ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి
ABN , Publish Date - Oct 23 , 2026 | 03:44 PM
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాపించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రూబీ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయవాడ, అక్టోబర్ 23: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని స్థాపించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రూబీ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నాలుగు దశాబ్దాలుగా వైద్య విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది.
విజయవాడలోని అంబేద్కర్ కలావేదికలో నిర్వహించనున్న ఈ వేడుకలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొననున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కొలుసు పార్థసారథి, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చైర్మన్ రమేష్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యూనివర్సిటీ నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశంలోనే తొలి వైద్య విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 580 నుంచి 590 కళాశాలలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వైద్య విద్య అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడం, ఆరోగ్య రంగానికి నిపుణులను అందించడంలో విశ్వవిద్యాలయం పోషించిన పాత్రపై రూబీ జూబ్లీ వేడుకల్లో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది యూనివర్సిటీ సిబ్బంది, వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొననున్నారు. గత 40 ఏళ్లలో సాధించిన ప్రగతిని సమీక్షించడంతో పాటు, భవిష్యత్తులో వైద్య విద్యను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, విశ్వవిద్యాలయ అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారించనున్నారు. ప్రముఖుల సమక్షంలో నిర్వహించనున్న ఈ వేడుకలు యూనివర్సిటీ ప్రస్థానంలో మరో కీలక ఘట్టంగా నిలవనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
రూ.10 నోటు మార్చమన్నందుకు చెంపదెబ్బలు.. అవమానంతో డెలివరీ బాయ్ ఆత్మహత్య
ఈఫిల్ టవర్ వివాదంపై బ్రహ్మవిహారి స్వామీజీ వివరణ.. బాప్స్పై అపార్థం తొలగిపోతుందా?