Share News

వైసీపీ నాయకుల రచ్చ

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:09 AM

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులు రచ్చ చేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఎక్కడిక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జగన్‌ పర్యటనకు కీలక వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నాయకులకు ముందస్తూ షరతులను ప్రకటించిన విషయం తెలిసిందే.

వైసీపీ నాయకుల రచ్చ
కర్నూలులో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

పోలీసులను ఎదురించి.. బారికేడ్లను తొలగించి..

దూసుకెళ్లిన వాహనాలు

గంటల తరబడి ట్రాఫిక్‌ అంతరాయం

బనగానపల్లెలో నాగ ప్రతాపరెడ్డిపై కేసు నమోదు

నంద్యాల/ బనగానపల్లె, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులు రచ్చ చేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఎక్కడిక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జగన్‌ పర్యటనకు కీలక వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నాయకులకు ముందస్తూ షరతులను ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం జిల్లాలో నంద్యాల, డోన్‌, బనగానపల్లె, నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల పరిధిలోని వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు, కార్యకర్తలతో పెద్దఎత్తున వాహనాలతో నిబంధనలు అతిక్రమించి కర్నూలుకు వెళ్లే ప్రయాత్నం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని షరతులు ప్రకారం అనుమతించే ప్రయత్నించగా ఇంతలోనే కొందురు నాయకులు దురుసుగా వ్యవహరించారు. బనగానపల్లె నుంచి బేతంచెర్లకు వెళ్లే రోడ్డు మధ్యలో ఉన్న బారికేడ్లను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుడు కోయిలకుంట్ల మండలం బిజనవేమల గ్రామానికి చెందిన భీమిరెడ్డి నాగ ప్రతా్‌పరెడ్డి పక్కకి లాగి పడేశారు. దీంతో పలు వాహనాలు దూసుకెళ్లాయి. పోలీసులు, వైసీపీ నాయకుల మద్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. బనగానపల్లె పో లీసులు ఆనాయకుడిపై కేసు నమో దు చేశారు. డోన్‌, నందికొట్కూరు, నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో రహదారులపై వైసీపీ నాయకులు పెద్దఎత్తున వచ్చి రచ్చ చేశారు. పలు నినాదాలు చేస్తూ నానా హంగామా చేశారు. పోలీసులు ఎంత నచ్చచెబుతున్నా వినకుండా దౌర్జన్యకాండకు దిగారు. ఆయా రోడ్లపై ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే మా నాయకుడు వచ్చాడు. మీకేంటి..? మొండిగా మేము వెళ్లాల్సిందే? మాకు ఎలాంటి నిబంధనలు వర్తించవు? అన్నట్టుగా వైసీపీ వర్గీయులు వ్యవహరించారు.

వైసీపీ జెండాలు, బైకులతో..

నందికొట్కూరు: మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కర్నూలు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాల్‌చల్‌ చేశారు. గురువారం ఉదయం నుంచే పట్టణంలో వైసీపీ జెండాలు, బైకులతో భారీ శబ్దాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. కొత్తపల్లి, పాములపాడు, జూపా డుబంగ్లా, పగిడ్యాల మండలాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో భారీగా వెళ్తుడడంతో ట్రాఫిక్‌ నిబంధనలను దృష్ట్యా ఆ వాహనాలను నందికొట్కూరు సీఐలు సుబ్రహ్మణ్యం, అశోక్‌కుమార్‌ల 340సి జాతీయ రహదారిపై నాగలూటి క్రాస్‌ వద్ద నిలిపివేశారు. దీంతో వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డా.ధార సుధీర్‌, పట్టణ అధ్యక్షులు మన్సూర్‌ అక్కడి చేరుకొని వాహనాలను ఎందుకు నిలిపివేశారంటూ పోలీసులను ప్రశ్నించారు. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగానే వాహనా లను నిలిపివేశామని మరికొంత సేపు వాహనాలను నిలపాలని రూరల్‌ సి.ఐ. సుబ్రహ్మ ణ్యం తెలిపారు. అంతలోనే అక్కడి చేరుకున్న ఆత్మకూరు డిఎస్పీ రామాంజనేయులు వాహనాలను కర్నూలు వైపు మల్లించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. సిద్ధార్థరెడ్డి, ధార సుధీర్‌ను అక్కడి నుంచి డీఎస్పీ పంపించారు.

ఉత్కంఠ భరితం..

