బాబు ఇంట మోదీ
ABN , Publish Date - May 11 , 2026 | 04:05 AM
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలపై చర్చించుకున్నారు. ఈ భేటీలో మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు.
లోకేశ్‌తో కలిసి రాజకీయ చర్చలు.. హైదరాబాద్‌లో
గంటా పది నిమిషాలు మంతనాలు
తెలంగాణ, ఏపీ రాజకీయాలపై ప్రధాన చర్చ
ప్రధానికి స్వాగతం పలికిన నారా కుటుంబం
దేవాంశ్‌ను దగ్గరకు తీసి భుజాలపై చేయి వేసి మాట్లాడిన మోదీ
వెంకటగిరి చేనేత కళాకారులు జామ్దానీ నేతతో తయారుచేసిన శ్రీవారి చిత్రపటం మోదీకి బహూకరణ
ప్రధానితో సమావేశం.. మాకెంతో ప్రత్యేకం: సీఎం
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలపై చర్చించుకున్నారు. ఈ భేటీలో మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఆదివారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని.. సాయంత్రం 5.15 గంటలకు జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. దాదాపు గంటా పది నిమిషాలకు పైగా అక్కడే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఉభయులూ చర్చించారు. ఏపీలో ఎన్‌డీఏ భాగస్వాముల మధ్య ఉన్న సాన్నిహిత్యం.. తెలంగాణలో కూడా ఎలా ప్రతిబింబింపజేయాలో మాట్లాడుకున్నారు. ‘పొత్తుల అంశం వరకు వెళ్లకున్నా.. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ అభిమానులను ఏ విధంగా బీజేపీ వైపు మళ్లించాలి.. త్వరలో హైదరాబాద్ పరిధిలో రాబోయే మూడు కార్పొరేషన్ల ఎన్నికలు.. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి’ అన్నదానిపై చర్చ జరిగి ఉంటుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీలో అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలూ ఇద్దరి మధ్య చర్చకొవచ్చాయి. ఇరాన్ యుద్ధ పరిణామాలపైనా మాట్లాడుకున్నారు.
తెలుగు వంటకాలతో..ప్రధానికి తేనీటి విందు
అంతకుముందు.. తమ నివాసానికి వచ్చిన ప్రధానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. ఇంట్లోకి వెళ్లగానే పూజామందిరంలోని సీతారాములకు ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌లను మోదీ ఆప్యాయంగా పలుకరించారు. దేవాంశ్ భుజాలపై చేయి వేసి, మాట్లాడుతూ ముందుకు కదిలారు. తెలుగు వంటకాలతో నారా కుటుంబం ఇచ్చిన తేనీటి విందును స్వీకరించారు. అనంతరం వెంకటగిరి చేనేత కళాకారులు జామ్దానీ నేతతో తయారుచేసిన శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. తర్వాత చంద్రబాబు, మోదీ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
సరదా సంభాషణలు.. నవ్వుల సందడి
మోదీ, చంద్రబాబు రాజకీయాల్లో ఇద్దరూ ఉద్దండులే. నిత్యం అభివృద్ధి-సంక్షేమం, దేశం, రాష్ట్రం గురించే నిత్యం వీరి ఆలోచనలు సాగుతుంటాయి. ఈ క్రమంలో ఇద్దరూ గంభీరంగా ఉంటుంటారు. అలాంటి వీరిద్దరి మధ్య చాలా సరదాగా సంభాషణ జరిగింది. సమావేశం ఆసాంతం నవ్వులు విరబూశాయి. లోకేశ్ యువగళం కాపీ టేబుల్ బుక్‌ను మోదీ ఆవిష్కరించినప్పటి ఫొటోను వాల్ ఫ్రేమ్‌గా చేయించి ఇంట్లో పెట్టారు. ఆ ఫొటోను చూసిన మోదీ.. అప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. నివాసంలోని పూజా మందిరంలో ఉన్న సీతారాముల విగ్రహాలు దశాబ్దాల నాటివని, ఆ పంచలోహ విగ్రహాలను ఎన్టీఆర్ తమకు ఇచ్చారని చంద్రబాబు వివరించారు.

