Share News

పాలమూరు-రంగారెడ్డికిఓకే అంటే సరి!

ABN , Publish Date - May 12 , 2026 | 05:32 AM

రాష్ట్రాల మధ్య సాగునీటి వాటాల కోసం వివాదాలు సహజమేనని, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సీఎం చంద్రబాబుకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ సూచించారు.

పాలమూరు-రంగారెడ్డికిఓకే అంటే సరి!

  • అప్పుడిక తెలంగాణతో నీటి సమస్య ఉండదు.. చంద్రబాబుకు కేంద్ర జలశక్తి మంత్రి సూచన

  • 16 పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయండి: సీఎం

అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల మధ్య సాగునీటి వాటాల కోసం వివాదాలు సహజమేనని, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సీఎం చంద్రబాబుకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ సూచించారు. కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అడ్డుచెప్పకపోతే.. వివాదమే ఉండదన్నారు. ఇదే పరిష్కార మార్గంగా కనిపిస్తోందని చెప్పా రు. సోమవారం ఢిల్లీలో చంద్రబాబు.. పాటిల్‌తో సమావేశమయ్యారు. ఆయన వెంట జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి ఉన్నారు. ఈ సమావేశంలో.. ఏపీ ప్రభుత్వం కోరినవన్నీ ఇస్తున్నామని పాటిల్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశకు రూ.3000 కోట్లు కోరితే.. కేంద్రం రూ. 2,800 కోట్లు విడుదల చేసిందని గుర్తుచేశారు. ‘స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌’కు 2027 డిసెంబరు దాకా సడలింపు ఇచ్చామని చెప్పారు. తొలిదశను 2027 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల్లోగా తొలిదశ నిరాణాన్ని పూర్తి చేస్తున్న నేపథ్యంలో.. దాని ని జాతికి అంకితం చేయడానికి ప్రధాని మోదీని కూడా ఆహ్వానించనున్నామని చెప్పారు. గోదావరి-కావేరి అనుసంధాన పథకాన్ని పోలవరం-నల్లమల సాగర్‌ నుంచే చేపట్టాలని కోరారు. పాటిల్‌ స్పందిస్తూ.. మొదట ఇచ్ఛంపల్లి నుంచి అనుసంధానం చేయాలని భావించామని.. కానీ తర్వాత సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌ మీదుగాను.. అటు పోలవరం-నల్లమలసాగర్‌ నుంచీ సమాంతరంగా గోదావరి-కావేరి ప్రాజెక్టును చేపట్టాలన్న ఆలోచన వచ్చిందని పాటిల్‌ వెల్లడించారు. ఇచ్ఛంపల్లి వద్ద గోదావరి జలాలు అందుబాటులో లేవని.. ఛత్తీస్‌గఢ్‌ కూడా తన వాటా 148 టీఎంసీలూ వాడుకుంటామని చెబుతోందని ఏపీ అధికారులు చెప్పగా.. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్‌ కాంతారావు జోక్యం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ కొత్త ప్రాజెక్టును నిర్మించేందుకు చాలా ఏళ్లు పడుతుందని.. ఆలోగా గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టేందుకు వీలుందని చెప్పారు. పోలవరం-నల్లమల సాగర్‌ నుంచి కావేరి అనుసంధానానికి తెలంగాణ అంగీకరించడం లేదన్నారు. సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్‌ మీ దుగా దీనిని చేపడతామంటే.. పోలవరం-నల్లమల సాగర్‌ పథకానికి తెలంగాణ ఆమోదం తెలిపే అవకాశం ఉందని చెప్పారు. పాటిల్‌ కలుగజేసుకుని.. 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన పాలమూరు-రంగారెడ్డికి ఏపీ అడ్డుచెబితే.. గోదావరి-కావేరి అనుసంధాన పథకం కూడా ఆగిపోతుందన్నారు. గోదావరి-కావేరి అనుసంధానానికి రూ.లక్షన్నర కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. విశా ల ప్రయోజనాల కోసం తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని చంద్రబాబు అన్నారు.


పెద్దగెడ్డ పరిధిలో పైపులైన్‌ ద్వారా సాగునీరు!

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పెద్దగెడ్డ రిజర్వాయరు పరిధిలో పైపులైన్‌ ద్వారా సాగునీటిని అం దించే పథకాన్ని ప్రయోగాత్మకంగా పూర్తిచేయాలని చంద్రబాబుకు పాటిల్‌ సూచించారు. నేరడి బ్యారేజీకి ఉన్న అడ్డంకులు తొలగిస్తూ వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై గెజిట్‌ జారీ చేశామన్నారు. ఈ గెజిట్‌ ప్రకారమే ముందుకు వెళ్తామని, ఏపీ అవసరాల కోసం 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడివైపున హెడ్‌ స్లూయిస్‌ నిర్మిస్తామని సీఎం చెప్పారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచే విషయంలో కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయవద్దని కోరారు.

పోలవరం సంపూర్ణ నిర్మాణానికి సహకరించండి

45.72 మీటర్ల ఎత్తున గరిష్ఠ స్థాయిలో 194.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరాన్ని సంపూర్ణంగా నిర్మించేందుకు సహకరించాలని పాటిల్‌ను సీఎం కోరారు. రెండో దశకు రూ.32 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం కుడి, ఎడమల ప్రధాన కాలువలను 8123 క్యూసెక్కుల నుంచి 17,500 క్యూసెక్కుల సామర్థ్యానికి కేంద్ర జలసంఘం ఆమోదంతో విస్తరించామని.. ఇందుకు అదనంగా అయిన ఖర్చును కేంద్రం రీయింబర్స్‌ చేయాలని అభ్యర్థించారు. గత నెల 2 నాటికి కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తయిందని, గ్యాప్‌-1, గ్యాప్‌-2, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎఫ్ఆర్‌)ను జలసంఘానికి ఇప్పటికే సమర్పించామని.. దానిని ఆమోదించాలని కోరారు. అలాగే ఈ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్‌ పథకం డీపీఆర్‌ను రూపొందించేందుకూ సమ్మతించాలని విజ్ఞప్తిచేశారు. సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 16 ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. ‘హర్‌ ఖేత్‌ కో పానీ’ పథకం కింద రాష్ట్రంలోని 297 నీటి వనరుల పునరుద్థరణ, కాలువల పూడికతీత పనుల కోసం రూ.285 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 12 , 2026 | 05:32 AM