1,160 యూనిట్లు.. రూ.4.18 కోట్ల సబ్సిడీ
ABN , Publish Date - May 02 , 2026 | 03:20 AM
సాగులో ఉపకరించే వ్యవ సాయ యంత్ర పరికరాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రారంభించారు. గతానికి భిన్నంగా ఈసారి పూర్తి పారదర్శకంగా సాగేలా ప్రభుత్వం నిర్ణయిం చింది.
జిల్లాకు వ్యవసాయ యంత్ర పరికరాలు కేటాయింపు
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
లాటరీ ద్వారా ఎంపిక
పారదర్శకంగా ప్రక్రియ
40 నుంచి 50శాతం సబ్సిడీపై 9 రకాల పరికరాలు
ఒంగోలు, మే 1(ఆంధ్రజ్యోతి) : సాగులో ఉపకరించే వ్యవ సాయ యంత్ర పరికరాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రారంభించారు. గతానికి భిన్నంగా ఈసారి పూర్తి పారదర్శకంగా సాగేలా ప్రభుత్వం నిర్ణయిం చింది. వ్యవసాయశాఖ ఇచ్చిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసు కుంటే వాటిని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పరిశీలించిన అనంతరం జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షణలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. అలా జిల్లాకు 2025-26కు సంబంధించి 1,160 యూనిట్లు మంజూరయ్యాయి. అందుకోసం ప్రభుత్వం రూ.4.18 కోట్లు సబ్సిడీగా ఇవ్వనుంది. ఈ పథకం కింద తొమ్మిది రకాల యంత్ర పరికరాలు అందజేయనున్నారు. వాటిలో ప్రధానంగా ట్రాక్టర్‌తో నడిచే పరికరాలైన గొర్రు, నాగళ్లు, రోటోవేటర్, స్వీయచోదక పరికరాల విభాగంలోని పవర్ ట్రిల్లర్లు, పవర్ వీడర్లు, బ్రస్ కట్టర్లు, పురుగుమందులు పిచికారీ చేసే స్ర్పేయర్లు, 40 హెచ్‌పీలోపు ఉండే మినీట్రాక్టర్లు వంటివి ఉన్నాయి. సన్న, చిన్నకారు ఎస్సీ, ఎస్టీ, అలాగే మహిళా రైతులకు 50శాతం, ఇతర రైతులకు 40శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు.
ట్రాక్టర్లకే అధికంగా కేటాయింపు
ఆసక్తి ఉన్న రైతులు ఈఎస్‌ఈఈడీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ముగిశాక ఇన్‌చార్జి మంత్రి ఆమోదం పొందాక వారి వివరాలను, అర్హతలను జిల్లాస్థాయి కమిటీ పరిశీలించి లాటరీ ద్వారా ఎంపిక చేస్తుంది. జేసీ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీకి జిల్లా వ్యవసాయశాఖ అధికారి కన్వీనర్‌గా, హార్టికల్చర్, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. కాగా జిల్లాకు కేటాయించిన 1,160 యూనిట్లలో 175 యూనిట్లు ఎస్సీ రైతులకు, 48 యూనిట్లు ఎస్టీ రైతులకు మిగిలిన 937 ఇతరులకు కేటాయించారు. పరికరాల వారీగా చూస్తే జిల్లాకు 30 ట్రాక్టర్లను కేటాయించారు. మొత్తం రూ.4.18 కోట్ల సబ్సిడీలో ఈ విభాగానికే రూ.1.04 కోట్లు కేటాయించారు. అలాగే 90 పవర్ ట్రిల్లర్లు, 624 స్ర్పేయర్లు ఇతర విభాగాల వారీగా కేటాయింపులు చేశారు. అర్హత ఉన్న రైతులు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ రాయితీ ద్వారా కల్పించిన యంత్ర పరికరాలను పొందాలని డీఏవో ఎస్.శ్రీనివాసరావు కోరారు.