శ్రీశైలంలో భక్తజనం
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:48 PM
శ్రీశైల క్షేత్రమంతా శివపారవశ్యంతో నిండిన భక్తుల సమూహాలతో సందడిగా మారింది.
శ్రీగిరికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు
స్వామి, అమ్మవార్ల దర్శనానికి 5 గంటలు
శ్రీశైలం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రమంతా శివపారవశ్యంతో నిండిన భక్తుల సమూహాలతో సందడిగా మారింది. వేసవి సెలవులు కారణంగా తెలుగు రాష్ట్రాల యాత్రికులే కాకుండా ఉత్తర ప్రాంత రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. తెల్లవారుజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసుకుని క్యూలైన్లలో బారులుదీరారు. సర్వ దర్శనంకోసం 5 గంటలుకాగా శీఘ్ర దర్శనానికి 4 గంటలు, అతిశీఘ్ర దర్శనానికి 3 గంటలు, వీఐపీ బ్రేక్ స్పర్శ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చినప్పటికీ ఏర్పాట్ల విషయంలో సిబ్బంది పనితీరు అభినందనీయమని ఈఓ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం రెండు విడతల నిర్ణీత టైం స్లాట్ ప్రకారం స్పర్శ దర్శనాలు భక్తులకు దర్శనాలు కల్పించారు. ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను శని, ఆది, సోమవారాల్లో నిలుపుదల చేసి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నట్లల తెలిపారు. శుక్రవారం వరకు గర్భాలయ అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలను యథావిధిగా అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.