నాడు సరిహద్దులో.. నేడు పాఠశాలలో
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:30 PM
గత 23 ఏళ్లుగా ఆర్మీలో జవాన్లుగా పని చేసి గణతంత్ర వేడుకలు ఆర్మీలో బార్డర్‌లో జరుపుకున్న జవాన్లు...
ఉపాధ్యాయులుగా మారిన ఆర్మీ అధికారులు
మెగా డీఎస్సీలో ఎంపిక
కోసిగి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): గత 23 ఏళ్లుగా ఆర్మీలో జవాన్లుగా పని చేసి గణతంత్ర వేడుకలు ఆర్మీలో బార్డర్‌లో జరుపుకున్న జవాన్లు... నేడు ఉపాధ్యాయుల హోదాలో మొదటిసారిగా 77వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీ-2025 ద్వారా ఉపాధ్యాయ కొలువులు సాధించి కోసిగి మండల పరిధిలోని అగసనూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా నాటి ఆర్మీ జవాన్లు శ్రీకాంత్‌రెడ్డి, రామన్నలు విధుల్లో చేరారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చెందిన శ్రీకాంత్ రెడ్డి 20 సంవత్సరాలుగా దేశ సరిహద్దులో జమ్మూకాశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో సైనికుడిగా పని చేశారు. ఆర్మీ జవాన్లకు సుభేదార్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేసిన శ్రీకాంత్ రెడ్డి డీఎస్సీ-2025 ద్వారా నాన్ లోకల్ కోటాలో ఉద్యోగం సాధించాడు. అలాగే మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామానికి చెందిన రామన్న 23 ఏళ్లుగా ఇండియన్ ఆర్మీలో పని చేసి 2025 డీఎస్సీలో ఉద్యోగం సాధించి అగసనూరు పాఠశాలలో చేరారు. ఆర్మీ జవాన్లుగా పని చేసిన శ్రీకాంత్‌రెడ్డి, రామన్నలు మొదటిసారిగా అగసనూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి వేడుకలు నిర్వహించారు. నవసమాజ నిర్మాణం, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేది పాఠశాల నుంచి మొదలవుతుందని ఆర్మీ జవాన్ దుస్తులతో విద్యార్థుల ముందు నిలబడటం చూసి విద్యార్థుల్లో కూడా దేశ సేవలో పని చేయాలనే ఆలోచన కలుగుతుందని తెలిపారు.