Share News

సీఎం తల్లిని అవమానిస్తే..2 చిన్న మాటలా?

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:04 AM

ఏవో రెండు చిన్న మాటలు అన్నారని’ అంటూ అంబటి రాంబాబును వైఎస్‌ జగన్‌ వెనుకేసుకు రావడంపై మంత్రి లోకేశ్‌ మండిపడ్డారు. అవి చిన్న మాటలా అని నిలదీశారు. ముఖ్యమంత్రి తల్లిని అంబటి అవమానించారని....

సీఎం తల్లిని అవమానిస్తే..2 చిన్న మాటలా?

‘‘సొంత తల్లిని, చెల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు... కానీ మాకుంది. ఈ రాష్ట్రంలో ఏ మహిళ జోలికొచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జగన్‌ తల్లి అయినా.. ఎవరి తల్లి అయినా.. కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అలాంటిది అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లినే అవమానిస్తే వదిలిపెడతామా..?’’

- నారా లోకేశ్‌

  • అంబటి రాంబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా?

  • వైసీపీ సభ్యులపై మంత్రి లోకేశ్‌ మండిపాటు

  • సొంత తల్లి, చెల్లిని గౌరవించే అలవాటు

  • మీకు లేకపోవచ్చు.. కానీ మాకుంది

  • జగన్‌ తల్లికైనా, ఏ మహిళకైనా ఒకే న్యాయం

  • మహిళల జోలికొస్తే వదిలిపెట్టేది లేదు

  • మండలిలో మండిపడిన మంత్రి

  • టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం

అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ‘ఏవో రెండు చిన్న మాటలు అన్నారని’ అంటూ అంబటి రాంబాబును వైఎస్‌ జగన్‌ వెనుకేసుకు రావడంపై మంత్రి లోకేశ్‌ మండిపడ్డారు. అవి చిన్న మాటలా అని నిలదీశారు. ముఖ్యమంత్రి తల్లిని అంబటి అవమానించారని, ఈ విషయంలో ఆయనను వదిలిపెట్టేది లేదన్నారు. శుక్రవారం శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ సభ్యుడు బొమ్మి ఇజ్రాయిల్‌ ఆరోపించారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యల్లో తప్పులు గుర్తించి క్షమాపణ చెప్పినా.. అరెస్ట్‌ చేసి, జైల్లో పెట్టారని బొత్స వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి లోకేశ్‌ తీవ్రంగా స్పందించారు. ‘‘అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లిని అవమానించారు. అవునా.. కాదా..? వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అలాంటిది అంబటి తప్పుడు మాటలు మాట్లాడితే వదిలిపెడతామా..? టీడీపీ కార్యకర్త వైఎస్‌ భారతీరెడ్డి గురించి మాట్లాడితే తక్షణమే చర్యలు తీసుకున్నాం. అదీ మా చిత్తశుద్ధి. ఐదేళ్లు మీరేం చేశారు..? మా పార్టీ ఆఫీ్‌సపై దాడిచేస్తే ఏం చర్యలు తీసుకున్నారు..? అసెంబ్లీలో మా తల్లిని అవమానిస్తే.. మీరేం చేశారు..? అంబటి అన్నది రెండు చిన్న మాటలని జగన్‌ అంటున్నారు. ఒక తల్లిని అవమానిస్తే చిన్న మాటగా చూస్తామా..? మాజీ మంత్రి అయి ఉండి అలాంటి మాటలు మాట్లాడితే సమర్థిస్తారా..? సొంత తల్లిని, చెల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు. కానీ మాకు ఉంది. మహిళల జోలికొస్తే వదిలిపెట్టం. జగన్‌ తల్లి విషయంలోనైనా... ఇంకెవరి తల్లి, చెల్లి, అక్క, కూతురు గురించైనా తప్పుగా మాట్లాడితే ప్రజా ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. నెల్లూరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీడీపీ మహిళా ఎమ్మెల్యే గురించి ఏం మాట్లాడారో చూశాం. దానికి సమాధానం లేదు. అంబటి విషయంలో మాత్రం జగన్‌ వెళ్లి ప్రెస్‌మీట్‌లో సింపుల్‌గా రెండు చిన్న మాటలన్నాడని చెబుతారు. అవి చిన్నమాటలెలా అవుతాయి? నాయకత్వం వహించే వ్యక్తి అలా అనొచ్చా..? టీడీపీ నేతలెవరైనా తప్పుగా మాట్లాడితే ఆధారాలు ఇవ్వండి.. చర్యలు తీసుకుంటాం. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మహిళలను కించపరచకూడదనే విజ్ఞత ఉండొద్దా..? అలాంటి వారిని, ఇలాంటి మాటలను ప్రోత్సహించవద్దని కోరుతున్నా. వైసీపీ మాజీ మంత్రి అని అంబటిపై మేం కక్ష సాధింపులకు పాల్పడటం లేదు’’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు.


