Share News

బెజవాడలో మిషన్‌ కర్మయోగి

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:32 AM

ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా మిషన్‌ కర్మయోగిపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్‌ జరగనుంది. ఈ నెల 29, 30 తేదీల్లో విజయవాడలోని బీఆర్‌ అంబేడ్కర్‌ కళావేదికలో ఈ సదస్సును నిర్వహించనున్నారు.

బెజవాడలో మిషన్‌ కర్మయోగి

  • 29, 30న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్‌

  • సదస్సును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా మిషన్‌ కర్మయోగిపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్‌ జరగనుంది. ఈ నెల 29, 30 తేదీల్లో విజయవాడలోని బీఆర్‌ అంబేడ్కర్‌ కళావేదికలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరికి చెందిన అధికారులు, సంబంధిత భాగస్వాములు పాల్గొననున్నారు. 29న ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ కూడా హాజరుకానున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మిషన్‌ కర్మయోగి ప్రతినిధులు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్‌, మిషన్‌ కర్మయోగి వేదిక వినియోగంపై ప్రదర్శన ఇస్తారు.

రాష్ట్రాల విధానాలపై ప్రజెంటేషన్లు

29న ఉదయం 10గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. 10.30కు చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనంతరం వివిధ అంశాలపై సాంకేతిక సమావేశాలు జరుగుతాయి. 30న నిపుణుల సమావేశం, రాష్ట్రాల ప్రదర్శనలు, బృంద చర్చలతో వర్క్‌షాప్‌ ముగియనుంది. ప్రభుత్వ శిక్షణ సంస్థలు కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా గాక, ఆయా శాఖల పనితీరును మెరుగుపరిచే భాగస్వాములుగా ఎదగాలన్నది వర్క్‌షాప్‌ ప్రధాన సందేశం. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకునేందుకు, ప్రజలకు సేవల నాణ్యతను పెంచే శిక్షణ పద్ధతులపై కలిసి పని చేసేందుకు విజయవాడ వేదిక కానుంది. పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వివిధ రాష్ట్రాల మధ్య ఉత్తమ విధానాలను పరస్పరం మార్చుకునేందుకు ఈ సదస్సు కీలకం కానుంది.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 04:32 AM