను సజావుగా కొనసాగించడంలో పొగాకు బోర్డు అధికారులు సఫలం కాలేకపోతున్నారు.

ఎస్‌బీఎస్‌లో 60శాతం వెనక్కు!
రైతులతో మాట్లాడుతున్న వేలం కేంద్రం నిర్వహణాధికారి తులసి

తెచ్చిన పొగాకు బేళ్లు 851..కొనుగోలు చేసింది 335

ఒంగోలు-2లో నిలిచిన వేలం ప్రక్రియ

ఎస్‌ఎల్‌ఎస్‌లోనూ నామమాత్రమే!

నాల్గోవంతు నోబిడ్‌లు

ఒంగోలు, మే 19 (ఆంధ్రజ్యోతి) : పొగాకు వేలం తీరుపై తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులు పోరుబాట పట్టాలని తీర్మానించినా దక్షిణాది మార్కెట్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ వారిని నియంత్రించి వేలంను సజావుగా కొనసాగించడంలో పొగాకు బోర్డు అధికారులు సఫలం కాలేకపోతున్నారు. దక్షిణాది నల్ల నేలల రీజియన్‌ (ఎస్‌బీఎస్‌) పరిధిలో మంగళవారం 60శాతం బేళ్లు తిరస్కరణకు గురవడం మార్కెట్‌ పోకడను పట్టిచూపుతోంది. తెచ్చిన బేళ్లు పరిమితమే అయినప్పటికీ వాటిలో 60శాతం వెనక్కు వెళ్లాయి. ఈ రీజియన్‌లోని ఆరు కేంద్రాల్లో టంగుటూరు రోడ్డు మరమ్మతుల కారణంగా వేలంను తాత్కాలికంగా నిలిపివేశారు. మిగిలిన ఐదు కేంద్రాలకు మంగళవారం వేలానికి 851 బేళ్లు వచ్చాయి. వాటిలో కేవలం 335 మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. 60శాతం తిరస్కరణకు గురయ్యాయి.

ఒంగోలు-2లో రైతుల నిరసన

ఒంగోలు-2 కేంద్రంలో ధరలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రైతులు వేలాన్ని నిలిపేశారు. అక్కడికి కరవది క్లస్టర్‌కు చెందిన రైతులు 95 బేళ్లు తీసుకురాగా అధికారులు సూచించిన ధరకు బయ్యర్లు కొనుగోలు చేయక 50 నోబిడ్‌ చేశారు. మరో 39 బేళ్లకు వ్యాపారులు ఇచ్చిన ధరపై రైతులు సంతృప్తి చెందక తాము ఇవ్వమని ఆపేశారు. దీంతో వేలం నిలిచిపోయింది. అనంతరం రైతులతో వేలం కేంద్రం అధికారి తులసి చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. అధికారి వైఖరిని తప్పుబడుతూ రైతులు నిరసనకు దిగారు. ఇక ఈ రీజియన్‌లోని ఒంగోలు-1 కేంద్రంలో 60శాతం బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. కొండపిలో 54శాతం, వెల్లంపల్లిలో 50శాతం వెనక్కు వెళ్లాయి. ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆ పరిధిలోని ఐదు కేంద్రాలకు 1,144 బేళ్లను రైతులు వేలానికి తీసుకురాగా 784 బేళ్లు కొనుగోలు చేశారు. 364 వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో 290 బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. పొదిలి, కనిగిరి, కందుకూరు-1 కేంద్రాల్లో తిరస్కరణలు అధికంగా ఉన్నాయి.

Updated Date - May 20 , 2026 | 02:28 AM