ఏనుగులను అటవీ ప్రాంతాలకు మళ్లించండి
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:09 AM
చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ముసలమడుగు శిబిరం నుంచి కుంకీ ఏనుగులను తెచ్చి, ఏనుగుల గుంపును మళ్లించే అపరేషన్ చేపట్టాలని సూచించారు. హనుమాన్ బృందాలు, పోలీస్, రెవిన్యూ, విద్యుత్ శాఖల సమన్వయంతో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా పెట్టాలని స్పష్టంచేశారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారంపై అటవీ అధికారులతో పవన్‌కల్యాణ్ సోమవారం చర్చించారు.
గత 15 రోజులుగా 11 ఏనుగుల గుంపు నుంచి రెండు ఏనుగులు విడిపోయి పడిపుట్లబైలు ప్రాంతంలో సంచరిస్తూ.. పుండ్లవల్లపల్లి, నడింపల్లి, కొండకిందపల్లి గ్రామాల్లో పంటలకు నష్టం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ప్రస్తుతం ఒక ఏనుగుల గుంపు మంగళంపేట బీట్‌లోకి ప్రవేశించగా, మరో రెండు చిత్తూరు వైపు కదులుతున్నట్టు తెలిపారు. ఏనుగుల సంచారంతో పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల ప్రజలకు ముప్పుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా, పంటలకు నష్టం వాటిల్లకుండా ఏనుగులను అటవీ ప్రాంతాల వైపు మళ్లించేలా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను పవన్‌కల్యాణ్ ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..