కళ్లెదుటే కాలిపోతుంటే!
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:57 AM
కళ్ల ముందే భర్త, కుమారుడిని కోల్పోయిన మహిళ..! కన్నతల్లిని పోగొట్టుకున్న యువకుడు..! తాము ప్రాణాలతో బయటపడ్డా అయిన వారిని పోగొట్టుకున్న దయనీయ స్థితి..
కదల్లేని వారు మంటల్లో బుగ్గి
తోటివారిని కాపాడిన కొందరు
(ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్‌వర్క్)
కళ్ల ముందే భర్త, కుమారుడిని కోల్పోయిన మహిళ..! కన్నతల్లిని పోగొట్టుకున్న యువకుడు..! తాము ప్రాణాలతో బయటపడ్డా అయిన వారిని పోగొట్టుకున్న దయనీయ స్థితి..! కళ్ల ముందే బస్సులో సజీవ దహనమౌతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి..! ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటిగాథ..! అంతా వలసజీవులే. పొట్ట చేతపట్టుకొని మార్కాపురం జిల్లాలోని కనిగిరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పనుల కోసం తెలంగాణ వెళ్లారు. స్వగ్రామాల్లో ఉన్నవారిని చూసేందుకు కొందరు, శ్రీరామనవమి పండగకు ఇంకొందరు, శుభకార్యాలకు మరికొందరు.. జగిత్యాల నుంచి కలిగిరి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో బయల్దేరారు. రోడ్డు ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగడంతో చిక్కుకుపోయారు. కిటికీల్లోంచి దూకి కొందరు ప్రాణాలు దక్కించుకున్నారు. ఎమర్జెన్సీ డోర్ వద్దకు వెళ్లలేక సీట్లలో ఉండిపోయిన వాళ్లు అగ్నికి ఆహుతయ్యారు. బస్సులో వెనుకవైపు ఉన్న వాళ్లు మాత్రమే బతికారు. విపత్కర పరిస్థితుల్లో బస్సులోని ప్రయాణికులు కొందరు తాము బయటపడటంతో పాటు సాయం చేసి మరికొందరు ప్రాణాలు కాపాడారు.

పెద్దపాటి శబ్దం రావడంతో..
బస్సులో మధ్య సీటులో కూర్చొని ఉన్నా. పెద్దపాటి శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచా. బస్సులో ముందువైపు మంటలు చెలరేగాయి. నన్ను ఎవరో చేయిపట్టుకుని లాగినట్లు అనిపించింది. రెప్పపాటులో రోడ్డుపైన ఉన్నాను. అప్పటికే నాకు కడుపు, చేయిపై మంటలు తగలడంతో గాయాలయ్యాయి.
- జి.మహేంద్రరెడ్డి, బస్సు క్లీనర్, కనిగిరి

కిటికీ పక్కన కూర్చోవడంతో బతికాం
బేల్దారీ పనులకు తెలంగాణలోని ఇందల్‌వాయిలో ఉంటున్నాం. స్వగ్రామానికి వచ్చేందుకు బుధవారం సాయంత్రం బస్సు ఎక్కాం. బస్సుకు సాంకేతికలోపం ఏర్పడటంతో పలుచోట్ల ఎక్కువసేపు ఆగటం గమనించాం. చివర్లో ఎర్రగొండపాలెంలో కూడా బస్సు సుమారు గంటపాటు ఆగింది. బస్సులోని అందరం దిగి టీ తాగాం. ఆ తర్వాత ప్రమాదం జరిగినపుడు పెద్దశబ్దం వచ్చింది. కిటికీ పక్కనే కూర్చుని ఉన్నందున వెంటనే కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నాం.
- మైలారం చిట్టిబాబు, నూనె జేమ్స్, గుంటుపల్లి, పీసీపల్లి మండలం

కిటికీలోంచి దూకి ఏడుగురం బయటపడ్డాం
ప్రమాదం జరగడానికి రెండు నిమిషాల ముందే నిద్రలేచాను. బస్సు ఉదయం 5.44 గంటలకు రాయవరం రైల్వేస్టేషన్ వద్దకు చేరుకుంది. సరిగ్గా 5.46 గంటలకు ప్రమాదం జరిగింది. బస్సు లోపల ముందువైపు మంటలు చెలరేగాయి. వెనుకవైపు పొగలు కమ్మాయి. అంతా ఎమర్జెన్సీ కిటికీ వద్దకు వెళ్తుండటాన్ని గమనించాను. పెద్ద కిటికీపైన ఉండే ఒక అడుగు పొడువు గల చిన్న కిటికీని మోచేయితో గుద్ది పగలకొట్టాను. వెంటనే ఆరుగురితో కలిసి నేను బయటపడి రోడ్డుపైకి చేరుకున్నాను. కిటికీ అద్దాలు పగిలి ఉంటే చాలామంది బతికేవాళ్లు.
- కోల బాలరాజు, తక్కెళ్లపాడు, హనుమంతునిపాడు మండలం

