కేజీబీవీల్లో 255 మందికి స్థానచలనం
ABN , Publish Date - May 08 , 2026 | 02:48 AM
ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు (ఎస్‌వో), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్పీ) బదిలీల కౌన్సె లింగ్ పూర్తయ్యింది. 255మందికి స్థానచలనం కలిగింది.
ముగిసిన బదిలీల కౌన్సెలింగ్
ఒంగోలు విద్య, మే 7 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు (ఎస్‌వో), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్పీ) బదిలీల కౌన్సె లింగ్ పూర్తయ్యింది. 255మందికి స్థానచలనం కలిగింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి అభ్యర్థన మేరకు వారికి స్థానాలు కేటాయించారు. సమగ్ర శిక్ష ఏపీసీ దాసరి అనిల్‌కుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. బదిలీలకు ఎస్‌వోలు 27 మంది, సీఆర్టీలు గణితం 37మంది, పీఎస్ 35, తెలుగు 32, బీఎస్ 35, సోషల్ 38, ఇంగ్లీషు 50, పీఈటీ 31, హిందీ 35, ఉర్దూ ఒకటి, పీజీటీపీఎస్ ఒకరు మొత్తం 311 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్‌వోల్లో ఒకరు ఇతర జిల్లా నుంచి వస్తుండగా, మిగిలిన 26మంది ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న వారు బదిలీ అయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో కొందరు కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. బదిలీల విషయంలో హైకోర్టును ఆశ్రయించిన వారిలో కొందరు గైర్హాజరయ్యారు. కౌన్సెలింగ్‌కు హాజరైన వారిలో మెజార్టీ వారి అభ్యర్థన మేరకు స్థానం కేటాయించగా, కొందరు పరస్పర బదిలీల కింద కొత్త స్థానాలు పొందారు. అయితే వీరికి బదిలీ పేరుతో కాకుండా రీఎంగేజ్‌మెంట్‌క పేరుతో వీరికి కొత్త స్థానాలకు నియామకపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. కాగా కేజీబీవీల్లో బోధన సిబ్బంది బదిలీల ప్రక్రియపై కొందరు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ఉత్తర్వులు లేకుండా కేవలం మౌఖిక ఆదేశాలతోనే బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. దీనిని తప్పుబడుతూ హైకోర్టులో రిట్ దాఖలు చేసినట్లు తెలిసింది.