వైసీపీ నేతలవి మతిలేని ఆరోపణలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:23 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలందరూ మతిలేని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అభాసుపాలవుతున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలందరూ మతిలేని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అభాసుపాలవుతున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. అదొక చెత్త పార్టీ అని, అసలు వైసీపీకి ఓ స్పష్టమైన సిద్దాంతం అంటూ ఏదీ లేదన్నారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద వైసీపీ చేసిన ఆందోళనలపై ఆమె స్పందించారు. ఈ సందర్భంగా గురువారం కర్నూలు నగరం పందిపాడు సమీపంలో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ఎమ్మెల్యే చరిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థిరత్వం, నిలకడలేని వైసీపీ తీరును ఎండగడుతూ ఏబీఎన్-ఆంద్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు మద్దతు ప్రకటించారు. ఇష్టారీతిన రాజధానులను మార్చాలని చూడటం సరైంది కాదని చెప్పడం సరైందే అన్నారు. వైసీపీలోని సీనియర్ నాయకులు జగన్‌కు వంత పాడటం మానేసి మంచి సలహా ఇవ్వాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజామాన్యం ప్రయత్నించిందని గౌరుచరిత వివరించారు. విభజన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినప్పుడు వైఎస్ జగన్ అమరావతికి జై కొట్టాడని విమర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానులని, ఇప్పుడేమో ‘మావిగన్’ అంటూ బుర్రలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. అమరావతిని పక్కన పెట్టిన ఆయన రూ.500 కోట్లతో విశాఖలోని రుషికొండలో భారీ ప్యాలె్‌సను కట్టించుకున్నాడని ఆరోపించారు. అమరావతి కోసం పార్లమెంట్‌లో ఎంపీలుగా ఉన్న 50 పార్టీలో 49 మద్దతు ఇచ్చాయని, ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకించిందన్నారు.