Share News

పట్టిసీమ @ 500 టీఎంసీలు

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:06 AM

అది పట్టిసీమ కాదు... వట్టిసీమ అని ఎద్దేవా చేశారు. డబ్బులు వృథా చేస్తున్నారని విమర్శించారు. కానీ... అదే పట్టిసీమ నుంచి ఇప్పటికి 500 టీఎంసీల జలాలు తరలి వచ్చాయి.

పట్టిసీమ @ 500 టీఎంసీలు

  • పైరు ప్రాణం నిలిపిన ఎత్తిపోతల

  • ఇంత కరువులోనూ ఈ ఏడాది ఇప్పటిదాకా 56 టీఎంసీల సరఫరా

  • పోలవరం కుడికాలువ పరిధిలో పొలాలు కళకళ

  • నేడు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

  • పవిత్ర సంగమం వద్ద నిర్వహణకు కృష్ణా, పశ్చిమ డెల్టా సాగునీటి సంఘాలు సమాయత్తం

  • జగన్‌ పట్టిసీమ దండగన్నారు

  • గద్దెనెక్కాక పంపుసెట్లు ఆన్‌ చేయక తప్పలేదు

  • ఆయన హయాంలోనే 2021లో అత్యధికంగా 165 టీఎంసీల ఎత్తిపోత

(అమరావతి/విజయవాడ - ఆంధ్రజ్యోతి): అది పట్టిసీమ కాదు... వట్టిసీమ అని ఎద్దేవా చేశారు. డబ్బులు వృథా చేస్తున్నారని విమర్శించారు. కానీ... అదే పట్టిసీమ నుంచి ఇప్పటికి 500 టీఎంసీల జలాలు తరలి వచ్చాయి. పంటల ప్రాణాలు నిలిపాయి. కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీరు ఇవ్వడంద్వారా... ఆ మేరకు శ్రీశైలంలోని కృష్ణా జలాలు రాయలసీమకు అక్కరకొచ్చాయి. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లోనూ పట్టిసీమ నీరు పంటలకు కొంతమేర జీవం పోశాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం లేకుంటే కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయేది. విపత్కర ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతంతో అల్లాడుతున్న అన్నదాతకు ఈ స్కీం కొండంత అండగా నిలిచింది. దీనిద్వారా గోదావరి జలాలు పారకపోతే అన్నపూర్ణగా చెప్పుకొనే కృష్ణా డెల్టా ఎడారిగా మారి ఉండేది. 2015 నుంచి డెల్టా రైతుకు పట్టిసీమ పథకం ఆయువుపట్టుగా మారింది. ఆ ఏడాది ట్రయల్‌రన్‌ నిర్వహించిన నాటి నుంచి శుక్రవారం ఉదయానికి 499.48 టీఎంసీల గోదావరి జలాలు సరఫరా కాగా.. రాత్రికి 500 టీఎంసీల మార్కుకు చేరుకుంది. ఈ ఏడాది ఇంత కరువులోనూ ఈ ఎత్తిపోతల ద్వారా ఇప్పటివరకు 56.37 టీఎంసీలు ఇవ్వడం గమనార్హం.


ఈ 11 ఏళ్లలో ఇప్పటిదాకా కృష్ణా, పశ్చిమ డెల్టా ఆయకట్టుకు ఇచ్చిన సాగునీటితో రూ.లక్ష కోట్ల వ్యవసాయోత్పత్తుల దిగుబడులు వచ్చాయని రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాలు వెల్లడించాయి. దీనికి చంద్రబాబు ముందుచూపే కారణమని రాష్ట్ర నీటివినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు పేర్కొన్నారు. పట్టిసీమ నుంచి 500 టీఎంసీలు విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం కృష్ణా తీరాన పవిత్ర సంగమం వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయడానికి సాగునీటి వినియోగదారుల సంఘాలు సమాయత్తమయ్యాయి.

దండగన్నదే దిక్కయింది..

