Share News

17 ఏళ్లు..!

ABN , Publish Date - Jan 25 , 2026 | 11:19 PM

ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయిస్తూ అసంపూర్తి పనులను పూర్తిచేస్తోంది. ఈక్రమంలో అద్దంకి నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులలో ఒకటిగా ఉన్న భవనాసి రిజర్వాయర్‌ అసంపూర్తి పనులపై కూడా రైతులు గంపెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు.

17 ఏళ్లు..!
గుండ్లకమ్మ నది నుంచి భవనాసి చెరువుకు నీటి సరపరా జరిగేందుకు ఏర్పాటు చేసిన కాలువలో అసంపూర్తిగా పనులు

అప్పట్లో భవనాసి రిజర్వాయర్‌కు శంకుస్థాపన

రూ.27 కోట్ల ప్రతిపాదనతో ప్రారంభమైన పనులు

ప్రస్తుతం రూ.90 కోట్లకు చేరుకున్న అంచనాలు

ప్రజా ప్రభుత్వంపైనే రైతుల గంపెడు ఆశలు

అద్దంకి, జనవరి 25(ఆంధ్రజ్యోతి) : ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయిస్తూ అసంపూర్తి పనులను పూర్తిచేస్తోంది. ఈక్రమంలో అద్దంకి నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులలో ఒకటిగా ఉన్న భవనాసి రిజర్వాయర్‌ అసంపూర్తి పనులపై కూడా రైతులు గంపెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. గుండ్లకమ్మ నది నుంచి నేల కాలువ ద్వారా నీటిని తీసుకొచ్చి ఎక్కువ నీరు నిల్వ ఉండే విధంగా భవనాసి చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు 2009లో అప్పటి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ శంకుస్థాపన చేశారు. రూ.27 కోట్లతో 4 ప్యాకేజీలుగా పనులు విభజించి టెండర్‌లు పిలిచి పనులు ప్రారంభించారు. చెరువు కట్ట పటిష్టం చేయటం, గుండ్లకమ్మ నదిలో చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులు అత్యధికశాతం పూర్తయ్యాయి. ఇక భూసేకరణకు కొంతమేర నిదులు చెల్లించాల్సి ఉంది. అదేసమయంలో ప్రధాన అడ్డంకిగా ఉన్న కాలువ తవ్వకం పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఉప్పలపాడు, మైలవరం సమీపంలో కాలువ తవ్వకం జరిగే ప్రాంతంలో పెద్దపెద్ద రాళ్లు ఉండటంతో తొలగించేందుకు బ్లాస్టింగ్‌లు చేయాల్సి వచ్చింది. బ్లాస్టింగ్‌కు అనుమతులు లేకపోవటంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాంతాలలో భూసేకరణ సమస్యలు కూడా తలెత్తాయి.

ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రత్యేక దృష్టి సారించి అధికారులతో సమావేశం నిర్వహించారు. అంచనా వ్యయం సుమారు రూ.90 కోట్ల వరకు అవుతుందని అంచనా వేసినట్లు తెలుస్తుంది. రవికుమార్‌ ప్రత్యేక దృష్టి సారించి ఉన్న నేపథ్యంలో నిధులు మంజూరు జరిగి వెంటనే పనులు ప్రారంభమవుతాయన్న ఆశతో రైతులు ఉన్నారు. ఇప్పట్లో పనులు పూర్తి కాకపోతే ఇక ఎప్పటికీ భవనాసి రిజర్వాయర్‌ పనులు పూర్తయ్యే అవకాశం ఉండదనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 25 , 2026 | 11:19 PM