Share News

సమాజానికి వైసీపీ హానికరం

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:47 PM

స్వేచ్ఛా సమాజానికి వైసీపీ అత్యంత హానికరమని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

సమాజానికి వైసీపీ హానికరం
మాట్లాడుతున్న మంత్రి పయ్యావుల కేశవ్‌

టీడీపీ కార్యకర్తలే బలం

ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి

జిల్లా ఇన్‌చార్జి, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌

నంద్యాలలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

నంద్యాల రూరల్‌/ నంద్యాల నూనెపల్లి, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): స్వేచ్ఛా సమాజానికి వైసీపీ అత్యంత హానికరమని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీకి బలం, బలగం అహర్నిశలు పనిచేసే కార్యకర్తలే అని ఆయన కొనియాడారు. సోమవారం నంద్యాల పట్టణంలోని చాపిరేవుల వద్ద ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పయ్యావుల కేశవ్‌తో పాటు న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు గిత్తా జయసూర్య, బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి శ్రమపడి, ధైర్యంగా నిలిచిన కార్యకర్తలను మరచిపోయిన రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రజలకు జవాబుదారీ తనంగా ఉన్నప్పుడే ఎన్నికల్లో విజయం సాధించవచ్చన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు, దుర్మార్గాలతో ముందుకు సాగితే కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగిస్తోందన్నారు. వైసీపీ ఒక చీడ పురుగులాంటిదని గుర్తుచేశారు. నిరంతరం ప్రజలకోసం శ్రమిస్తూ గౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ అరాచకాలను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి ప్రతి ఇంటికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నంద్యాల జిల్లా పరిధిలోని అలగనూరు, హంద్రీనీవా, గాలేరునగరితో పాటు రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులోని త్వరితగతిన పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీటిని అందిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 93 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు నిర్వీర్యం అయ్యాయన్నారు. అందులో భాగంగానే కేంద్రం నుంచి అందాల్సిన 60 శాతాన్ని కూడా భరిస్తూ మరో 40 శాతం కేటాయిస్తూ అదనపు భారం భరించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. అయినప్పటికీ ఎన్నికల హామీలను నెరవేర్చుతూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ప్రతి కార్యకర్తను నాయకులు గుండెల్లో పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఎన్నికలకు సంబంధించి తీసుకొచ్చిన సర్‌పై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ రాయలసీమ జోనల్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పార్వతమ్మ, డీసీఎంఎస్‌ అధ్యక్షులు నాగేశ్వర్‌యాదవ్‌, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌, నంద్యాల మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గుంటుపల్లి హరిబాబు, మాజీ ఎమ్మెల్యేలు ఏరాసు ప్రతా్‌పరెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, వినియోగదారుల కమిటీ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు సముచిత స్థానం : మంత్రి ఫరూక్‌

టీడీపీలో కార్యకర్తలకే సముచిత స్థానం ఉంటుందని మంత్రి ఫరూక్‌ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రింబవళ్లు శ్రమిస్తూ శ్రామికుడిగా మారారన్నారు. చంద్రబాబు అంటే ప్రపంచవ్యాప్తంగా ఓ విజన్‌ నాయకుడిగా గుర్తింపు ఉందన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వర్ణాంధ్రగా మారుస్తాం : మంత్రి బీసీ

రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా స్వర్ణాంఽధ్రగా మార్చాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి అన్నారు. అందులో భాగంగానే సూపర్‌ సిక్స్‌ పథకాలను.. సూపర్‌ ఫాస్ట్‌గా అమలు చేసినట్లు గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నా తట్టెడు మట్టి కూడా వేసిన రోజులు లేవన్నారు. కూటమి ప్రభుత్వంలో 4 వేల కి.మీ రోడ్లు వేశామని, కేవలం 6 నెలల్లో గుంతలు పూడ్చామని తెలిపారు. మళ్లీ రూ.3 వేల కోట్లతో రహదారులకు టెండర్లను పిలిపించామన్నారు. కొన్ని పనులు కూడా జరుగుతున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో డీఎస్సీని వదలకపోగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో డీఎస్సీని వదిలి ఉద్యోగాల్లో చేరిన తర్వాత ఉద్యోగాలు తొలగించాలనే ఆలోచనతో డీఎస్సీ పరీక్షలో అవకతవకలు జరిగాయని గ్లోబర్‌ ప్రచారం చేయడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. అభివృద్ధిపై చర్యకు ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని మీరు సిద్ధమా అంటూ వైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు. 2019లో బనగానపల్లిలో ఓటమికి కారణం అక్కడ నమోదు కాబడ్డ దొంగ ఓట్లేనని అధికారంలోకి వచ్చాక సుమారు 22వేల ఓట్లను తొలగించడం జరిగిందన్నారు. అందుకే సర్‌ విధానంపై ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 11:47 PM