Share News

ఆన్‌లైన్‌లో నామినేషన్లకు చాన్సివ్వండి!

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:37 AM

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసేందుకు వీలు కల్పించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ఆన్‌లైన్‌లో నామినేషన్లకు చాన్సివ్వండి!

  • హైకోర్టులో పిల్‌... నేడు విచారణ

అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసేందుకు వీలు కల్పించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కాకినాడకు చెందిన హెల్ప్‌ ది పీపుల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌/మేనేజింగ్‌ ట్రస్టీ కీతినీడి అఖిల్‌ శ్రీ గురుతేజ ఈ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. నోటిఫికేషన్‌ వెలువడిన తేదీ నుండి నామినేషన్ల గడువు ముగిసేవరకు ఆన్‌లైన్‌లో నామినేషన్లు వేసే సౌకర్యాన్ని కల్పించాలని, ఆన్‌లైన్‌లో సమర్పించిన ప్రతీ నామినేషన్‌కు తేదీ, సమయంతో కూడిన రసీదు ఇచ్చేలా రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించాలని కోరారు. వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు.

అఫిడవిట్‌లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల క్రిమినల్‌ కేసులు, ఆస్తులు, విద్యార్హతలు, తదితర వివరాలకు సంబంధించి నామినేషన్‌ పత్రాలు, అఫిడవిట్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్ఈసీ)ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏలూరు జిల్లా, నూజివీడుకు చెందిన వలపర్ల శివ కార్తిక్‌ ఈ పిల్‌ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరుపుతామని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 05:37 AM