టీచర్లపై ఎందుకీ కక్ష?
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:20 AM
వైసీపీ అధినేత జగన్... తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయకపోగా కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీతో ఒకేసారి 15,941 మందికి ఉద్యోగాలు ఇస్తే దానిని జీర్ణించుకోలేకపోతున్నారు.
టీచర్లపై ఎందుకీ కక్ష?
జగన్ హయాంలో ఒక్క డీఎస్సీ లేదు
మద్యం షాపుల వద్ద కాపలా పెట్టారు
స్కూల్ టాయిలెట్ల ఫొటోలు తీయించారు
ఇప్పుడేమో మెగా డీఎస్సీ టీచర్లపై కత్తి
16వేల ఉద్యోగాలు రద్దు చేయాలని డిమాండ్
శాప్ కార్యాలయం వద్ద గురువులపై దాడి
టీచర్లను అవమానించేలా వైసీపీ తీరు
అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఒకే ధోరణి
(అమరావతి-ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్... తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయకపోగా కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీతో ఒకేసారి 15,941 మందికి ఉద్యోగాలు ఇస్తే దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఏదో జరిగిపోయిందని.. తాము అధికారంలోకి వచ్చాక వారిపై విచారణ చేయిస్తామని, ఉద్యోగాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. ఉపాధ్యాయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చగా మారింది. ‘‘వైసీపీకి మేమంటే ఎందుకంత పగ.’’ అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుల విషయంలో జగన్ వైఖరి మెగా డీఎస్సీ హామీలోనే బయటపడింది. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ద్వారా మొత్తం ఖాళీలు భర్తీ చేస్తామని 2019 ఎన్నికలకు ముందు జగన్ ఊరూవాడా తిరిగి ఊదరగొట్టారు. ఆ మాటలు నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులు పూర్తిగా మోసపోయారు. ఐదేళ్ల తన హయాంలో జగన్ ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. 2024, ఎన్నికలకు ముందు 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా అది ముందుకు సాగకుండా ఆగిపోయింది.
టాయిలెట్ల ఫొటో డ్యూటీ
జగన్ హయాంలో టీచర్లు పలు రూపాల్లో అవమానాలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా పాఠాలు చెప్పాల్సిన గురువులతో టాయిలెట్ల ఫొటోలు తీయించారు. ప్రతిరోజూ పాఠశాలకు వచ్చిన వెంటనే రోజుకో టీచర్ టాయిలెట్ల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలని షరతు విధించారు. యాప్‌ల డ్యూటీలు వద్దని టీచర్లు రోడ్డెక్కే స్థాయిలో వారిపై అదనపు బాధ్యతలు రుద్దారు. కరోనా సమయంలో మద్యం షాపుల వద్ద టీచర్లను కాపలా పెట్టి దారుణంగా అవమానించారు.
టీచర్లతోనే ప్రారంభం
ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై వైసీపీ ప్రభుత్వంలో మొట్టమొదట అతిపెద్ద ఉద్యమం చేపట్టింది టీచర్లే. ‘చలో విజయవాడ’ పేరుతో విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసిన భారీ ర్యాలీ జగన్‌కు వణుకు పుట్టించింది. ఆ తర్వాత వివిధ వర్గాలు ప్రభుత్వంపై ఉన్న నిరసనను బహిరంగంగా తెలియజేశాయి. వైసీపీ ప్రభుత్వ పతనానికి ఉపాధ్యాయుల ర్యాలీనే నాంది పలికిందని భావిస్తారు. టీచర్లకు భయపడిన వైసీపీ ప్రభుత్వం వారితో ఇబ్బందులు తప్పవని భావించి, వారిని ఎన్నికల విధులకు దూరం చేసే కుట్ర చేసింది. ఆ ప్రయత్నం ఫలించలేదు.
మెగా డీఎస్సీపై అక్కసు
కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిలో 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి. అయితే ప్రారంభం నుంచీ ఏదో ఒక రూపంలో అడ్డుపడుతూ.. ఈ ప్రక్రియ ముందుకు సాగకూడదనేలా వైసీపీ ప్రయత్నించింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టుదలతో మెగా డీఎస్సీని పూర్తి చేసింది. ఏడాది అనంతరం.. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ గగ్గోలు పెట్టడం ప్రారంభించింది. తొలుత సాధారణ కోటాలో అక్రమాలంటూ విషప్రచారం చేసింది. హారిజంటల్ రిజర్వేషన్‌పై తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేసింది. వాటిలో ఏంలేదని తేలాక క్రీడా కోటాలో భారీగా అక్రమాలు జరిగాయని, సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తోంది.
నిరూపణ ఏదీ?
మెగా డీఎస్సీ క్రీడా కోటాలో 421 పోస్టులున్నాయి. వీటిలో 382 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. వాటిలో కొన్ని నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయనేది వైసీపీ ఆరోపణ. ఇది ఇంతవరకు రుజువు కాలేదు. కానీ మెగాడీఎస్సీ నోటిఫికేషన్ రద్దుచేసి 15,941 మంది ఉద్యోగాలను రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. జగన్ హయాంలో గ్రూప్-1 పోస్టుల భర్తీలో అనేక అక్రమాలు జరిగాయని ఇటీవల సిట్ నివేదిక ఇచ్చింది. వైసీపీ వీటిపై మాత్రం నోరు మెదపడం లేదు.
టీచర్ల ఆవేదన..
2018లో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందే చివరి డీఎస్సీ. వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా లేదు. దీంతో దాదాపు ఏడేళ్లు ఎదురు చూసిన తర్వాత నిరుద్యోగులకు అవకాశం లభించింది. దీంతో చాలా కాలం కష్టపడి చదివి సాధించుకున్న ఉద్యోగాలను ఇప్పుడు లేనిపోని ఆరోపణలతో తొలగించాలని డిమాండ్ చేయడం పట్ల టీచర్లలో ఆవేదన వ్యక్తమవుతోంది.
టీచర్లపై గూండాగిరి
తాజాగా విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద వైసీపీ వర్గాలు క్రీడా కోటా టీచర్లపై దాడులు చేశాయి. నిరసన వరకు పరిమితం కాకుండా టీచర్లపై భౌతిక దాడులకు దిగడం చూస్తుంటే టీచర్లపై తీవ్రస్థాయిలో కక్షగట్టినట్లు అర్థమవుతోంది. అలాగే, వీరంతా నకిలీ టీచర్లంటూ పాఠశాలలకు కూడా వెళ్లి మరీ మెగా డీఎస్సీ టీచర్లను వైసీపీ అనుకూల వర్గాలు అవమానాలకు గురి చేస్తున్నాయి. జగన్ మీడియాలోనూ టీచర్ల ఫొటోలు ప్రచురించి వారంతా దొడ్డిదారిలో వచ్చారని ప్రచారం చేయడం పట్ల ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.