లోకేశ్.. ఇక బరువు తగ్గకు!
లోకేశ్ ఫిట్‌నెస్ పై ఆసక్తికర చర్చ జరిగింది. లోకేశ్ స్లిమ్‌గా అవ్వడానికి మీరే కారణమని, తొలిసారి మిమ్మల్ని కలిసినప్పటి నుంచే ఫిట్‌నెస్, డైట్‌పై శ్రద్ధ పెట్టారని చంద్రబాబు ప్రధానితో అన్నారు. స్పందించిన మోదీ.. ఇక బరువు తగ్గొద్దని లోకేశ్‌కు సలహా ఇచ్చారు. మరింత ఫిట్‌గా మారతానని బదులిచ్చిన లోకేశ్.. ఫిట్‌నెస్ విషయంలో మీరే స్ఫూర్తి అని ప్రధానికి చెప్పారు. దేశం కోసం క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారని, 75ఏళ్ల వయసులో మీరు పాటించే ఆరోగ్య సూత్రాలు, శారీరక దృఢత్వం తనకు స్ఫూర్తి అని తెలిపారు. 25 ఏళ్ల వయస్సున్న ముగ్గురు యువకులు ప్రధానిలో ఉన్నట్లుగా చురుగ్గా పనిచేస్తారని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ తనకు మెంటార్లేనని లోకేశ్ అన్నారు. రాజకీయాల్లో, అభివృద్ధిలో, ప్రజా సంక్షేమంలో తనకు మార్గదర్శకులని, ఇద్దరినీ గురువులుగా అనుసరిస్తానని చెప్పారు. భావితరాల కోసం నిస్వార్ధంగా పనిచేసే వారిద్దరి వేగాన్ని అందుకోవాలనే తన కల సాకారం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా.. మోదీని ఎప్పుడు కలిసినా మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించడాన్ని లోకేశ్ ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆదివారం కూడా మంగళగిరి చేనేత శాలువాతో ప్రధానిని సత్కరించారు.
మధుర జ్ఞాపకం: బాబు
మోదీ తమ నివాసానికి రావడంపై చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘మా కుటుంబం ఎప్పటికీ మరచిపోలేని మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే సాయంత్రమిది. ఈ రోజు మా నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇవ్వడం మాకు లభించిన గొప్ప గౌరవం, సంతోషం. ఆప్యాయత, అనురాగంతో ప్రధాని మాతో గడిపిన ఈ సందర్భం మా అందరికీ ఎంతో ప్రత్యేకం. మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి విచ్చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో ఆయన అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి, మద్దతుకు నా కృతజ్ఞతలు’ అని తెలిపారు.

ప్రధాని మెచ్చిన యువ మంత్రి
దేశంలో 28 రాష్ర్టాలున్నాయి. ఏ రాష్ట్ర మంత్రికీ దక్కని అరుదైన అవకాశం లోకేశ్‌కు దక్కుతోంది. ప్రధాని మోదీతో తరచూ భేటీ అవుతున్నారు, వివిధ సందర్భాల్లో వేదిక పంచుకునే అవకాశం దక్కిన ఏకైౖక మంత్రి కూడా ఆయనే. ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీ నేతగా కాకుండా కుటుంబసభ్యుడిలా ఆదరించే మోదీ ఆత్మీయతకు లోకేశ్ అభిమానిగా మారారు. 2024 ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసినప్పుడు ప్రధాని ఏపీ లో పాల్గొన్న సభలు విజయవంతం కావడంలో లోకేశ్ ప్రణాళికలు ఉన్నాయని తెలుసుకున్న మోదీ అప్పుడే ఆయన్ను అభినందించారు.
నమో-నారా బంధం.. తరగని అనుబంధం!
టీడీపీ-బీజేపీలకు రాజకీయంగా మైత్రీబంధం ఉన్నప్పటికీ... ప్రధాని మోదీతో నారా ఫ్యామిలీకి కుటుంబపరంగానూ అనుబంధం ఏర్పడింది. మోదీ-చంద్రబాబు మధ్య రాజకీయంగా సాన్నిహిత్యం.. లోకేశ్ కారణంగా కుటుంబ బంధంగా మారిందనే చెప్పాలి. గతంలో ఆయన్ను కుటుంబంతో ఢిల్లీలోని తన ఇంటికి మోదీ ఆహ్వానించారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి వచ్చినప్పుడు.. ‘నీకెన్నిసార్లు చెప్పాలి.. నన్ను కలవడానికి రావా’ అని వేదికపైనే యువనేతతో గట్టిగా అన్నారు. ఈ అరుదైన ఆహ్వానంతో లోకేశ్.. త్వరలోనే ఢిల్లీ వస్తానని ప్రధానికి చెప్పారు. ఆ ప్రకారమే భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌తో కలిసి వెళ్లారు. వారికి 2గంటల పాటు ప్రధాని సమయం కేటాయించారు. కుటుంబ యోగక్షేమాలు, చదువు సహా అన్ని వివరాలు తెలుసుకుని దేవాంశ్‌ను ఒళ్లో కూర్చోపెట్టుకుని మాట్లాడారు. అప్పుడే తన పాదయాత్ర విశేషాలతో కూడిన ‘యువగళం’ కాఫీ టేబుల్ బుక్‌ను ప్రధానితో లోకేశ్ ఆవిష్కరింపజేసి.. తొలి ప్రతిని అందజేశారు.

మరచిపోలేని తీపి జ్ఞాపకం: భువనేశ్వరి
ప్రధాని మోదీ మా ఇంటికి అతిథిగా రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘మోదీకి నారా కుటుంబంలోని మూడు తరాల వాళ్లు ఆత్మీయస్వాగతం పలికి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. మా తండ్రి తారక రాముడు ఇచ్చిన శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలకు, అయోధ్య రాముడిని ప్రతిష్టించిన మోదీ చేతుల మీదుగా పూజలు చేశాం. ప్రజలకు, దేశానికి మంచి జరగాలని ప్రార్థించాం. ఆప్యాయత, ఆతిథ్యం, ఆధ్యాత్మికత కలబోతగా సాగిన ప్రధాని పర్యటన నారా కుటుంబంలోని మూడు తరాలవారికి మరచిపోలేని జ్ఞాపకాలను అందించింది’ అని ఆమె పేర్కొన్నారు.