ఆదోని, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఆదోని కోర్టులో ఎమ్మెల్యే విరూపాక్షిపై నమోదైనకేసు విచారణ న్యాయవాదుల పోటాపోటీ వాదనల మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రాసిక్యూషన్‌ తరపున పీపీ బాలాజీ గట్టిగా వాదనలు వినిపించగా, ఎమ్మెల్యే తరపున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాటిని తిప్పి కొడుతూ బలమైన కౌంటర్‌ వాదనలు ప్రదర్శించారు. ఇరువర్గాల న్యాయవాదుల మధ్య జరిగిన వాదనలతో కోర్టులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్‌ తరపున పీపీ బాలాజీ వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారు ఇచ్చిన కంప్లైట్‌ ఆధారంగానే పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారని కోర్టుకు తెలిపారు. నేరం జరిగిన విధానం, బాధితుల ఫిర్యాదులోని అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ప్రాసిక్యూషన్‌ తరపున గట్టి వాదనలు వినిపించారు. పీపీ బాలాజీ వాదనలను పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సృష్టించిన తపడు (ఫ్యాబ్రికేటెడ్‌) ఎఫ్‌ఐఆర్‌ అని ఆయన వాదించారు. ఈ కేసులో ప్రాథమికంగా 34 మంది నిందితుల పేర్లు రిజిస్టర్‌ అయినట్లు తెలపగా.. విచారణలో ముగ్గురి పేర్లు రిపీట్‌ కావడం, మరొకరి పేరు కొత్తగా నమోదు కావడంతో ప్రస్తుతం మొత్తం 32మందిపై ఈ కేసు కొనసాగుతోంది. ఈ కేసు విచారణను రెండో అదనపు ఇన్‌చార్జి జిల్లా న్యాయాధికారి లక్ష్మిరాజ్యం ఈనెల 18వ తేదీకి వాయిదా వేశారు.

అసెంబ్లీకి పోవాలబ్బా..!

కర్నూలు క్రైం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఆయన అసెంబ్లీకి పోవాలబ్బా..! పోతే ఏమవుతుంది..! కొంత అవమానముంటుంది.. అంత మాత్రానికే అసెంబ్లీకి వెళ్లడం మానేస్తే ఎలా అంటూ ఓ మాజీ వైసీపీ ఎమ్మెల్యే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ను ఉద్దేశించి మాట్లాడటం విశేషం. పంచలింగాల వద్ద సబ్‌జైలుకు జగన్‌ను కలిసేందుకు పలువురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు వచ్చారు. వీరంతా ఓ చెట్టు కింద చేరి జగన్‌ గురించి మాట్లాడుకుని జోకులు వేసుకోవడం విశేషం. ఈయన అసెంబ్లీకి వెళితే.. చంద్రబాబును అవమానపరిచినట్లుగా జగన్‌ను అవమానపరుస్తారని అందుకే పోవడం లేదంటా ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానిస్తే.. అవమానులుంటాయి... రాజభోగాలు అనుభవించినప్పుడు కనిపించలేదా అంటూ మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు వెల్లివిరిశాయి. అసెంబ్లీకి వెళితే రెండు నిమిసాలే మైక్‌ ఇస్తారంటా ఓ వైసీపీ నాయకుడు ప్రస్తావిస్తే.. అయినా పోవాలబ్బా అటూ మరో మాజీ ఎమ్మెల్యే చలోక్తులు విసిరారు. అంతటితో ఆగని వీరి వ్యాఖ్యలు వల్లభనేని వంశీ, కొడాలి నాని దగ్గరకు వెళ్లాయి. కొడాలినాని హార్ట్‌ సర్జరీ కావడంతో తప్పించుకున్నారంటూ ఓ నాయకుడు జోక్‌ వేస్తే.. ఆయన మాత్రం అరెస్టు నుంచి భలే తప్పించుకున్నాడబ్బా అంటూ మరోకరు హాస్యాన్ని పండించారు. వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ అరెస్టు సమయంలో జైలుకు వెళ్లినప్పుడు టిప్‌టా్‌పగా హుందాగా వెళ్లాడనీ, తిరిగి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ముసులోడిగా మారాడని వ్యాఖ్యానించడంతో అక్కడున్న నాయకులంతా గొల్లున నవ్వారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను అసలు గుర్తు పట్టలేకపో యానంటూ ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 14 , 2026 | 12:09 AM