గత ప్రభుత్వం 4వేల కోట్ల ఫీజు బకాయి పెట్టింది: లోకేశ్‌

గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు రూ.4వేల కోట్లపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టిందని మంత్రి లోకేశ్‌ శాసనమండలిలో వెల్లడించారు. దీనిపై వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫీజు బకాయిలపై చర్చకు రావాలని మంత్రి సవాల్‌ చేశారు. మండలి ప్రశ్నోత్తరాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై వైసీపీ సభ్యులు జయేంద్ర భరత్‌, రమేశ్‌యాదవ్‌, మురళీధర్‌ వేసిన ప్రశ్నకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సమాధానం ఇస్తూ... గత ప్రభుత్వం రూ.4,064కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టిందని చెప్పారు. అయితే బకాయిలు ఎప్పటి లోగా ఇస్తారు? అసలు ఇస్తారా లేదా..? అని బొత్స ప్రశ్నించారు. దీనిపై అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే బకాయిలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్వామి అనగానే వైసీపీ సభ్యులు పెద్దగా కేకలు వేశారు. ఈ క్రమంలో మంత్రి లోకేశ్‌ జోక్యం చేసుకుని.. ‘బొత్స ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలే లేవంటున్నారు. 2020-21లో క్యూ4 రూ.683.1 కోట్లు, క్యూ3, 4 బకాయిలు రూ.1,753.98 కోట్లు, 2023-24లో రూ.895కోట్లు ఎంటీఎఫ్‌ బకాయిలు పెట్టారు. ప్రభుత్వం మారే సమయంలో రూ.645కోట్ల బకాయిలు చెల్లించలేదు. ఈ మాట రికార్డు ప్రకారం చెప్తున్నాను’ అన్నారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ‘విద్యాశాఖ మంత్రిగా దీనిపై మాట్లాడే హక్కు నాకుంది. రూ.4,064.59 కోట్లు వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్లింది. దీనిపై చర్చకు సిద్ధమా’ అని లోకేశ్‌ నిలదీశారు. బొత్స మాట్లాడుతూ... ఇంటర్‌ విద్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సమాధానాన్ని నిరసిస్తూ వాకౌట్‌ చేస్తున్నామని చెప్పి వైసీపీ సభ్యులంతా బయటకు వెళ్లిపోయారు. మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ.. ‘నిజాలు చేదుగా ఉంటాయి. వైసీపీ సభ్యులు అబద్ధాలు చెప్పి వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలతో ఇంటర్‌ కాలేజీల్లో 70వేల మంది విద్యార్థులు పెరిగారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 12లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. మధ్యాహ్న భోజనం రద్దు చేశారు. మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు వాళ్లకెక్కడిది..? ఆరోపణలు చేసి, వాకౌట్‌ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది. సమస్యలు లేవని మేం చెప్పడం లేదు. అధ్యక్షా.. విపక్ష నేతలను పిలిపించండి. వాళ్లని ప్రశ్నించే హక్కు మాకూ ఉంది. వాళ్లకి చిత్తశుద్ధి ఉంటే మా ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి’ అన్నారు.


జేఎన్‌టీయూ-జీవీ చట్ట సవరణ చేస్తాం

జేఎన్‌టీయూ-జీవీకి బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు కోసం ఐచ్ఛికాలు ఇచ్చేందుకు చట్ట సవరణ చేస్తామని మంత్రి లోకేశ్‌ శాసనమండలిలో ప్రకటించారు. మండలిలో జేఎన్‌టీయూ, గురజాడ, విజయనగరంపై వైసీపీ సభ్యులు విక్రాంత్‌, ఇసాక్‌ బాషా అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ... ‘2008లో జేఎన్‌టీయూ 30వ చట్టాన్ని సవరించిన కారణంగా 2021లోని 22వ చట్టం ద్వారా జేఎన్‌టీయూ-జీవీ 2022లో ఏర్పాటైంది. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు వచ్చాయి. కోర్టులో 27 కేసులు ఉన్నాయి. యాక్ట్‌30, సెక్షన్‌45 విభాగాన్ని నెల రోజుల్లో సవరిస్తాం. సెక్షన్‌ 46 విషయంలో ఆడిట్‌ అభ్యంతరం వచ్చింది. ముందు ఆడిట్‌ పూర్తి చేసిన తర్వాత యూనివర్సిటీకి పేమెంట్స్‌ చేస్తాం. ఇప్పటికే రూ.119 కోట్లు బదిలీ చేశాం. బ్యాలెన్స్‌ కూడా త్వరలో ఇస్తాం’ అని చెప్పారు.

పాఠశాలలకు స్టార్‌ రేటింగ్‌ ముఖ్యం..

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ చెప్పారు. శాసనమండలిలో ‘మన బడి-మన భవిష్యత్‌’ పథకంలో 2020 నుంచి 2026 వరకు ఖర్చు చేసిన నిధుల వివరాలను విపక్ష సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలత, రామచంద్రారెడ్డి అడిగారు. మంత్రి సమాధానమిస్తూ... ‘కూటమి ప్రభుత్వం వచ్చాక పాఠశాలల్లో మౌలిక వసతులకు రూ.7,500కోట్లు పెట్టాల్సిన అవసరముందని అధికారులు చెప్పారు. ప్రతి పాఠశాలకూ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఇవ్వాలని చెప్పాం. 40శాతం పాఠశాలలు 2స్టార్‌ రేటింగ్‌ కన్నా తక్కువగా ఉండగా అభివృద్ధికి నిర్ణయించాం. జీవో 117కు ప్రత్యామ్నాయంగా మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ కింద తరగతికో టీచర్‌ ఉండే విధానాన్ని తెచ్చాం. గతంలో కేవలం 3 శాతం పాఠశాలల్లోనే తరగతికో టీచర్‌ ఉంటే ఇప్పుడు 33 శాతానికి తెచ్చాం. దీనివల్ల కొన్ని చోట్ల గదుల అవసరం ఏర్పడింది. గతంలో నాడు-నేడు కింద అభివృద్ధి చేసిన 233 పాఠశాలలు మూతపడ్డాయి. నిధులు వృథా చేయకుండా ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చు చేస్తున్నాం. నాడు-నేడు కింద గత ప్రభుత్వం పెట్టిన రూ.500కోట్ల బకాయిలు చెల్లించాం. వైసీపీ ప్రభుత్వానికి నాడు-నేడుపై చిత్తశుద్ధి ఉంటే బకాయిలు ఎందుకు చెల్లించలేదు? వైసీపీ సభ్యులు వాకౌట్‌ చేయకుండా ఉంటే అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్తాం. వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే లెర్నింగ్‌ ఔట్‌ కమ్స్‌ ఎందుకు పడిపోయాయి..? 47 శాతం మంది 8వ తరగతి విద్యార్థులు రెండో తరగతి పాఠ్య పుస్తకాలు కూడా చదవలేకపోయారు. అందుకే ఏఐ టూల్‌ ద్వారా గ్యారెంటీడ్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌ చేపట్టాం. ప్రైవేట్‌ పాఠశాలలతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతాం’ అని చెప్పారు.

Updated Date - Feb 14 , 2026 | 03:04 AM