Share News

ప్రజల ఆకాంక్షే ‘మనమిత్ర’కు ప్రేరణ

ABN , Publish Date - Mar 12 , 2026 | 04:22 AM

యువగళం పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షే ‘మనమిత్ర’ వాట్సాప్‌ సేవలకు ప్రేరణ అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి లోకేశ్‌ చెప్పారు.

ప్రజల ఆకాంక్షే ‘మనమిత్ర’కు ప్రేరణ

  • యువగళం పాదయాత్రలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఆలోచన.. పౌరులకు సులభంగా సేవలు అందించడమే ధ్యేయం

  • వాట్సాప్‌ సేవలు తేవడం కోసం విస్తృతంగా చర్చించాం

  • మనమిత్రతో ప్రజలకు వేగంగా సేవలు

  • వాట్సాప్‌ సిటిజన్‌ ఫోరమ్‌లో మంత్రి లోకేశ్‌

న్యూఢిల్లీ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): యువగళం పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షే ‘మనమిత్ర’ వాట్సాప్‌ సేవలకు ప్రేరణ అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి లోకేశ్‌ చెప్పారు. ప్రజల విశ్వాసానికి కేంద్రంగా మనమిత్ర సేవలు ఉండాలన్న తమ రాజకీయ సంకల్పం.. అధికార యంత్రాంగం ఆలోచన విధానాన్ని మార్చివేసిందని అన్నారు. బుధవారం ప్రఖ్యాత సంస్థ మెటా ఆధ్వర్యంలో జరిగిన వాట్సాప్‌ సిటిజన్‌ ఎంగేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫోరమ్‌లో మంత్రి లోకేశ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెటా వైస్‌ప్రెసిడెంట్‌, ఇండియా, సౌత్‌ఈ్‌స్ట ఆసియా హెడ్‌ సంధ్యా దేవనాథన్‌ సంధానకర్తగా వ్యవహరించారు. ఫైర్‌సైడ్‌ చాట్‌లో సంధ్యా దేవనాథన్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌ సూటిగా సమాధానమిచ్చారు. ‘‘యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు నాకు వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఆలోచన వచ్చింది. ఒక బటన్‌ నొక్కితే కిరాణా సరుకులు, టాక్సీలు వస్తున్నాయి. సినిమాలు చూడగలుగుతున్నాం. మరి పౌరసేవలను అందించడంలో ప్రభుత్వం ఎందుకు చురుకుగా వ్యవహరించడం లేదు? అని పాదయాత్ర సమయంలో ప్రజలు నన్ను అడిగారు. పౌరసేవలను సులభతరం చేసి ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ కల్పిస్తామని అప్పట్లో ప్రజలకు వాగ్దానం చేశాను. సీఎం చంద్రబాబు ఎప్పుడూ ‘ముందుగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ తీసుకురండి’ అని చెప్పేవారు. ఇక్కడ అతిపెద్ద సవాలు అంతర్గత రాజకీయాలు. వ్యవస్థపై నియంత్రణ ఉంచుకోవాలని ప్రతిశాఖ కోరుకుంటుంది. అందరినీ కూర్చోబెట్టి చర్చించి, వారి ఏపీఐ (అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫే్‌స)లను తెరిచేలా చేయడమే అతిపెద్ద సవాలు. నేను మంత్రులు, కార్యదర్శులతో చర్చలు జరిపి, ఇది సీఎం ఆదేశం అని చెప్పాను. ప్రజలకు సేవలు అందుబాటులో ఉంచుదామన్నాను. మేం మొదట ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే సేవలతో మొదలుపెట్టాం. ఇప్పుడు మెనూ ఆధారిత విధానం నుంచి ఏఐ ఆధారిత విధానానికి వెళ్లాలనుకుంటున్నాం. దీనికి రాజకీయ సంకల్పం చాలా ముఖ్యం.


ప్రజల జీవితాల్లో గణనీయ మార్పులు..