ముఖ్యమంత్రి చంద్రబాబు 2015లో శాసనసభలో పట్టిసీమ ఎత్తిపోతల ఫలాల గురించి మాట్లాడితే.. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ ఈ స్కీంను తీవ్రంగా వ్యతిరేకించారు. అవినీతి కోసమే ఈ దండగమారి పథకం తెచ్చారని ఆరోపించారు. పట్టిసీమ నుంచి తరలించే నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు ఎక్కడని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక పథకాన్ని రద్దు చేస్తామని.. అవినీతి ఆరోపణలపై విజిలెన్స్‌ దర్యాప్తునకు ఆదేశిస్తామని ప్రకటించారు. కానీ ఆయన గద్దెనెక్కాక.. 2019 నుంచి 2024 దాకా (2022లో మినహా) పట్టిసీమ ఎత్తిపోతలే కృష్ణా డెల్టాకు దిక్కయింది. ఎందుకంటే ఆయన హయాంలో కరువు రాజ్యమేలింది. 2021లో అత్యధికంగా 165.17 టీఎంసీలను పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించడం విశేషం. 2019లో 43 టీఎంసీలు, 2020లో 41.54 టీఎంసీలు, 2023లో 58.72 టీఎంసీలు ఇచ్చారు.


పచ్చపచ్చని పైర్లు...

ఎల్‌నినో పరిస్థితులు ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నా.. పట్టిసీమ లేకపోతే సాగుపై కృష్ణా డెల్టా రైతుల్లో ఆశలు పూర్తిగా చచ్చిపోయేవి. ఎండిపోతున్న పంటను కాపాడుకోవడానికి పట్టిసీమ నుంచి కుడి కాలువ గుండా ఎత్తిపోసిన నీరు దోహదపడగా.. ఇటీవల కురిసిన వర్షాలు దీనికితోడై ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో ఎండిన పొలాలు మళ్లీ పచ్చగా చిగురిస్తున్నాయి. డెల్టాకు రోజూ 18 వేల క్యూసెక్కుల నీరు అవసరం కాగా.. పట్టిసీమ నుంచి కృష్ణానదికి 7 వేల క్యూసెక్కుల గోదావరి జలాలు వస్తున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి ఇప్పటి వరకు 56.37 టీఎంసీల నీటిని కృష్ణానదికి మళ్లించారు. పట్టిసీమ పారే పోలవరం కుడికాలువ పరీవాహక ప్రాంతాలు, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఎండిపోయిన పైరు తిరిగి జీవం పోసుకుని పచ్చగా కళకళలాడుతోంది. ఈ ఎత్తిపోతల ద్వారా సకాలంలో సాగునీరు విడుదల కావడంతో కృష్ణా జిల్లా గన్నవరం మండలం, ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండలం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాలతో పాటు డెల్టా ఆయకట్టు కింద సమయానికి రైతులు వరినాట్లు పూర్తి చేసుకోగలిగారు. పంటను కూడా కాపాడుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో బుడమేరుకు వరద రావడంతో పై మండలాల్లో ఎండిన పైర్లన్నీ ఇప్పుడు పచ్చదనంతో అలరారుతున్నాయి. చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. అన్నదాతల మోములో ఆనందం తాండవిస్తోంది.


చంద్రబాబు సంకల్పం..

2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు ఫలాలు దక్కేలోగా కృష్ణా డెల్టా రైతాంగానికి సాగు నీరు అందించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేశారు. గోదారమ్మను కృష్ణమ్మ చెంతకు తీసుకురావాలని సంకల్పించారు. రూ.1660 కోట్ల వ్యయంతో 24 పంపులతో 11,35,900 ఎకరాలకు సాగునీరందించేలా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. యుద్ధప్రాతిపదికన అతి తక్కువ సమయంలోనే దీనిని పూర్తిచేసి 2016లో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. అది సక్సెస్‌ కావడంతో ఆ ఏడాది సెప్టెంబరు 18 నుంచి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాలువ గుండా కృష్ణా డెల్టాకు నీటి తరలింపునకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికి 500 టీఎంసీల గోదావరి జలాలు రికార్డు స్థాయిలో డెల్టాకు అందాయి.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 04:06 AM