50,500 దరఖాస్తులు
ABN , Publish Date - Sep 19 , 2026 | 03:21 AM
కొత్త పింఛన్ల కోసం ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అధికారులు కేవలం 30వేల లోపే వస్తాయని భావించారు. అయితే దాదాపు రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు అందాయి. గడువు ముగిసిన శుక్రవారం నాటికి మొత్తం 50,500 మంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కొత్త పింఛన్‌లు కోరుతూ సమర్పణ
21లోపు పరిశీలన... నెలాఖరులోపు అర్హుల జాబితా
నవంబరు ఒకటో తేదీన పంపిణీ చేసే అవకాశం
ప్రభుత్వంపై ప్రతినెలా రూ.20కోట్ల అదనపు భారం
ఒంగోలు నగరం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : కొత్త పింఛన్ల కోసం ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అధికారులు కేవలం 30వేల లోపే వస్తాయని భావించారు. అయితే దాదాపు రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు అందాయి. గడువు ముగిసిన శుక్రవారం నాటికి మొత్తం 50,500 మంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 500 మంది అనర్హులుగా తేలినా మిగిలిన 50వేల మందికి రూ.4వేల వంతున లబ్ధి అందజేయాలంటే ప్రభుత్వంపైన ప్రతినెలా రూ.20కోట్ల అదనపు భారం పడనుంది. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుకు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. రాత్రి ఎనిమిది గంటల వరకు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ల కోసం దరఖాస్తులు అందజేస్తూనే ఉన్నారు. శనివారం ఉదయం నుంచి కొత్త పింఛన్ల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం మండల అభివృద్ధి అధికారులు ఏ కేటగిరీ దరఖాస్తులను సంబంధిత శాఖల ద్వారా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయానికి పంపనున్నారు. ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వారి వివరాలను సరిపోల్చి చూసి అర్హుల తుది జాబితాను విడుదల చేయనుంది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తిచేయనున్నారు.
ఇప్పటికే జిల్లాలో వివిధ కేటగిరీల కింద పింఛన్లు పొందుతున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి.
వృద్ధాప్య పింఛన్లు 1,10,263
వితంతు 59,250
దివ్యాంగ 21,671
ఒంటరి మహిళ 7,210
చర్మకార 3,666
మత్స్యకార 3,036
డప్పు కళాకారులు 3,273
ఇవికాక ఇతర కేటగిరీల కింద ఉన్న మొత్తం పింఛన్లు కలుపుకొని ప్రస్తుతం ప్రతినెలా ప్రభుత్వం 2,16,586 మందికి పింఛన్లను అందజేస్తోంది. ఇందుకుగాను ప్రభుత్వం ప్రతినెలా రూ.93.973 కోట్లను ఖర్చుచేస్తోంది.
తాజాగా అందిన దరఖాస్తుల వివరాలు
వృద్ధాప్య పింఛన్ 25,290
వితంతు 10,615
చర్మకార 5,114
దివ్యాంగ 4,674
డప్పు కళాకారులు 2,708
మత్స్యకారులు 1,144
మిగిలిన కేటగిరీల కింద అందిన దరఖాస్తులను కలుపుకొని మొత్తం 50,500 దరఖాస్తులు అందాయి. వీరిలో 50వేల మంది అర్హులని తేలినా వీరికి నెలవారీ పింఛన్ సొమ్ము అందించేందుకు ప్రభుత్వం ప్రతినెలా రూ.20కోట్లు భరించాల్సి వస్తోంది.
నవంబర్ ఒకటిన కొత్త పింఛన్లు
ప్రస్తుతం కొత్త పింఛన్లు కోసం అందిన దరఖాస్తులపై పూర్తిస్థాయిలో పరిశీలనను ఈ నెలాఖరుకు పూర్తయి అక్టోబరు నెలలో మంజూరు ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబరుకు సంబంధించిన పింఛన్ సొమ్మును కొత్తవారికి నవంబరు ఒకటో తేదీన ఇంటింటికి అందించే అవకాశం ఉందని అధికార వర్గాలను నుంచి అందుతున్న సమాచారం.