Share News

పునర్విభజనపై కుస్తీ..!

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:30 PM

పునర్విభజనపై కుస్తీ..!

పునర్విభజనపై కుస్తీ..!

2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల పెంపు

15 ఏళ్లలో 25-30 శాతం పెరిగిన జనాభా

డివిజన్లు, వార్డుల విభజన డ్రాఫ్ట్‌ తయారీలో యంత్రాంగం

10న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ

మిగిలిన సమయం ఆరు రోజులే

నగర, పురపాలక సంస్థల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజనకు తొలి అడుగు పడింది. 2005 తరువాత వార్డుల విభజన ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పునర్విభజన తరువాత కర్నూలు నగరపాలక సంస్థ సహా వివిధ పురపాలక, నగర పంచాయతీల్లో 64 వార్డులు పెరుగుతాయి. ముసాయిదా తయారు చేసి ఈ నెల 10న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంది. మిగిలిన సమయం ఆరు రోజులే. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల విభజన చేయాలని బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే.. 15 ఏళ్లలో 25-30 శాతం వరకు పట్టణాల్లో జనాభా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన చేస్తే, పెరిగిన జనాభా పరిస్థితి ఏమిటి? వారిని ఏ వార్డుల్లో కలపాలి..? డ్రాఫ్ట్‌ తయారీలో మున్సిపల్‌ అధికారులను వెంటాడుతున్న ప్రశ్నలు ఇవి.

కర్నూలు, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005లో నగర, పురపాలక సంస్థల్లో 2001 జనాభా లెక్కల ఆధారంగా డివిజన్లు, వార్డుల పునర్విభజన చేశారని మున్సిపల్‌ అధికారుల సమాచారం. అంటే జనాభా గణాంకాలు తరువాత నాలుగేళ్లలో పునర్విభజన జరగడంతో జనాభా పెరుగుదలలో పెద్దగా తేడా లేదు. 20 ఏళ్ల తరువాత నగర, పురపాలక సంస్థల్లో డివిజన్లు, వార్డులు పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అది కూడా 2011 జనాభా లెక్కలు ఆధారంగా పునర్విభజన చేయాలని మార్గదర్శకాలు జారీ చేస్తూ, స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. అంటే.. ఈ 15 ఏళ్లల్లో నగర, పట్టణ జనాభా 25-30 శాతం వరకు పెరిగిందని రెవెన్యూ అధికారుల అంచనా. 2011 జనాభా లెక్కలు ప్రకారం కర్నూలు జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపాలిటీల జనాభా 7,61,481 ఉన్నారు. తాజాగా 10.76 లక్షలకు జనాభా చేరుకుందని అంచనా. దాదాపుగా 3.15 లక్షల మంది జనాభా పెరిగింది. నంద్యాల జిల్లాలో నంద్యాల, డోన్‌, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు మున్సిపాలిటీ పట్టణాల్లో జనాభా 4.11 మంది లక్షలు ఉంటే, ప్రస్తుత జనాభా 5.45 లక్షలకు చేరిందని అంచనా. 1.34 లక్షల వరకు జనాభా పెరిగింది. 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే పెరిగిన జనాభాను ఏ వార్డుల్లో కలపాలి..? ముసాయిదా (డ్రాఫ్ట్‌) తయారిలో నిమగ్నమైన అధికారులు, సిబ్బంది ఎలా సర్దుబాటు చేయాలో అంటూ తలలు పట్టుకుంటున్నారు.

కర్నూలు నగరంలో ఇదీ పరిస్థితి

కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 52 డివిజన్లలో 4,77,718 జనాభా ఉంది. అందులో కర్నూలు నియోజకవర్గంలోని 33 డివిజన్లలో 2,96,097 మంది, పాణ్యం నియోజకవర్గంలో 16 డివిజన్లలో 1,51,651 మంది, కోడుమూరు నియోజకవర్గంలో మూడు డివిజన్లు 29,970 జనాభా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం జారీ చేసిన డివిజన్లు, వార్డులు పునర్విభజన మార్గద్శకాలు ప్రకారం 68 డివిజన్లకు పెంచారు. 2011 జనాభా లెక్కలు ప్రకారం ఒక్కో డివిజన్‌లో 6,300 నుంచి 7,770 మంది జనాభా ఉండేలా ఎన్నికల వార్డులు విభజనకు కసరత్తు చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం కర్నూలు నగర జనాభా 7 లక్షలకు పైగా చేరిందని నగర పాలక అధికారుల అంచనా. అంటే.. పెరిగిన 1,67,282 మంది జనాభాను ఏ వార్డుల్లో కలుపుతారు..? ముసాయిదా తయారు చేస్తున్న అధికారులకే స్పష్టత లేదు. ‘ముందుగా ప్రభుత్వ నిబంధన మేరకు 2011 జనాభా లెక్కలు ప్రకారం వార్డులు విభజన చేస్తాం.. ఆ తరువాత మిగిలిన జనాభాను ఎలా సర్దుబాటు చేయాలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వారి సూచన మేరకు ముందుకు వెళ్తాం..’ అని ఓ అధికారి పేర్కొనడం కొసమెరుపు. పునర్విభజన ఉత్తర్వుల్లో ఇచ్చిన ప్లస్‌ ఆర్‌ మైనస్‌ అనే వెసులుబాటును ఉపయోగించుకొని పెరిగిన జనాభాను పరిగణలోకి తీసుకొని 9,500-10,500 జనాభాకు ఒక డివిజన్‌ను ఏర్పాటు చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. అన్ని వార్డుల్లో సమానంగా జనాభా ఉంటుంది. అలా కాకుండా 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని ఒక డివిజన్‌లో 6,300-7,770 జనాభా ఉండేలా 68 డివిజన్లు విభజిస్తే, పెరిగిన జనాభాను ఏ వార్డుల్లో కలపాలో..? అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఈ సమస్యకు డ్రాఫ్ట్‌ దశలోనే పరిష్కారం చూపకపోతే, విస్తరిస్తున్న కాలనీల్లో 25-30 వేలకు పైగా జనాభా ఒక డివిజన్‌ ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కర్నూలు నగరంలో ఒక్కటే కాదు.. ప్రతి మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి ఉంది.

