దసరాకు 439 ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Oct 15 , 2026 | 03:12 AM
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం జి.సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఒంగోలులోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
ఈనెల 16 నుంచి 22 వరకు సాధారణ చార్జీలతో సర్వీసులు
ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ వెల్లడి
ఒంగోలు కార్పొరేషన్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం జి.సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఒంగోలులోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జిల్లాలోని మూడు డిపోల పరిధిలోని 439 బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు, అలాగే 20వతేదీ సాయంత్రం నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై ప్రాంతాలకు అద్దంకి డిపో నుంచి 85, కందుకూరు నుంచి 165, ఒంగోలు నుంచి 189 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. వాటిలో సూపర్లగ్జరీ, ఏసీ బస్సులు ఉంటాయన్నారు. అలాగే జిల్లా ప్రజలకు ఇబ్బంది లేకుండా స్త్రీశక్తి పథకం కింద మహిళలకు, విద్యార్థినులకు బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్కు 42, విజయవాడకు 145, బెంగళూరుకు 10, చెన్నైకు 10, శ్రీశైలానికి 30 సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయమని, సాధారణ చార్జీలే ఉంటాయని ఆర్ఎం తెలిపారు. పండుగకు రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.