Share News

వైసీపీ నేత రవీంద్రారెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:02 AM

తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పి.రవీంద్రా రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి సతీమణి, టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ డిమాండ్‌ చేశారు.

వైసీపీ నేత రవీంద్రారెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే
మాట్లాడుతున్న టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ

మహిళలంటే అంత చిన్నచూపా?

టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ

బనగానపల్లె, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పి.రవీంద్రా రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి సతీమణి, టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ డిమాండ్‌ చేశారు. కడప జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో రవీంద్రా రెడ్డి బీసీ ఇందిరమ్మపై పలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఆమె స్పందించారు. ఈ మేరకు శనివారం బనగానపల్లె పట్టణంలో బీసీ ఇందిరమ్మ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తనకు రవీంద్రారెడ్డి ఎవరో తెలియదని, ఆయన ముఖం కూడా ఎన్నడూ చూడలేదన్నారు. అలాంటి వ్యక్తి తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం దారుణమన్నారు. బనగానపల్లెలో డబ్బు వసూలు చేస్తున్నానని, బియ్యం వ్యాపారం చేస్తున్నానని చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. లేనిపక్షంలో తనతో పాటు మహిళా సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడి విషయాలు తెలుసుకోకుండా ఎవడో ఒక బ్రోకర్‌ రాసిచ్చిన స్ర్కిప్ట్‌ చదవడానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు. కరోనా కష్ట సమయంలో పట్టణంలో తాను సొంత డబ్బులు పెట్టి నెలల తరబడి పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశానన్నారు. ప్లాస్టిక్‌ నివారణకు శ్రీకారం చుట్టి ప్రజల్లో మార్పు తెచ్చానన్నారు. పేద విద్యార్థులకు చదువుకు ఆర్థికసాయం చేస్తున్నానని, ప్రతి నెల 9వతేదీన బనగానపల్లెలో గర్భవతులు, బాలింతకు పౌష్ఠికాహారం అందిస్తున్నామన్నారు. తన గురించి ప్రజలకు బాగా తెలుసన్నారు. వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీ సాక్షిగా అవమాన పరిస్తే అప్పటి సీఎం జగన్‌ అసెంబ్లీలో వెకిలి నవ్వులు నవ్వారన్నారు. అలాంటి వ్యక్తి గతంలో సీఎం కావడం ఏపీ ప్రజల ఖర్మ అన్నారు. తల్లికి, చెల్లికి అన్యాయం చేసిన వ్యక్తి జగన్‌ అన్నారు. అలాంటి వ్యక్తికి, ఆపార్టీకి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదన్నారు. సోషల్‌ మీడియాలో మహిళలపై వైసీపీ నీచ రాజకీయం చేస్తోందన్నారు. రవీంద్రారెడ్డి కుటుంబంలోని మహిళలను విమర్శిస్తే తన బాధ ఏంటో అర్థమవుతుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు టంగుటూరు శీనయ్య, కాశీంభాష, బురానుద్దీన్‌, అత్తార్‌ కలాం, గౌండా బాబు, సలాం, గడ్డం చెన్నారెడ్డి, హర్షద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 12:02 AM