Share News

టవరెక్కి యువకుడి హైడ్రామా

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:04 AM

ఆరునెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ జంట. వారి పచ్చని సంసారంలో ‘మద్యం’ చిచ్చు పెట్టింది. భార్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో ఆమెను తిరిగి రప్పించుకోవడానికి ఓ యువకుడు ఆలిండియా రేడియో టవర్‌ ఎక్కి హైడ్రామా సృష్టించాడు.

టవరెక్కి యువకుడి హైడ్రామా
కౌన్సెలింగ్‌ ఇస్తున్న టూటౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి

పచ్చని సంసారంలో ‘మద్యం’ చిచ్చు

ఆదోని, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఆరునెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ జంట. వారి పచ్చని సంసారంలో ‘మద్యం’ చిచ్చు పెట్టింది. భార్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో ఆమెను తిరిగి రప్పించుకోవడానికి ఓ యువకుడు ఆలిండియా రేడియో టవర్‌ ఎక్కి హైడ్రామా సృష్టించాడు. ఆదోని పట్టణంలో శనివారం ఉదయం ఈఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. చిప్పగిరి మండలం నేమకల్‌ గ్రామానికి చెందిన గొల్ల సురేంద్ర జిందాల్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం జంగమ నాగేశ్వరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతడు తాగుడుకు బానిసయ్యాడు. వీరి మధ్య కలతలు మొదలయ్యాయి. తన భర్త తాగుడు మానుకోకపోవడంతో విసిగిపోయిన భార్య నెల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఎంత పిలిచినా ఆమె తిరిగి రాకపోవడంతో సురేంద్ర మనస్థాపానికి గురయ్యాడు. శనివారం ఉదయం 8 ఆదోనిలోని ఆలిండియా రేడియో టవర్‌ పైకి ఎక్కాడు. నా భార్య వస్తేనే దిగుతా... లేదంటే దూకేస్తా అంటూ కేకలు వేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ రమనాథ్‌ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా సురేంద్ర వినలేదు. చివరకు సీఐ రాజశేఖర్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ఫోన్‌ ద్వారా సురేంద్రతో సుధీర్ఘంగా మాట్లాడారు. భార్యతో మాట్లాడిస్తామని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సుమారు రెండు గంటల తర్వాత అతడు క్షేమంగా కిందకు దిగొచ్చాడు. పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం పోలీసులు ఇరు కుటుంబాలను స్టేషన్‌కు పలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సురేంద్ర తాగుడు మానేస్తే అమ్మాయిని కాపురానికి పంపిస్తామని నాగేశ్వరి తల్లిదండ్రులు పోలీసులకు తేల్చి చెప్పారు. అతడు కూడా తన తప్పు తెలుసుకొని ప్రవర్తన మార్చుకుంటానని హామీ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది.

Updated Date - Apr 26 , 2026 | 12:04 AM