ఒంగోలుకు 150 వసంతాలు
ABN , Publish Date - Aug 17 , 2026 | 10:56 PM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఏకైక ఒంగోలు నగరపాలక సంస్థ 150 ఏళ్ల వేడుకలకు ముస్తాబైంది. ఈ ఏడాది మే 1 నుంచి రానున్న సెప్టెంబరు నెలాఖరు వరకు ఐదు నెలలపాటు పండుగ వాతావరణంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా కలెక్టర్, కార్పొరేషన్ స్పెషలాఫీసర్ రాజాబాబు, ఎమ్మెల్యే జనార్దన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
నగర కార్పొరేషన్ వేడుకలకు ముస్తాబు
1876లో మూడో గ్రేడ్ మునిసిపాలిటీగా ఆవిర్భావం
ఈనెల 24 నుంచి వివిధ కార్యక్రమాలు
వచ్చే నెల 28, 29, 30 తేదీలలో ముగింపు ఉత్సవాలు
రోజూ 20మంది ప్రముఖులకు గౌరవ పురస్కారాలు
సాంస్కృతిక సంబరాలు, క్రీడా పోటీల నిర్వహణ
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 17 (ఆంధ్రజోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఏకైక ఒంగోలు నగరపాలక సంస్థ 150 ఏళ్ల వేడుకలకు ముస్తాబైంది. ఈ ఏడాది మే 1 నుంచి రానున్న సెప్టెంబరు నెలాఖరు వరకు ఐదు నెలలపాటు పండుగ వాతావరణంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా కలెక్టర్, కార్పొరేషన్ స్పెషలాఫీసర్ రాజాబాబు, ఎమ్మెల్యే జనార్దన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వేడుకల ముగింపు సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిఽధుల సహకారంతో నగర చరిత్రను, గొప్పతనాన్ని చాటేలా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలుత ఆవిర్భావమిలా...
1876లో ఒంగోలు మూడో గ్రేడ్ మునిసిపాలిటీగా ఆవిర్భవించింది. ఆ తర్వాత అంచలంచెలుగా అభివృద్ధి వైపు అడుగులేసి జిల్లాలో ఏకైక కార్పొరేషన్‌గా ప్రత్యేక హోదా సంతరించుకుంది. తొలుత 1876 సెప్టెంబరు 30న ఒంగోలు మునిసిపాలిటీకి మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1970వ సంవత్సరం ఫిబ్రవరి 2న ద్వితీయ శ్రేణి మునిసిపాలిటీగా ప్రకటించారు. తదుపరి రెండేళ్లలోనే 1972లో మొదటిగ్రేడ్ మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ పొందింది. 1983లో స్పెషల్‌గ్రేడ్ మునిసిపాలిటీగా, చాలాకాలం తర్వాత అంటే 2001లో ఒంగోలు చుట్టూ ఉన్న మూడు పంచాయతీలను విలీనం చేశాక స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీగా హోదా పొందింది. 11 ఏళ్ల తర్వాత 2012లో జనవరి 21న కార్పొరేషన్‌గా హోదా సాధించగా, 2026 సెప్టెంబరులో 150 వసంతాలు వేడుకలకు ముస్తాబవుతోంది.
ప్రస్తుతం 134.45 చదరపు కిలోమీటర్ల పరిధిలో...
ఒంగోలు ప్రస్తుతం పెద్ద పెద్ద నగరాలకు తీసిపోని విధంగా అవసరమైన విద్య, వ్యాపారం, వైద్యం అందుబాటులోకి వచ్చాయి. అప్పటివరకు మొత్తం 25 చ.కి.మీ. విస్తరించిన నగరం ప్రస్తుతం 134.45 చ. కి.మీ. నగరంగా అభివృద్ధి చెందింది. అదే సమయంలో 2001 నాటిలెక్కల ప్రకారం 1,92,063 ఉన్న జనాభా 2011 నాటికి 2,02,826కు చేరింది. అనంతరం నగరంలో పది గ్రామాలు విలీనం కావడంతో ఆ పది గ్రామాల జనాభా 49,868 మంది కలుపుకుని ప్రస్తుతం 3లక్షలకు పైన దాటింది. దీంతో 50 డివిజన్‌లుగా విభజించగా, అందులో 61,694 గృహాలు ఉన్నాయి.
ప్రజలను భాగస్వామ్యం చేస్తూ..