వాట్సాప్‌ గవర్నెన్స్‌తో ప్రజల జీవితాల్లో గణనీయ మార్పులు వచ్చాయి. గతంలో హాల్‌టికెట్లు పొందడం చాలా ఇబ్బందిగా ఉండేది. వాటిని వాట్సాప్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం వల్ల విద్యార్థుల సమయం, శ్రమ ఆదా అయ్యాయి. విద్యుత్‌, ఇతర బిల్లులు చెల్లించడం కూడా ఒక గొప్ప మార్పు. ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా వివిధ విభాగాలకు ర్యాంకులు ఇస్తాం. సీఎం దీనిని వారం వారం సమీక్షిస్తారు. 1-10 స్కేల్‌లో ప్రజలు మాకు 8.5 లేదా 9 రేటింగ్‌ ఇస్తున్నారు. మా డేటా లేక్‌ ప్రా జెక్టు పౌరుడి కేంద్రంగా డేటాను ఏకీకృతం చేస్తుంది. ఉదాహరణకు ఒకసారి ఓ వ్యక్తికి జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిన తర్వాత అనేక ఇతర విషయాలను స్వయంచాలకంగా ఏకీకృతం చేయొచ్చు.

గ్రామీణులకు వాట్సాప్‌ సేవలు..

గ్రామీణ వినియోగదారులు కూడా ఇప్పుడు వాట్సాప్‌ సేవలకు అలవాటుపడుతున్నారు. రైతులు ఏయే ప్రభుత్వ సేవలకు అర్హులో అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకం. పథకాల ద్వారా లబ్ధి పొందా రో లేదా అని తెలుసుకోవడానికి వారిని స్వయంగా సంప్రదించవచ్చు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే తమ ఫోన్‌ నుంచే ఫిర్యాదులు చేయవచ్చు. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ని పరిష్కారమయ్యాయి అని చూసేందుకు ఇది తోడ్పడింది. ఇదంతా ఆన్‌లైన్‌లో చేయడానికి తగినంత రక్షణ ఉంటుంది. వాట్సాప్‌ గవర్నెన్స్‌లో పౌరసేవల సంతృప్తి స్కోర్‌లు మెరుగుపడుతున్నాయి.’’ అని లోకేశ్‌ చెప్పారు.

  • ఒక పౌరుడి దైనందిన జీవితంలో సాధారణ పౌరసేవల కోసం రాజకీయ నాయకులు, అధికారుల వద్దకు వెళ్లకుండా చేస్తామో ఆ రోజు మనం విజయం సాధించినట్లు అని నేను భావిస్తాను. పౌర సేవలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌, ఒకే ఫోన్‌ నంబర్‌పైకి తీసుకువస్తామని ఎన్నికల సమయంలో చెప్పాను. అధికారంలోకి వచ్చాక మెటా సంస్థను సంప్రదించి మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ తీసుకొచ్చాం.

- వాట్సాప్‌ ఫోరమ్‌లో లోకేశ్‌


Nara Lokesh Sanjay Dutt meeting

నేడు క్యాప్‌జెమినీ ప్రతినిధులతో లోకేశ్‌ భేటీ

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి లోకేశ్‌ బుధవారం రాత్రి విశాఖపట్నం వచ్చారు. దిగ్గజ ఐటీ సంస్థ క్యాప్‌జెమినీ విశాఖపట్నంలో కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందుకు అవసరమైన భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ గురువారం నోవాటెల్‌ హోటల్‌లో సమావేశమవుతారు.

3.jpg

రామ్మోహన్‌ ఇంటికి లోకేశ్‌

మంత్రి లోకేశ్‌ కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తన నివాసంలో బుధవారం మధ్యాహ్నం ఇచ్చిన విందుకు కూటమి ఎంపీలు, లోకేశ్‌ హాజరయ్యారు. రామ్మోహన్‌నాయుడి పిల్లలను ఎత్తుకుని లోకేశ్‌ వారితో సరదాగా మాట్లాడించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు ఈ విందుకు హాజరయ్యారు.

Updated Date - Mar 12 , 2026 | 04:22 AM