50వేల కనెక్షన్‌లు కట్?
ABN , Publish Date - Jul 07 , 2026 | 02:28 AM
మార్కాపురం జిల్లాలో 50 వేల గ్యాస్ కనెక్షన్‌లపై వేటు పడనుంది. ఈకేవైసీ చేయించుకోని వినియోగదారులకు తొలుత బుకింగ్ నిలిపివేసి ఆ తరువాత పూర్తిగా రద్దు చేయాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి.
ఆయిల్ కంపెనీల నిర్ణయం
ఈకేవైసీ చేయని గ్యాస్ వినియోగదారులకు షాక్
10వ తేదీ తుది గడువు
మార్కాపురం, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లాలో 50 వేల గ్యాస్ కనెక్షన్‌లపై వేటు పడనుంది. ఈకేవైసీ చేయించుకోని వినియోగదారులకు తొలుత బుకింగ్ నిలిపివేసి ఆ తరువాత పూర్తిగా రద్దు చేయాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. ఈకేవైసీ చేయించుకోకపోతే సమస్యలు తప్పవని పలుమార్లు హెచ్చరించినా జిల్లాలో ఇంకా వేల సంఖ్యలో వినియోగదారులు చేయించుకోలేదు. తాజాగా ఈనెల 10 వరకు ఆయిల్ కంపెనీలు గడువు ఇచ్చాయి. ఆతర్వాత సరఫరా నిలిపివేయనున్నాయి.
అక్రమ కనెక్షన్‌లకు చెక్
మార్కాపురం జిల్లాలో మొత్తం 25 ఏజెన్సీల పరిధిలో 3,22,279 లక్షల ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌లు ఉన్నాయి. మరో 2,700 నుంచి 3వేల లోపు వాణిజ్య సిలిండర్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈకేవైసీ ప్రస్తావన లేకపోవడంతో ఎవరైనా చనిపోతే వారి పేర్లతో బంధువులు లేదా ఇతరులు అనధికారికంగా ఆ కనెక్షన్‌ను వినియోగించుకుంటూ వస్తున్నారు. సొంత సిలిండర్లు వాడుకుంటూనే ఇలాంటి వాటిని బుక్ చేసుకుని కొందరు బ్లాక్‌లో కూడా అమ్ముకుంటున్నారు. కొన్నిచోట్ల ఏజెన్సీ నిర్వాహకులు, డెలివరీ బాయ్స్ కూడా ఇలాంటి వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈకేవైసీ నిబంధన అమలు చేయడం వలన అనధికారికంగా ఉన్న కనెక్షన్‌లు శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. ఇప్పటికైనా వినియోగదారులు ఈకేవైసీ చేయించుకోవాలని, వేలిముద్రలు పడని వృద్ధులు సమీప ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఐరిష్ తీయించి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సూచిస్తున్నారు.