స్థానిక సమరం 50 రోజులు
ABN , Publish Date - Oct 15 , 2026 | 03:19 AM
స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసింది. పురపాలక సంఘాలు, మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలు ఇలా మూడు రకాల ఎన్నికలకు షెడ్యూల్ను ఒకేసారి ప్రకటించింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల
డిసెంబరు 2కు ప్రక్రియ ముగింపు
రేపటి నుంచి అర్బన్ సంస్థల నామినేషన్లు
జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి,
చీమకుర్తి, దర్శి మున్సిపాలిటీలకు ఎన్నికలు
ఈనెల 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు
19 నుంచి పరిషత్ పోరు
27 జడ్పీటీసీ, 373 ఎంపీటీసీలకు ఎలక్షన్
మూడు విడతల్లో 515 పంచాయతీలకు..
అమలులోకి ఎన్నికల కోడ్
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు బ్రేక్
స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసింది. పురపాలక సంఘాలు, మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలు ఇలా మూడు రకాల ఎన్నికలకు షెడ్యూల్ను ఒకేసారి ప్రకటించింది. మొత్తం ప్రక్రియను డిసెంబరు 2కు ముగించనుంది. ఆ ప్రకారం స్థానిక సమరం 50రోజుల పాటు సాగనుంది. అర్బన్ స్థానిక సంస్థలు, పరిషత్ పోరు ఒకే దశలో జరగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశలుగా సాగనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది.
ఒంగోలు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సమరానికి షెడ్యూల్ విడుదలైంది. జిల్లాలో అర్బన్ స్థానిక సంస్థల్లో ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, దర్శి, చీమకుర్తి, కందుకూరు మున్సిపాలిటీలు ఉండగా ప్రస్తుతం ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కందుకూరు మినహా మిగిలిన నాలుగుచోట్ల ఎన్నికలు జరగనున్నాయి. కందుకూరులో గ్రామాల విలీనానికి సంబంధించిన కోర్టు కేసుల పరిష్కారం అనంతరం వార్డుల విభజన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అలాంటివి రాష్ట్రంలో 23 ఉండగా వాటన్నిం టికీ మరోసారి (డిసెంబరులో) ఎస్ఈసీ షెడ్యూల్ ఇవ్వనుంది. ఆ సమయంలో కందుకూరుకు ఎన్నిక జరుగుతుంది. ఒంగోలు కార్పొరేషన్తోపాటు మిగిలిన మూడు మున్సిపాలిటీలలో ప్రస్తుతం నోటి ఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి.
16 నుంచి ప్రక్రియ ప్రారంభం
జిల్లాలోని 27 జడ్పీటీసీలు, 373 ఎంపీటీసీ స్థానాలకు.. 515 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఎస్ఈసీ ప్రకటించిన ప్రకారం అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈనెల 16న ఆయా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ ఇస్తారు. అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అలా 18వ తేదీ వరకు మూడు రోజులు నామినేషన్లు స్వీకరించి 19న పరిశీలన చేస్తారు. ఉపసం హరణలకు 21వతేదీ వరకు గడువు ఇచ్చారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను 21వ తేదీ సాయంత్రం ప్రకటిస్తారు. పోలింగ్ 28వ తేదీ జరుగుతుంది. రీపోలింగ్ అవసరమైన చోట 29న నిర్వహిస్తారు. 30న ఓట్ల లెక్కింపు చేస్తారు. డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్చైర్మన్ల ఎన్నికను నవంబరు 5న నిర్వహిస్తారు.
19 నుంచి పరిషత్ ఫైట్
రెండో ఘట్టమైన మండల ప్రాదేశిక స్థానాలు (ఎంపీటీసీ), జిల్లా ప్రాదేశిక స్థానాల (జడ్పీటీసీ) ఎన్నికల నోటిఫికే షన్ను సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఈనెల 19న ప్రకటించి ఆ రోజు నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వాటి పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార ప్రక్రియలను 26కు పూర్తి చేస్తారు. నామి నేషన్ల ఉపసంహరణకు 27వ తేదీ వరకు గడువు ఇచ్చారు. నవంబరు 3న పోలింగ్ నిర్వహిస్తారు. అవసరమైనచోట 4వ తేదీన రీపోలింగ్ నిర్వహించి 5వ తేదీ ఓట్లను లెక్కిస్తారు. నవంబరు 11 నాటికి మండల, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక పూర్తి చేస్తారు.
వచ్చేనెల 15 నుంచి పల్లె పోరు
గ్రామస్థాయిలో అత్యంతకీలకమైన పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. తొలి దశకు సంబంధించి నవంబరు 15న నోటిఫికేషన్ ఇచ్చి అప్పటి నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ అనంతరం 21 నాటికి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 26న పోలింగ్ నిర్వహించి అదేరోజు ఓట్లు లెక్కించి ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. రెండో దశలో నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న తుది జాబితా ప్రకటించి 29న పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తిచేస్తారు. మూడో విడత నవంబరు 21 నుంచి 23 వరకు నామినేషన్లు, 27 వరకు ఉపసంహరణలు, అదేరోజు తుది జాబితా ప్రకటించి డిసెంబరు 2న పోలింగ్తోపాటు ఓట్ల లెక్కింపు అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది.
ఏర్పాట్లలో అధికార యంత్రాంగం
స్థానిక ఎన్నికల ప్రక్రియ జిల్లాలో 50 రోజులపాటు సాగనుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే మున్సిపల్, పరిషత్ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల పదవులకు రిజర్వేషన్లు ప్రకటించారు. పంచాయతీలను చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తనా నియామావళి (కోడ్) అమలులోకి వచ్చింది. దీంతో ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారిక సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటి అన్ని అధికారిక కార్యక్రమాలు, ప్రొటోకాల్ వంటివి నిలిచిపోనున్నాయి.
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ : కలెక్టర్
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాజాబాబు వెల్లడించారు. స్థానిక ప్రకా శం భవన్లో బుధవారం జేసీ కల్పనాకుమారితో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. ఒంగోలు కార్పొరేషన్తోపాటు మున్సిపాలిటీల్లో ఈనెల 16వతేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరిస్తారన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఈనెల 19న నోటిఫికేషన్ జారీచేస్తామని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతాయని తెలిపారు. జిల్లాలో ఐదు మున్సి పాలిటీలు ఉండగా కందుకూరు మినహా మిగి లిన చోట్ల ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నిక లను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో డీఆర్వో వెంకటరమణ, ఆయా శాఖల అధికారులు చిరంజీవి, ఎం.వెంకటేశ్వర రావు, వెంకటకృష్ణయ్య పాల్గొన్నారు.