బకాయిలు పెట్టి.. బుకాయింపు!
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:28 AM
నేరాలు చేసి ఆ నెపం ఇతరులపై నెట్టడం, బకాయిలు పెట్టి బుకాయించడం అనే వ్యసనానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ బానిసయ్యారని విద్యా శాఖ మంత్రి లోకేశ్ విమర్శించారు
వైసీపీ పాలనలో 4 వేల కోట్ల ఫీజులు పెండింగ్
మేం గత రెండున్నరేళ్లలో 5 వేల కోట్లు చెల్లించాం
‘మీ ఫేక్ ట్వీట్‌కు.. మా ఫ్యాక్ట్ రిప్లై’ అంటూ
జగన్ ఆరోపణలకు మంత్రి లోకేశ్ కౌంటర్
అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): నేరాలు చేసి ఆ నెపం ఇతరులపై నెట్టడం, బకాయిలు పెట్టి బుకాయించడం అనే వ్యసనానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ బానిసయ్యారని విద్యా శాఖ మంత్రి లోకేశ్ విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వేలాది కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం తీర్చిందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ చేసిన ఆరోపణలపై స్పందించిన లోకేశ్.. సోమవారం ‘ఎక్స్’ వేదికగా గణాంకాలతో సహా వాటిని తిప్పికొట్టారు. ‘మీ ఫేక్ ట్వీట్‌కు.. మా ఫ్యాక్ట్ రిప్లై’ ఇది అంటూ సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రూ.5 వేల కోట్లు ఫీజులకు చెల్లించిందని తెలిపారు. ‘‘ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ బకాయిలు తీరుస్తున్న చిత్తశుద్ధి మాది. బకాయిలు పెట్టి, బురద చల్లే దుర్బుద్ధి మీది. విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి సుమారు రూ.4 వేల కోట్లు బకాయిలు పెట్టారు. మేం రెండున్నరేళ్లలోనే దాదాపు రూ.5 వేల కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నాం’’ అని లోకేశ్ పేర్కొన్నారు. కాగా, 2026-27 విద్యా సంవత్సరంలోనే ఇప్పటివరకూ రూ.1846 కోట్లు చెల్లించినట్లు లోకేశ్ విడుదల చేసిన ఫ్యాక్ట్‌చెక్ నోట్‌లో ప్రభుత్వం తెలిపింది. 2024-25లో రూ.1451 కోట్లు, 2025-26లో రూ.1665కోట్లు చెల్లించినట్లు వివరించింది. వాటిలో ఎస్సీలకు రూ.1337కోట్లు, ఎస్టీలకు రూ.220కోట్లు బీసీలకు రూ.2079కోట్లు, మైనారిటీలకు రూ.283కోట్లు, ఓసీలకు రూ.1042కోట్లు చెల్లించినట్లు తెలిపింది.