Share News

త్వరలో వెటర్నరీ పోస్టుల భర్తీకి చర్యలు: మంత్రి అచ్చెన్న

ABN , Publish Date - Jan 20 , 2026 | 04:36 AM

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్‌ పోస్టుల భర్తీలతో పాటు పశు వైద్య సిబ్బంది నియామకంపై సీఎం చంద్రబాబుతో చర్చించి, త్వరలో ఓ ప్రకటన చేస్తామని...

త్వరలో వెటర్నరీ పోస్టుల భర్తీకి చర్యలు: మంత్రి అచ్చెన్న

అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్‌ పోస్టుల భర్తీలతో పాటు పశు వైద్య సిబ్బంది నియామకంపై సీఎం చంద్రబాబుతో చర్చించి, త్వరలో ఓ ప్రకటన చేస్తామని వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ మంత్రి మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 31 వరకు జరిగే ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను సోమవారం విజయవాడ రూరల్‌ నిడమానూరులో గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం పరిరక్షిస్తూ, ఉత్పాదకత పెంచుతూ, వ్యాధులను నియంత్రిస్తూ, పశుపోషణ ఖర్చు తగ్గించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే తొలి మూడు స్థానాల్లో నిలవాలనే స్పష్టమైన కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. ఒంగోలు జాతి పశువులకు పునర్వైభవం తెస్తామని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద 70-90 శాతంతో 2026-27లో గోకులం షెడ్లు నిర్మిస్తామని.. 85శాతం రాయితీతో పశు బీమా అమలు చేస్తున్నామని వెల్లడించారు. పెయ్య దూడల ఉత్పత్తి పెంపు కోసం 50 శాతం రాయితీతో లింగ నిర్ధారిత వీర్యనాళికలను రూ.150కే ఇస్తున్నామని చెప్పారు. పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు మాట్లాడుతూ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


  • వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయికి వెళ్లాలి

వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సరైన సమయంలో సూచనలు, సలహాలు అందించాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. విజయవాడ క్యాంప్‌ ఆఫీ్‌సలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరీ, క్యాలెండర్‌ను ఆయన సోమవారంఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ... రైతులు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పంటలపై తెగుళ్ల నేపథ్యంపై శాస్త్రవేత్తలు మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు శాస్త్రవేత్తలు వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి, క్షేత్రస్థాయిలో రైతులకు సరైన సలహాలు అందిస్తే.. పంట నష్టాలు తగ్గి, ఉత్పాదకత పెరుగుతుందని చెప్పారు.

Updated Date - Jan 20 , 2026 | 04:37 AM