Share News

వైఎస్‌ విగ్రహ విధ్వంసం..!

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:06 AM

పట్టపగలు వైసీపీ కార్యకర్త వైఎస్‌ విగ్ర హాన్ని ధ్వంసం చేయడం.. ఆపై తలను పట్టుకుని తిరగడం నంద్యాల పట్టణంలో కలకలం రేపింది.

వైఎస్‌ విగ్రహ విధ్వంసం..!
విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యం

రాయితో పగలకొట్టిన వైసీపీ కార్యకర్త జంబులయ్య

ఘటనపై వైసీపీ కుట్ర కోణం...?

నిరసన బాటలో వైసీపీ దుష్ప్రచారం

2018 నుంచి నిందితుడు వైసీపీలోనే..

పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు

నంద్యాల(నంద్యాల, క్రైమ్‌), మే31(ఆంధ్రజ్యోతి) : పట్టపగలు వైసీపీ కార్యకర్త వైఎస్‌ విగ్ర హాన్ని ధ్వంసం చేయడం.. ఆపై తలను పట్టుకుని తిరగడం నంద్యాల పట్టణంలో కలకలం రేపింది. దాడి చేసిందీ వైసీపీ కార్యకర్త ఆయినప్పటికీ ఆ పార్టీ నేతలు, నాయకులు నిరనలు చేసి రాజకీయ లబ్ది కోసం కూటమి పార్టీలపై దుష్ప్రచారం చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇతర రాజకీయ పార్టీల ప్రమేయం లేదని పోలీసులు నిర్థారణ చేసినా వైసీపీ శ్రేణులు బురదజల్లే ప్రయత్నం చేయడం చూస్తే.. ఈ ఘటనలో వైసీపీ కుట్ర కోణం ఏమైనా ఉందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి ఆదివారం నంద్యాల పట్టణంలో జరిగిన ఈ ఘటనలో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

2018 నుంచి వైసీపీలోనే..

నంద్యాల పట్టణంలోని బైటిపేటకు చెందిన చాకలి చాకలి నాగయ్య కుమారుడు జంబులయ్య ఆదివారం ఉదయం 6.29 గంటల సమయంలో శ్రీనివాస్‌నగర్‌లోని వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని రాయితో పగలకొట్టి ఆ తర్వాత తలను తీసుకెళ్లడం పట్టణంలో కలకలం రేపింది. ఇదంతా చూస్తున్న పట్టణ ప్రజలు వీడియోలు, పోటోలు తీశారు. పోలీసులు అక్కడిక్కడ చేరుకుని నిందితుడి అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించి పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మురం చేయగా.. ఆసక్తికర విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. ఇతను కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం గ్రామానికి చెందిన బాలమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. గత మూడు నెలల కిందట వీరి కుమార్తె స్వాతి ఆత్మహత్యకు పాల్పడటంతో జంబులయ్య మానసికంగా మధనపడుతున్నాడని తెలిసింది. జంబులయ్య తండ్రి చాకలి నాగయ్య ఎన్నో ఏళ్ల నుంచి మున్సిపల్‌ కమిషనర్‌ల ఇంటి వద్ద రజక వృత్తి చేసేవారు. 2021లో ఆయన చనిపోయారు. 2018 నుంచి నిందితుడు వైసీపీలో ఉంటూ కీలకంగా పనిచేశారు. పైగా నిందితుడి వైసీపీ సభ్యత్వం కూడా ఉంది.

ఆ ఇద్దరికి అనుచరుడే...

నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డితో పాటు ఆ పార్టీ 42వ వార్డు మాజీ కౌన్సిలర్‌, వైసీపీ నేత పున్నా శేషయ్యకు కూడా నిందితుడు ప్రధాన అనుచరుడు. అప్పటి వైసీపీ హయాంలో 2022లో పాలకుల సిఫార్సుల తో తన భార్య బాలమ్మకు సీఆర్పీగా(కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌) ఉద్యోగం తెచ్చుకున్నారు. 2021లో తన తండ్రి చనిపోవడంతో తనకు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని అప్పటి వైససీపీ నేతల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు

ఘటనపై వైసీపీ కుట్ర కోణం..?

దాడి చేసిన వ్యక్తి వైసీపీ కార్యకర్త అయినా మకేమీ సంబంధం లేనట్టుగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా తదితర నాయకులు కలిసి నంద్యాల పట్టణంలో నిరసనలు చేసి కూటమి పార్టీపై దుష్ప్రచారం చేయడం వెనుక అంతర్యమెమిటో..? పైగా ఘటనపై కూటమి హస్తం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు నిందితుడు వైసీపీ నేతలు, నాయకులతో కలిసి దిగిన ఫొటోలు, ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వైసీపీ నేతలు కూటమి పార్టీలపై బురదజల్లే ప్రయత్నం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

వైసీపీ నిరసనతో అంతరాయం..

ఈ ఘటన నేపథ్యంలో వైసీపీ నేతలు, నాయకులు స్థానిక శ్రీనివాస్‌సెంటర్‌కు చేరుకుని విగ్రహం వద్ద గంటల పాటు నిరసనలు చేశారు. ఇదే క్రమంలో పోలీసులు అక్కడి చేరుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు..

ఈ ఘటనపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ ఆధారంగా పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మురం చేశారు. ఈ ఘటన వెనుక వైసీపీ నేతలు, నాయకుల కుట్ర ఉందా..? నిందితుడు తాగిన మత్తులో ఏమైనా చేశాడా..? లేక కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది దాడికి పాల్పడ్డాడా..?అనే వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది. నిందితుడికి వైసీపీలో సభ్యత్వంతో పాటు వైసీపీ వాట్సాప్‌ గ్రూపులో సభ్యుడిగా కూడా ఉన్నారని ఎస్పీ ధృవీకరించారు.

నాటకాల జగన్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే..

మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి

నంద్యాల రూరల్‌, మే 31 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధి కోసమే వైసీపీ నేత జగన్‌ నాటకాలు ఆడుతున్నారని, ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర న్యాయ, మైనారిటీ, రోడ్డు, భవనాల శాఖ మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. జగన్‌ నైజం జగమెరిగిన సత్యమన్నారు. అల్లర్లు సృష్టించి అభివృద్ధికి ఆటంకాలు కలిగించాలని వైసీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని శ్రీనివాససెంటర్‌లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్య ముమ్మాటికి వైసీపీ అభిమానేనని తెల్చిచెప్పారు. రాష్ట్రంలో అల్లర్లు, అలజడులు సృష్టించడానికి వైసీపీ ఒక టీంను ఏర్పాటు చేసుకుందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నానా నాటకాలాడుతున్నారని అన్నారు. దమ్ముంటే అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించుకుందామన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి పారిశ్రామికవేత్తలు సైతం రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు వస్తుంటే వారిని సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:06 AM