పాక్కుంటూ వెళ్లి బయటపడ్డా..
నేను హైదరాబాద్‌లో బస్సు ఎక్కాను. అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాను. పండగ కోసం స్వగ్రామానికి బయలుదేరా. ప్రమాదం జరిగిన వెంటనే నేను ముందు సీటు కింద ఇరుక్కుపోయాను. లేవడానికి ప్రయత్నిస్తుంటే ఎడమకాలు కదల్లేదు. ఒకవైపు మంటలు, మరోవైపు పొగ. శక్తినంతా కూడదీసుకుని పాక్కుంటూ కిటికీ దగ్గరకు చేరుకున్నాను. బస్సులోని మరో వ్యక్తి నన్ను కిటికీలోంచి కిందికి దించేందుకు సాయపడ్డాడు.
- అద్దంకి మనోహర్, పోతవరం, పామూరు మండలం
తోటివారి సాయంతో అమ్మను దక్కించుకున్నా
మా అమ్మ లక్ష్మీకుమారితో కలిసి తెలంగాణలోని ఆర్మూర్ నుంచి బస్సులో కనిగిరి బయలుదేరాం. ప్రమాదానికి గురైన బస్సు రిపేరులో ఉందని తొలుత అదే ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సులో ఇందల్‌వాయి వరకు వచ్చాం. అక్కడ మమ్మల్ని బస్సు మార్పించారు. నాలుగుచోట్ల ఈ బస్సు సాంకేతిక లోపంతో మొరాయించింది. ప్రమాదం జరిగిన వెంటనే నన్ను ఒకరు కిటికీలోంచి బయటకు పంపారు. నేను మా అమ్మకోసం గట్టిగా కేకలు వేశాను. అమ్మ కిటికీలోంచి తల బయటకు పెట్టింది. తోటివారి సాయంతో అమ్మను కాపాడగలిగాను. అప్పటికే ఆమె మంటల్లో ఇరుక్కుని గాయాలయ్యాయి.
- బత్తుల మౌనిక, కనిగిరి

భర్తను కాపాడి..
కనిగిరి మండలం చల్లగిరగల గ్రామానికి చెందిన తమిశెట్టి తిరుపాలుతో కనిగిరి కొత్తపేట వడ్డెపాలెంకు చెందిన రుక్మిణి(29)కి ఐదేళ్ల క్రితం వివాహమైంది. తిరుపాలు తెలంగాణలో బేల్దారీ పనుల కోసం కుటుంబంతో కలసి ఉంటున్నాడు. ఐదేళ్లు దాటుతున్నా వారికి సంతానం లేదు. కనిగిరి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న తర్వాత రుక్మిణి గర్భం దాల్చింది. ఆమె ఏడు నెలలు నిండు గర్భిణీ. వైద్య పరీక్ష నిమిత్తం రుక్మిణి తన భర్త తిరుపాలు, అత్త పిచ్చమ్మతో కలసి కనిగిరి బయలుదేరారు. బస్సులో మంటలు చెలరేగడంతో అద్దం పగులగొట్టిన తిరుపాలు.. రుక్మిణిని కిందకు దించాలని ప్రయత్నించాడు. అయితే ‘అత్తను కిందికి దించుతాను.. నువ్వు దిగేయ్’ అంటూ భర్తను తోసేసింది. భర్తను కాపాడిన రుక్మిణి అత్త పిచ్చమ్మను గుర్తించే క్రమంలో మంటల్లో చిక్కుకుంది. భార్య మంటల్లో చిక్కుకుని ఏడుస్తుంటే.. కాలికి తీవ్రగాయమై బస్సు బయట ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో తిరుపాలు ఏడుస్తూ ఉండిపోయాడని అదే బస్సులో వచ్చిన వారి బంధువు మౌనిక తెలిపింది. ఈ ప్రమాదంలో పిచ్చమ్మ మరణించింది.

భార్యాబిడ్డను చూడాలని..
వెలిగండ్ల మండలానికి చెందిన పొదిలి మహేంద్ర(28) జగిత్యాలలో తన స్నేహితులు కుమ్మరికుంట అబ్రహం, ప్రకాశ్‌లతో కలిసి బస్సు ఎక్కాడు. కానీ మహేంద్రకు రిజర్వేషన్ ఖరారు కాలేదు. డ్రైవర్‌తో మాట్లాడుకుని ఖాళీ బెర్త్‌పై పడుకున్నాడు. బస్సు ప్రమాదంలో మంటలు చెలరేగినప్పుడు మహేంద్ర స్నేహితులు అబ్రహం, ప్రకాశ్‌లు బస్సు అద్దాలు పగలగొట్టి కిటికీలోంచి కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మహేంద్ర బయటకు రాలేక మంటల్లో కాలిపోయాడు. బేల్దారీ పనులకు వెళ్లి భార్యాబిడ్డను చూడాలని పండగకు తిరిగి వస్తున్న సమయంలో ప్రాణాల్ని కోల్పోయాడు. మహేంద్రకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. భర్త ఇంటికి వస్తున్నాడని ఆనందంతో ఉన్న మహేంద్ర భార్యకు అతను చనిపోయాడన్న విషయం తెలిసి కుప్పకూలిపోయింది.