Share News

వైసీపీ నాయకుడి భూ దోపిడీ

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:12 PM

వైసీపీ నాయకుడి భూ దోపిడీ

వైసీపీ నాయకుడి భూ దోపిడీ
ఉరుకుంద రోడ్డులో వైసీపీ నాయకుడు అక్రమంగా నిర్మిస్తున్న కళాశాల భవనం

రూ.3కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా

ఆ స్థలాలను పరిశీలించిన టీడీపీ నాయకులు

కోసిగి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడు భూదోపిడీకి పాల్పడ్డాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.3కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూ మిని కబ్జా చేశాడు. కోసిగిలోని ఉరుకుంద రోడ్డులో ఆ వైసీపీ నాయకుడు కబ్జా చేసిన స్థలాన్ని శుక్రవారం టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, మండలాధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, ఆర్లబండ సొసైటీ చైర్మన్‌ నాడిగేని అయ్యన్న, మాజీ జడ్పీటీసీ తోవి రామకృష్ణ, సంజీవగేని ఈరన్న పరిశీలించారు. వారు మాట్లాడుతూ సర్వేనెంబర్‌ 51, 52, 53ల్లో ఉన్న ఎకరాకు పైగా ఉన్న ప్రభుత్వభూమిని వైసీపీ చెందిన ఎరుకుల లక్ష్మన్న తమ ఆధీనంలోకి తీసుకుని కబ్జా చేశాడు. ప్రభుత్వ భూమిలో కళాశాల నిర్మిస్తున్న స్థలం, సర్వే.నెంబర్‌.51, 52, 53లో ఉన్నప్పటికీ సర్వే.నెంబర్‌.55 పట్టా భూమి అని చూపిస్తూ డాక్యుమెంటు నెంబర్‌. 7504/2024 ద్వారా కోసిగి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో తప్పుడు రిజిస్ర్టేషన్లు చేయించాడు. అదే స్థలాన్ని రెండోసారి మరలా డాక్యుమెంటు నెంబర్‌.649/2025 ద్వారా కోసిగి కడాపాలెం చెందిన అరిగి రామన్న, బెస్లి ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ సొసైటీ పేరుతో కళాశాలకు రిజిస్ర్టేషన్లు చేయించారు. ఈ వ్యవహారమంతా నిబంధనలకు విరుద్ధ్దంగా జరిగిందని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఉరుకుందకు వెళ్లే ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ ప్రభుత్వ స్థలంలో పందుల షెడ్లు, నాటుకోళ్ల షెడ్లు వేసి నల్లబండలు పాతి భూమిని ఆక్రమించారని తెలిపారు. కలెక్టర్‌ డా.ఏ. సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, ఆదోని సబ్‌ కలెక్టర్‌ అజయ్‌ కుమార్‌, కోసిగి తహసీల్దార్‌ వేణుగోపాల్‌ వెంటనే స్పందించి వైసీపీ నాయకుడు చేసిన భూకబ్జాపై సమగ్ర విచారణజరిపించాలని డిమాండ్‌ చేశారు.

విచారణ జరిపి చర్యలు తెలుసుకుంటా

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకుంటాం. ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవు.

వేణుగోపాల్‌, తహసీల్దార్‌

Updated Date - Apr 10 , 2026 | 11:12 PM