హత్య కేసులో 13 మందికి యావజ్జీవం
ABN , Publish Date - Jun 11 , 2026 | 03:00 AM
పాతకక్షల నేపథ్యంలో దారికాచి వ్యక్తిని హత్య చేసిన కేసులో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ఆరవ అదనపు న్యాయాధికారి వి.భవాని మార్కాపురం కోర్టులో తీర్పు చెప్పారు. 2017 మే 17న జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విచారణ అనంతరం దోషులుగా తేల్చిన మార్కాపురం కోర్టు
శిక్ష విధిస్తూ జిల్లా ఆరో అదనపు న్యాయాధికారి తీర్పు
మార్కాపురం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : పాతకక్షల నేపథ్యంలో దారికాచి వ్యక్తిని హత్య చేసిన కేసులో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ఆరవ అదనపు న్యాయాధికారి వి.భవాని మార్కాపురం కోర్టులో తీర్పు చెప్పారు. 2017 మే 17న జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పొదిలి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కంచర్ల శ్రీనుపై రాజకీయ, పాతకక్షలు పెంచుకున్న అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు అతనిని హత్య చేయాలని పథకం పన్నారు. పొదిలిలో ఒక వివాహ వేడుకలో పాల్గొని మోటార్ సైకిల్‌పై తిరిగి రాజుపాలెం వెళుతున్న శ్రీనును దారికాచి కత్తులు, కర్రలు, గొడ్డళ్లు, ఇనుపరాడ్డు వంటి మారణాయుధాలతో దాడిచేసి కొట్టారు. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు ఆసమయంలో పొదిలి ఇన్‌చార్జి ఎస్సైగా ఉన్న అప్పటి మర్రిపూడి ఎస్సై వై.శ్రీహరి కేసు నమోదు చేశారు. అప్పటి పొదిలి సీఐ ఎం.శ్రీనివాసరావు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కేసులో నిందితులుగా ఉన్న చల్లా వెంకటేశ్వర్లు, చల్లా వెంకట నరసింహం, చల్లా శ్రీను, చల్లా అనిల్, లోమడ హరిబాబు, చలివేంద్రం ప్రసాద్, చల్లా రమేష్, సన్నెబోయిన కృష్ణయ్య, చల్లా నాగయ్య, దోసపాటి వెంకయ్య, దోసపాటి శ్రీనివాసులు, జూపల్లి శివయ్య, చల్లా రవి మొత్తం 13మందిని దోషులుగా కోర్టు తేల్చింది. వీరికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధిస్తూ బుధవారం జిల్లా ఆరవ అదనపు న్యాయాధికారి వి.భవాని తీర్పు వెల్లడించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా నెలరోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.