మీరే బయటివాళ్లు..!
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:47 PM
‘ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాం. మీరే బయటివాళ్లు. కనీసం ఆదోనిలో ఎక్కడ ఓటు ఉందో కూడా తెలీదు. ఆఖర్లో వచ్చి అన్యాయంగా గెలిచారు..’ అంటూ బీజేపీ నాయకులు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ విమర్శలకు పాల్పడటంతో ఆ పార్టీతో పాటు ఆదోనిలో చర్చనీయాంశంగా మారింది.
ఆదోని, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాం. మీరే బయటివాళ్లు. కనీసం ఆదోనిలో ఎక్కడ ఓటు ఉందో కూడా తెలీదు. ఆఖర్లో వచ్చి అన్యాయంగా గెలిచారు..’ అంటూ బీజేపీ నాయకులు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ విమర్శలకు పాల్పడటంతో ఆ పార్టీతో పాటు ఆదోనిలో చర్చనీయాంశంగా మారింది. ఆదోని కోర్టు ఆవరణలో మూడు రోజుల క్రితం తనపై జరిగిన భౌతిక దాడి, కుల దూషణల ఉదంతంపై పెద్దకడబూరు బీజేపీ మాజీ మండలాధ్యక్షురాలు మేరీ, నాయకులు కాళింగ, నజీర్, మహమ్మద్‌రఫీ, నూర్‌బాష, మల్లమ్మ, గోవిందమ్మ తదితరులు శనివారం ద్వారకా లాడ్జిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేరీ మాట్లాడుతూ మూడు రోజుల క్రితం తాను వ్యక్తిగత పనిపై ఆదోని కోర్టుకు వెళ్లగా, బీజేపీకి చెందిన శివప్పగౌడ్, రాజప్పగౌడ్ అక్కడ కనిపించడంతో పలకరించానని తెలిపారు. వారి కేసు వ్యవహారమై అడ్వకేట్ వై.ఆర్.మల్లికార్జున తమ పని చేయడం లేదని, సంబంధిత కేసు కట్ట (ఫైల్) తిరిగి ఇవ్వమని కోరేందుకు వెళ్లగా, అడ్వకేట్ ఆయన అనుచరులతో కలిసి వారిపై భౌతిక దాడికి దిగారని ఆరోపించారు. ఈ గొడవను అడ్డుకోవడానికి వెళ్లిన తనపై తన భర్త కాళింగపై అడ్వకేట్ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు. ఇదే ఘటనను ఉద్ధేశిస్తూ.. తాను ఎస్సీ మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్యే నీచంగా మాట్లాడారని, ఆయనకు ఎస్సీలంటే చులకన భావం ఉందన్నారు. ‘మేము బయటి వాళ్లం కాదు. మీరే బయటి వాళ్లు’ అని మండిపడ్డారు. ఎమ్మెల్యే పార్థసారథికి కనీసం ఆదోనిలో ఓటు కూడా లేదని, ఎక్కడ నుంచో వచ్చి అన్యాయంగా గెలిచారని ఆరోపించిన ఆమె, ఆ గెలుపు వెనుక ఉన్న అసలు నిజాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే తీరు వల్లే ఇటీవల 200 కుటుంబాలు బీజేపీకి దూరమయ్యాయని మేరీ ఆరోపించారు.