ఆక్వా వ్యర్థాల నుంచి జల వనరులను రక్షించండి
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:58 AM
ఆక్వా వ్యర్థాలతో ఉత్పన్నమయ్యే అనర్థాల నుంచి జల వనరులను రక్షించేలా నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.
ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల నమూనాలను పరీక్షించండి
ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకోండి
పీసీబీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఆక్వా వ్యర్థాలతో ఉత్పన్నమయ్యే అనర్థాల నుంచి జల వనరులను రక్షించేలా నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఆక్వా ప్రొసెసింగ్, ప్రీ ప్రొసెసింగ్ యూనిట్లు నిర్ధేశిత పర్యావరణ ప్రమాణాలను విధిగా పాటించేలా నిరంతర పర్యవేక్షించాలన్నారు. శుద్ధి చేయని ఆక్వా వ్యర్థాల్లో పరిమితికి మించి హానికారక రసాయనాలు ఉండటం వల్ల నదులు, కాలువలు, సాగర సంగమ ప్రాంతాలతోపాటు భూగర్భ జలాలు కూడా కలుషితమై, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. ఆక్వా యూనిట్ల కాలుష్య ప్రభావం, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 ఆక్వా ప్రొసెసింగ్ యూనిట్లు, 12 ఆక్వా ప్రీ ప్రొసెసింగ్ యూనిట్లలో పర్యావరణ ప్రమాణాల అమలును నిర్ధారించేందుకు విస్తృత తనిఖీలు, నమూనాల సేకరణ, పరీక్ష ఫలితాల విశ్లేషణ చేస్తున్నట్లు పీసీబీ అధికారులు ఆయనకు వివరించారు.
82 యూనిట్ల నుంచి నమూనాలు సేకరించగా, కొన్నింటిలో ప్రజారోగ్య స్థాయిలు, నీటిపై తేలియాడే ఘన వ్యర్థాలు, బీఓడీ వంటి కీలక ప్రమాణాలను గుర్తించామన్నారు. పర్యావరణ ప్రమాణాలు పాటించని 10 యూనిట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, దిద్దుబాటు చర్యలకు రెండు వారాల గడువు ఇచ్చినట్లు తెలిపారు. నిరంతరాయంగా ఉల్లంఘనలకు పాల్పడే యూనిట్లపై పర్యావరణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దీనిపై పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ఆక్వా ప్రొసెసింగ్ యూనిట్ల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాల వల్ల ప్రజల ఆరోగ్యంతోపాటు జలచరాల జీవన విధానం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మత్స్య సంపదపైనా ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. టీఎస్ఎస్ స్థాయిలు పెరగడం వల్ల నీటి నాణ్యత క్షీణించి, జలచర జీవుల ఆవాసాలు ప్రభావితమౌతాయన్నారు.
వ్యవసాయం, పశు సంపద, జల వనరులు, జలచరాలపై ప్రభావం చూపకుండా ఉండాలంటే ఆక్వా ప్రొసెసింగ్ యూనిట్ల నుంచి నమూనాలు సేకరించి, సమస్యలను గుర్తించి, దిద్దుబాటు చర్యలకు అవకాశం కల్పించి, ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తీసుకుని, కాలుష్య నివారణ కార్యక్రమాన్ని చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..