అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్న వైసీపీ
ABN , Publish Date - Apr 20 , 2026 | 11:56 PM
బనగానపల్లె నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్చు కోలేకపోతోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు.
కబ్జాలు, కమీషన్ల సంస్కృతి మీదే
మాజీ ఎమ్మెల్యే కాటసానిపై మంత్రి బీసీ ఫైర్
బనగానపల్లె, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): బనగానపల్లె నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్చు కోలేకపోతోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై తనదైన శైలిలో విరుచుకుప డ్డారు. నియోజకవర్గంలో శాశ్వతంగా నీటి సమస్య తీర్చడానికి రూ.510 కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి మంచినీటి సమస్య లేకుండా చేస్తున్నామన్నారు. సొంత నిధులతో కూడా తాను నియోజకవర్గ వ్యాప్తంగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించానన్నారు. టీడీపీ హయంలో ప్రారంభించిన శిలాఫలకాలు కూల్చివేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేకే దక్కిందన్నారు. తన సోదరుడు బీసీ రాజారెడ్డి బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ఆస్పత్రి రోగులకు సొంత ఖర్చులతో మినరల్‌వాటర్ ప్లాంట్, ఉచితంగా భోజనం అందిస్తుంటే ద్వేషంతో ఆపివేసి పేదలకు భోజనం, తాగునీరు లేకుండా వారి పొట్టకొట్టిన వ్యక్తి కాటసాని కాదా? అని ప్రశ్నించారు. బనగానపల్లె, కోవెలకుంట్ల పట్టణాల్లో ముస్లింలకు కమ్యూనిటీ హాల్ నిర్మించి షాదీఖానా అని నమ్మించి కాటసాని మోసం చేశాడన్నారు. బనగానపల్లెలో రింగ్ రోడ్డు నిర్మాణాన్ని, షాదీఖానాను అడ్డుకుంటున్నాడన్నారు. పట్టణంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని 5 ఏళ్లలో ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ఎస్సార్బీసీ స్థలాన్ని కబ్జాచేసి అనుమతులు లేకుండానే ఘాట్ నిర్మించారన్నారు. కబ్జాలు, కమీషన్ల సంస్కృతి వైసీపీదే అన్నారు. బీసీ ఇందిరమ్మపై దాడి చేసిన దుర్మార్గ వ్యక్తులు వైసీపీ వారన్నారు. వైసీపీ హయంలో గుంతలమయంగా ఉన్న రోడ్లస్థానంలో నాణ్యమైన రోడ్లను నిర్మిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వందన్నారు. చేతనైతే అభివృద్ధిపై చర్చకు రావాలని మరోసారి కాటసాని రామిరెడ్డికి మంత్రి బీసీ సవాల్ విసిరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బురానుద్దీన్, పాతపాడు మహేశ్వరరెడ్డి, భూషన్న, కాశీంబాషా, అల్తా్‌ప హుసేన్, సలాం పాల్గొన్నారు.