Share News

173 పనులు.. రూ.12 కోట్లు

ABN , Publish Date - Jun 13 , 2026 | 03:07 AM

జిల్లాలో సాగునీటి కాలువల బాగుకు రంగం సిద్ధమైంది. రానున్న సీజన్‌కు సాగర్‌ కాలువల్లో సజావుగా నీటి సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యవసర పనుల కోసం ఇటీవల నిధులు మంజూరు చేసింది.

173 పనులు.. రూ.12 కోట్లు
అద్దంకి మేజర్‌ కాలువలో పగిలిపోయిన సిమెంట్‌ లైనింగ్‌

సాగర్‌ కాలువలకు మరమ్మతులు

రానున్న సీజన్‌లో సాగు నీటి సరఫరాకు ఇక్కట్లు లేకుండా చర్యలు

నీటి సంఘాలకు అధిక శాతం కేటాయింపు

సకాలంలో పూర్తిచేస్తేనే ఫలితం

గత ఏడాది రూ.10.51 కోట్లతో 204 పనులు

అధికశాతం పూర్తి, బిల్లులు రాక ఇక్కట్లు

జిల్లాలో సాగునీటి కాలువల బాగుకు రంగం సిద్ధమైంది. రానున్న సీజన్‌కు సాగర్‌ కాలువల్లో సజావుగా నీటి సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యవసర పనుల కోసం ఇటీవల నిధులు మంజూరు చేసింది. జలవనరులశాఖ ఒంగోలు సర్కిల్‌లో ఉన్న మూడు డివిజన్ల పరిధిలో కాలువల మరమ్మతుల కోసం రూ.12 కోట్లు కేటాయించింది. వీటితో 173 పనులు చేపట్టను న్నారు. నీరు విడుదల చేసే లోపు ఆ పనులు పూర్తిచేస్తేనే ఉపయోగం.

ఒంగోలు, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ ప్రభుత్వంలో సాగర్‌ కాలువల పర్యవేక్షణను గాలికొది లేశారు. దీంతో చిన్న, పెద్దకాలువలు అధ్వానంగా మారి నీటి సరఫరా సరిలేక రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక వాటిపై దృష్టిపెట్టింది. 2024 సీజన్‌లో ప్రభుత్వం ఏర్పడి పరిస్థితులు కుదుటపడే లోపు కాలువలకు నీరు రావడంతో బాగుచేయడం సాధ్యపడలేదు. దీంతో గత ఏడాది నీటి సరఫరాలోపు అత్యవసరమైన పనులు చేశారు. అప్పటికే సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తవడంతో ఆ సంఘాల ద్వారా ఒంగోలు సర్కిల్‌ పరిధిలో రూ.10.51 కోట్లతో 204 పనులు చేపట్టారు. ప్రధానంగా జంగిల్‌ క్లియరెన్స్‌, కాలువల్లో పూడికతీత, డ్రాపులు, షట్టర్లకు మరమ్మతులు వంటివి చేశారు. అప్పట్లో మంజూరు చేసిన పనులన్నీ రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఉన్నాయి. ఇంచుమించు పనులన్నీ పూర్తిచేయడంతో గత సీజన్‌లో నీటి సరఫరాకు ఇక్కట్లు తీరాయి. అయితే అప్పుడు చేసిన పనులకు ఇప్పటివరకు కూడా బిల్లులు రాక పనులు చేసిన వారు ఇబ్బంది పడుతున్నారు.

పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం

ఏటా కాలువలకు అవసరమైన మరమ్మతులు చేస్తేనే నీటి సరఫరా సాఫీగా సాగుతుంది. దీంతో ఈ ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా అలాంటి పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో ఒంగోలు సర్కిల్‌ పరిధిలోని సాగర్‌ కాలువల్లో 173 పనుల కోసం రూ.12 కోట్లు కేటాయించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఒంగోలు సర్కిల్‌ పరిధిలో సాగర్‌ కాలువలు ఆరు నియోజకవ ర్గాల్లో ఉండగా మంజూరైన రూ.12కోట్లలో అత్యధికంగా దర్శి నియోజకవర్గానికి రూ.3 కోట్లు ఉన్నాయి.

నీటి సంఘాలకే పనులు

ఒంగోలు సర్కిల్‌లో మంజూరైన పనులలో 90శాతానికిపైగా గతంలో మాదిరిగా నీటి సంఘాల ద్వారానే చేపడుతున్నారు. పది శాతం పనులకు టెండర్లు పిలిచినట్లు సమాచారం. గత ఏడాది చేసిన పనులకు ఇప్పటివరకు బిల్లులు రాకపోవడంతో కొన్నిచోట్ల నీటిసంఘాల వారు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో అటు ముఖ్యప్రజాప్రతినిధులు, ఇటు సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని వారితో మాట్లాడి ఈసారి కూడా పనులు చేసేవిధంగా ఒప్పిస్తున్నారు. సకాలంలో పనులు పూర్తిచేస్తేనే తప్ప వాటి వల్ల ఆశించిన ఫలితం ఉండే అవకాశం లేదు. అయితే ఎక్కువ పనులు చిన్నచిన్నవి కావడం వల్ల నీటి సరఫరా జరిగేలోపు పూర్తిచేస్తామన్న ధీమాను సంబంధిత అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 13 , 2026 | 03:08 AM