ప్రధాన మున్సిపాలిటీల్లో ఇది పరిస్థితి

ఆదోనిలో 42 వార్డుల నుంచి 52 వార్డులకు పెంచారు. 2011 జనాభా లెక్కలు ప్రకారం 1,66,344 జనాభా ఉంది. ఈ లెక్కన 2,500-3,500 జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నారు. అయితే.. ప్రస్తుత జనాభా 2.65 లక్షలకు పెరిగిందని అంచనా. అంటే.. పెరిగిన జనాభా దాదాపు లక్ష మందిని ఏ వార్డుల్లో కలుపుతారు?

నంద్యాలలో 42 వార్డుల నుంచి 52 వార్డులకు పెంచారు. ఇక్కడ 2011 జనాభా లెక్కలు ప్రకారం 2,12,640 జనాభా ఉంది. ఈ లెక్కన 3,500 నుంచి 4 వేల జనాభాకు ఒక వార్డును విభజించే అవకాశం ఉంది. ప్రస్తుత జనాభా 2.85 లక్షలకు చేరిందని అంచనా. పెరిగిన జనాభా ప్రకారం అయితే 5,500 నుంచి 6 వేల జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2011 జనాభా లెక్కలే పరిగణలోకి తీసుకోవాలని ఉత్తర్వులు ఉన్నాయి.

ఎమ్మిగనూరులో 35 వార్డుల నుంచి 44 వార్డులకు పెంచారు. ఇక్కడ 2011 జనాభా లెక్కలు ప్రకారం 95,149 జనాభా ఉంది. ఈ లెక్కన అయితే 2 వేల నుంచి 2,500 జనాభాకు ఒక వార్డును విభజించిలే కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత జనాభా 1,35 లక్షలకు చేరింది. పెరిగిన జనాభాను ఏ వార్డుల్లో సర్దుబాటు చేస్తారు..? అధికారులను వెంటాడుతున్న చిక్కుముడి ఇది.

డోన్‌లో 32 నుంచి 36 వార్డులకు పెంచారు. ఇక్కడ 2011 జనాభా లెక్కలు ప్రకారం 59,272 జనాభా ఉంది. ఈ లెక్కన పెరిగిన వార్డులను ఒక్కొ వార్డులో 1,500 నుంచి 2 వేల వరకు జనాభా ఉండే అవకాశం ఉంది. అయితే.. ఈ పట్టణంలో ప్రస్తుత జనాభా 80 వేలకు పైగా చేరిందని అంచనా.

వివిధ మున్సిపాలిటీల్లో 2011, ప్రస్తుత జనాభా (అంచనా), కొత్తగా నిర్ణయించిన వార్డులు

నగర/పురపాలక/ 2011 ప్రస్తుత జనాభా కొత్తగా

నగర గణాంకాల (అంచనా) నిర్ణయించిన

పంచాయతీలు ప్రకారం జనాభా డివిజన్లు/వార్డులు

కర్నూలు జిల్లా:

కర్నూలు 4,77,718 6,45,000 68

ఆదోని 1,66,344 2,65,000 52

ఎమ్మిగనూరు 95,149 1,35,000 44

గూడూరు 22,270 31,000 23

మొత్తం 7,61,481 10,76,000 187

నంద్యాల జిల్లా:

నంద్యాల 2,12,640 2,85,000 52

డోన్‌ 59,272 80,000 36

నందికొట్కూరు 46,593 63,000 32

ఆత్మకూరు 46,953 61,000 32

ఆళ్లగడ్డ 45,703 53,000 32

మొత్తం 4,11,161 5,45,000 184

Updated Date - Apr 03 , 2026 | 11:31 PM