Share News

ప్రశాంతంగా దర్శనాలు చేసుకోవాలి

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:21 PM

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు సిబ్బందితోపాటు భక్తులతో కలెక్టర్‌ రాజకుమారి స్వయంగా మాట్లాడారు.

ప్రశాంతంగా దర్శనాలు చేసుకోవాలి
భక్తులకు మజ్జిగ ఇస్తున్న కలెక్టర్‌

ఏర్పాట్లలో లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు

నిర్ణీత స్లాట్ల ప్రకారమే శివస్వాములకు స్పర్శ దర్శనాలు

కలెక్టర్‌ రాజకుమారి

శ్రీశైలం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు సిబ్బందితోపాటు భక్తులతో కలెక్టర్‌ రాజకుమారి స్వయంగా మాట్లాడారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి క్షత్ర పరిధిలో పలు కీలక ప్రాంతాలతోపాటు అటవీ మార్గం గుండా పాదయాత్ర చేస్తూ వచ్చ మార్గాలను పరిశీలించారు. కైలాస ద్వారం వద్దకు చేరుకున్న భక్తుల బృందాలతో చాలా సేపు ముచ్చటించారు. ప్రధానంగా మంచినీరు, వైద్యం, తాత్కాలిక శౌచాలయాల అందుబాటు వాటి నిర్వహణపై అధికారుల పర్యవేక్షణను తెలుసుకున్నారు. అదే విధంగా చంద్రవతి కళ్యాణ మండపంలో శివస్వాములు సేద తీరేందుకు తగిన ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఆలయంలో ఉండే క్యూలైన్లు కంపార్టుమెంట్లలో తాగునీరు, శానిటేషన్‌, అల్పాహార పంపిణీలపై భక్తులతో మాట్లాడి వారి సమస్యలను సలహాలను అడిగారు. అదే విధంగా ఆలయ ప్రవేశ ద్వారాలు, దర్శనానంతరం ద్వారాలలో డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఎస్పీ సునీల్‌ షరాణ్‌తో కలిసి పరిశీలించారు. అమ్మవారి దర్శనానంతరం మాల విరమణ శిబిరాలకు వెళ్లే మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్షేత్ర పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్య తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అంచనాకు మించి వస్తున్న భక్తుల కోసం అదనంగా చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. క్షేత్ర పరిధిలో నిత్యాన్నదాన సత్రాల వద్ద అడ్డగోలుగా పార్కింగ్‌లు చేసి తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం సమంజసం కాదని, వాహనాల కొసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశాలలో నిలుపుకోవాలని భక్తులను కోరారు. కలెక్టర్‌ వెంట ఎస్పీ సునీల్‌ షరాణ్‌, ఆలయ ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:21 PM