Share News

ఒంగోలు జీజీహెచ్‌లో 16 మందికి వైద్యం

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:45 PM

కళ్లు తెరిచేలోపు ఎగసిపడే మంటలు.. ఎవరి నోట విన్నా ఏడుపులు, కేకలు. బతుకుతామో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న బస్‌ ప్రమాద బాధితుల్లో కొందరు ఒంగోలు జీజీహెచ్‌కు చేరారు. 16 మంది చికిత్స పొందుతున్నారు. ఇక్కడి అధికారులు అప్రమత్తమై అవసరమైన వైద్యం ప్రారంభించారు.

ఒంగోలు జీజీహెచ్‌లో 16 మందికి వైద్యం
చికిత్స పొందుతున్న తల్లీ కొడుకు

హుటాహుటిన స్పందించిన అధికారులు

శ్రమిస్తున్న వైద్యులు

బాధితులను ధైర్యం చెప్పిన జేసీ

ఆస్పత్రిలో హెల్ప్‌ లైన్‌ సెంటర్‌

ఒంగోలు కార్పొరేషన్‌, మార్చి 26 (ఆంద్రజ్యోతి) : కళ్లు తెరిచేలోపు ఎగసిపడే మంటలు.. ఎవరి నోట విన్నా ఏడుపులు, కేకలు. బతుకుతామో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న బస్‌ ప్రమాద బాధితుల్లో కొందరు ఒంగోలు జీజీహెచ్‌కు చేరారు. 16 మంది చికిత్స పొందుతున్నారు. ఇక్కడి అధికారులు అప్రమత్తమై అవసరమైన వైద్యం ప్రారంభించారు.

బాధితులకు వైద్యసేవలు ముమ్మరం

బాధితుల్లో కనిగిరికి చెందిన లక్ష్మి కుమారికి 25 శాతానికిపైగా శరీరం కాలిపోయింది. ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు.

పీసీపల్లికి చెందిన జేమ్స్‌కు కుడి భుజం తొలగిపోవడంతోపాటు స్వల్ప గాయాలయ్యాయి.

అదే ప్రాంతానికి చెందిన చిట్టిబాబుకు ఎడమ వైపు వెన్నెముక దెబ్బతినింది.

తిరుపాలుకు శరీరం కాలి బొబ్బలు రావడంతో సిటీ స్కాన్‌, చెస్ట్‌ ఎక్స్‌రే తీసి వైద్యం అందిస్తున్నారు.

కనిగిరికి చెందిన మనోహర్‌ శరీరంలోని వివిధ బాగాల్లో ఎముకలు విరిగిపోవడంతోపాటు కుడివైపు నడుముపై ఒత్తిడి పడి, కదలలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నెల్లూరుకు మూడేళ్ల చందుకు కుడికాలు విరిగిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలుడు తల్లి చందనకు స్వల్పగాయాలయ్యాయి. కడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది.

వీజీ పల్లికి చెందిన మణెమ్మకు లివర్‌ దెబ్బతినగా, కడుపులో నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు.

ఎల్‌ఆర్‌పురానికిచెందిన శ్రీహరికి రెండు వైపుల పక్కటెముకలు దెబ్బతినడంతో నిలబడలేని పరిస్థితిలో వైద్యం పొందుతున్నాడు.

వింజమూరుకు చెందిన సురేంద్ర స్వల్ప గాయాలయ్యాయి. అదే ఊరికి చెందిన ఆమోస్‌ పరిస్థితి నిలకడగానే ఉండగా, 20 శాతం శరీరమంతా కాలిపోవడంతో తీవ్రమైన ఒళ్ళు మంటలతో విలపిస్తున్నాడు.

కనిగిరికి చెందిన మౌనిక అనే విద్యార్థిని తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కనిపించని గాయాలతో విలవిల్లాడుతోంది.

బస్‌ సెకండ్‌ డ్రైవర్‌ యువరాజు పరిస్థితి నిలకడగానే ఉండగా, జీజీహెచ్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అలాగే కే అబ్రహానికి కాలువిరగ్గా, ప్రవీణ్‌కు తలకు దెబ్బతగిలింది.


జేసీ కల్పన కుమారి పరామర్శ

ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. జేసి కల్పనా కుమారి బాధితులను పరామర్శించారు. ఆమె కొద్దిసేపు ఆసుపత్రిలోనే ఉండి వారికి వైద్య పరీక్షలు చేయడంతోపాటు, అందిస్తున్న వైద్యాన్ని పరిశీలించారు.

ప్రాణాపాయం లేదు

జీజీహెచ్‌లో వైద్యం పొందుతున్న బాధితులకు ప్రాణాపాయం లేదు. నిరంతరం వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

- డాక్టర్‌ మాణిక్యరావు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

Updated Date - Mar 26 , 2026 | 11:45 PM