అయితే.. కేంద్రానికి మద్దతు ఇవ్వొద్దు!
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:44 AM
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టం-2023ను పునఃసమీక్షించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. కేంద్రం 2023లో చేసిన ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు.
జగన్‌కు టీఎంసీ ఎంపీ మహువా కౌంటర్
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టం-2023ను పునఃసమీక్షించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. కేంద్రం 2023లో చేసిన ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఓటర్ల జాబితాలపై స్పష్టత ఇవ్వాలని శనివారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని, ఓటు హక్కును వినియోగించుకునేలా వ్యవస్థలను పటిష్ఠం చేయాలని కోరారు. ఎన్నికల సంఘం కమిషనర్ల మధ్య విబేధాలు ఉన్నట్లుగా కథనాలు రావడం, ఓటర్ల జాబితాపై ఆరోపణలు వస్తున్న దృష్ట్యా సీఈసీ నియామక చట్టాన్ని తక్షణమే పునఃసమీక్షించాల్సి ఉందన్నారు. జగన్ చేసిన ట్వీట్‌కు టీఎంసీ ఎంపీ మహువా ఘాటుగా స్పందించారు.
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టాన్ని వ్యతిరేకిస్తున్న జగన్.. భవిష్యత్తులో కేంద్రానికి సపోర్టు చేయరాదని సూచించారు. అప్పట్లో ఈ చట్టానికి వైసీపీ ఎంపీలు మద్దతు తెలిపిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ.. పరోక్షంగా తప్పును అంగీకరించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టం-2023ను సమర్థించిన జగన్ .. తాజాగా ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలంటూ పేర్కొనడంపై రాజకీయవర్గాల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించగలరా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించగలరా అంటూ రాజకీయవర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు