పెద్దిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు!
ABN , Publish Date - Mar 25 , 2026 | 06:19 AM
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఆయన సతీమణి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించేందుకు ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది.
పెండింగ్ బిల్లుల కోసం ఆయన సతీమణి పిటిషన్
విచారణకు బెంచ్ నో
హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఆయన సతీమణి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించేందుకు ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టంచేసింది. ‘పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థలో తనకు 93.66 శాతం వాటా ఉందని.. తన భర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ సీనియర్ నాయకుడని.. తన కుమారుడు మిథున్‌రెడ్డి లోక్‌సభలో వైసీపీ పక్ష నేతగా ఉన్నారని, ఈ కారణంతోనే ప్రస్తుత ప్రభుత్వం తమ సంస్థ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిధులు విడుదల చేయడం లేదంటూ పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత ఈ నెల 2న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్‌చంద్రశర్మతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు తదితర నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారుల ప్రాజెక్టు కింద తమ సంస్థ 6 ప్యాకేజీల పనులను దక్కించుకుందని.. అధికారులు తనిఖీలు చేసి పనులు సంతృప్తికరంగా ఉన్నాయని ధ్రువీకరించారని.. అలా ధ్రువీకరించిన 28 రోజుల్లోపు బిల్లుల చెల్లింపులు జరగాలని.. కానీ 2024 నవంబరు నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.64.18 కోట్ల బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని తెలిపారు. అయితే దీనిపై విచారణకు సుప్రీంకోర్టు విముఖత చూపింది. హైకోర్టులో 12 పిటిషన్లు దాఖ లు చేశామని, న్యాయందక్కనందుకే ఇక్కడి కొచ్చామని తెలుపగా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి అభ్యర్థనలున్నా హైకోర్టునే ఆశ్రయించాలని తేల్చిచెప్పింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని న్యాయవాదులు అభ్యర్థించగా.. ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.