ఇదిలా ఉంచితే 2021లో తొలిసారి ఒంగోలు నగరపాలకసంస్థ పాలకవర్గం ఏర్పాటైంది. మొదటిసారి కార్పొరేషన్ పీఠం వైసీపీ కైవసం చేసుకోగా, 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించడంతో ఆ పీఠాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. ఈ ఏడాది మార్చి 17న పాలక వర్గం పదవీ కాలం ముగియడంతో అప్పటి నుంచి కలెక్టర్ రాజాబాబు కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ 150 వసంతాల వేడుకలను సెప్టెంబరు నెలాఖరు వరకు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆగస్టు 24వ తేదీ నుంచి వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి చర్యలు చేపట్టారు. అలాగే సెప్టెంబరు 28, 29, 30 తేదీలలో అంగరంగ వైభవంగా మూడు రోజులపాటు సంబరాలు జరపనున్నారు. ఆ వేడుకలలో ప్రజలనుభాగస్వామ్యం చేయడంతోపాటు నగర సుందరీకరణ, అభివృద్ధి, నగర చరిత్రను తెలియజేసేలా వివిధ కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల సహకారంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ఈనెల 24 నుంచి వివిధ కార్యక్రమాలు
24వ తేదీ నుంచి సెప్టెంబరు 23 వరకు వివిధ రకాల క్రీడా పోటీలు
చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్, ఫొటోగ్రఫీ, వీడియో, సంగీతం, నృత్యం, సాహిత్యం, నాటకరంగం తదితర అంశాలలో పోటీలు
23వ తేదీ మన ఒంగోలు 150 ఏళ్లు.. వారసత్వ నడక
30వ తేదీ పుస్తక ప్రదర్శన, ఫొటో గ్యాలరీ, ఆర్ట్ గ్యాలరీ, ప్రముఖుల చిత్రాలతో వాల్ ఆఫ్ ఫేమ్
సెప్టెంబరు 7 నుంచి 13వ తేదీ వరకు వివిధ క్రీడా పోటీల నిర్వహణ(స్పోర్ట్స్ వీక్ )
సెప్టెంబరు 13వ తేదీ ఫిట్ ఒంగోలు (ఒకే రోజు 150 ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు)
చివరి మూడు రోజుల ముగింపు ఉత్సవాలు
ప్రతిరోజూ ఆయా రంగాలలో విశిష్ట సేవలందించిన 20 మంది ప్రముఖులకు సన్మానాలు, పురస్కారాలు
150 వసంతాల వేడుకల సందర్భంగా చివరి మూడు రోజుల సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు.
28వ తేదీనవిద్య, వైద్యం, క్రీడా, మహిళ రంగాలకు సంబంధించిన ప్రముఖులకు గౌరవ పురస్కారాలు
29వ తేదీన సాహితీ, నాటక, లలిత కళల రంగాల్లో పురస్కారాలు
30వ తేదీన రాజకీయం, సినీ, సామాజిక రంగాలలో పురస్కారాలు
మూడు రోజుల చరిత్ర, సంస్కృతి, కళలు, సేవ, ప్రతిభకు అపూర్వ సంగం అంశాలపై చర్చ. సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ
ప్రముఖుల సేవలకు గుర్తింపు, పురస్కారాలు
రాజకీయ రంగం
మాదాల నారాయణ స్వామి (తొలి శాసనసభ్యులు, తొలి పార్లమెంట్ సభ్యులు)
బొల్లినేని వెంకటలక్ష్మినారాయణ(బీవీఎల్ నారాయణ), రెండుసార్లు స్వతంత్ర ఎమ్మెల్యే
రొండా నారపరెడ్డి (జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి) మాజీ ఎంపీ, మాజీ మంత్రి
వరదా శ్రీరాములు నాయుడు (ఒంగోలు మునిసిపాలిటీ తొలి చైర్మన్)
సాహితీ రంగం
నాగభైరవ కోటేశ్వరరావు, సాహితీ రూపకర్త,
పైడి తేరే్‌షబాబు, దళిత కవి
మల్లవరపు జాన్, మధుర కవి
సినిమా రంగం
భానుమతి,
జి. వరలక్ష్మి
టి. కృష్ణ
కాంచన
ఎంవీఎస్ శాస్త్రి
సంగీతం, నాటక, కళా రంగాలు
బండారు రామారావు, నాటక కళాకారుడు
పద్మశ్రీ షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు
దారా రామనాథ శాస్త్రి, నాట్యావధానం
పత్రికా రంగం
నీలంరాజు వెంకటశేషయ్య
పరిశోధన రంగం
భద్రిరాజు కృష్ణమూర్తి, ఆధునిక ద్రావిడ భాషాశాస్త్ర పితామహుల్లో ఒకరు
పరిపాలన రంగం
కత్తి చంద్రయ్య, రిటైర్డ్ కలెక్టర్