Share News

పైసా వసూల్‌

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:12 PM

పైసా వసూల్‌

పైసా వసూల్‌

అవినీతికి అడ్డాగా కార్పొరేషన్‌ రెవెన్యూ విభాగం

దందా సాగిస్తున్న ఉద్యోగులు

వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

పట్టించుకోని అధికారులు

డబ్బులివ్వనిదే పనులు కావడం లేదని బాధితుల ఆవేదన

కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని రెవెన్యూ విభాగం అవినీతికి అడ్డాగా మారింది. ప్రతి పనికి పైసలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజలకు సేవలు అందించాల్సిన ఉద్యోగులు వసూళ్ల దందా కొనసాగిస్తున్నారు. పాలకులు.. అధికారులు మారినా.. రెవెన్యూ విభాగంలో మాత్రం కొందరి ఆధిపత్యం మారడం లేదన్న ఆరోపణలున్నాయి. విభాగంలో కొందరి ఆధిపత్యం కొనసాగడానికి తెరవెనుక సహకరిస్తున్నది ఎవరు? ఫిర్యాదులు అందుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొందరైతే ఏళ్ల తరబడి పాతుకుపోయి తమ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు.

కర్నూలు న్యూసిటీ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వసూళ్ల దందా కొనసాగుతోంది. కొందరు అధికారులు ప్రతి పనికి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. రెవెన్యూ సేవల కోసం వచ్చే ప్రజలందరికీ ఒకే విధమైన సేవలు అందుతున్నాయా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. కొందరి దరఖాస్తులు గంటల వ్యవధిలోనే పరిష్కారమవుతున్నాయి. మరికొందరు నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారనే ఫిర్యాదులున్నాయి. అడిగినంత చెల్లిస్తే పనులు వేగంగా పూర్తవుతున్నాయా? లేకపోతే జాప్యం చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు ఇవ్వనిదే పనులు కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తన ప్రభావాన్ని కొనసాగిస్తూ..

వైసీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే వర్గానికి సన్నిహితంగా మెలుగుతూ, రాజకీయ పలుకుబడితో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఓ అధికారి ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. కానుకలు, నెలవారీ మామూళ్లతో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ తన మాట చెల్లుబాటు అయ్యేలా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు రెవెన్యూ వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న ఓ ఉద్యోగిని ఇటీవల బదిలీ చేయడం వెనుక కారాణాలేమిటన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో సాగుతోంది.

డబ్బులిస్తే గంటల్లో..

కార్పొరేషన్‌లో పనులు కావాలంటే చేతులు తడపాల్సిందే. పైసలిస్తే గంటల్లోనే పనులు చేస్తారు. లేదంటే నెలల తరబడి వేచి ఉండాల్సిందే. ఇటీవలే ఎస్‌సీఐ కాలనీకి చెందిన ఓవ్యక్తి కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో ఉన్న పాత భవనాన్ని తొలగించి జీప్లస్‌ వన్‌ భవనాన్ని నిర్మించుకున్నారు. ఆస్తిపన్ను సవరణ, యజమాని పేరు మార్పు కోసం కేఎంసీ(కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌)కు వెళ్లాడు. రెవెన్యూ విభాగంలో సంబంధిత సిబ్బంది అందుబాటులో లేదు. కంప్యూటర్‌ విభాగాన్ని సంప్రదించాలని కొందరు సూచించినట్లు తెలిసింది. అక్కడికెళ్లిన దరఖాస్తుదారుడితో సుమారు రూ.30వేలకు బేరసారాలు కుదుర్చుకున్నారు. మరుసటి రోజు అతడు అవసరమైన పత్రాలు తీసుకురాగా మధ్యాహ్నానికి పని పూర్తిచేసినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు పరిధిలో ఉండాల్సిన దరఖాస్తు వ్యవహరం కంప్యూటర్‌ విభాగం నుంచే నడవడం.. ఆ విభాగం అవినీతికి మధ్యవర్తిత్వ కేంద్రంగా మారిందా? అన్న అనుమానాలకు తావిస్తోంది. ఇవే కాకుండా ఇలాంటి ఎన్నో ఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి.

పాతుకుపోయిన ఉద్యోగులు

కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయారు. అక్కడ తమ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. ఒకేచోట పాతుకుపోయిన (ఫెవికాల్‌) ఉద్యోగుల వ్యవహరిశైలిపైనా సమీక్ష జరగాలి. అప్పుడే నగర పాలక సంస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది.

లాగిన్‌లను అడ్డుపెట్టుకొని

పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదుల పరిష్కారం కోసం అడ్మిన్‌, ఆర్‌ఐ, రెవెన్యూ అధికారుల (ఆర్‌ఐ) లాగిన్‌ వివరాలను కొందరు కంప్యూటర్‌ ఆపరేటర్లు తమ వద్ద ఉంచుకున్నారు. సంబంధిత అధికారులకు తెలియకుండానే దరఖాస్తుల నమోదు, పరిశీలన, ఆమోద ప్రక్రియలు నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ లాగిన్‌లను అడ్డుపెట్టుకుని దరఖాస్తుదారులతో బేరసారాలు సాగిస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదుల నమోదు కోసమే లాగిన్‌లు వినియోగిస్తున్నారా? లేక ఇతర రెవెన్యూ సేవల దరఖాస్తుల పరిష్కారంలోనూ వాటిని దుర్వినియోగం చేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది.

అక్రమ లావాదేవీలకు తెరతీస్తున్నారా?

పేరు మార్పులు, ఆస్తిపన్ను సవరణలు, భవన వివరాల మార్పు వంటి సేవల్లోనూ భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలన్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల రుసుముల విషయంలో నిబంధనలు పాటిస్తున్నారా? లేక అక్రమ లావాదేవీలకు తెరతీస్తున్నారా? అన్నది పరిశీలించాల్సిన అవసరముంది. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన రికార్డులు, చెల్లింపుల వివరాలు, లాగిన్‌ లాగ్‌లు, ఆమోదాల సమయాలను పరిశీలిస్తే ఈ ఆరోపణల్లో వాస్తవాలు బయటపడే అవకాశముంది.

కలకలం రేపాయి..

ఇటీవల డిప్యూటీ కమిషనర్‌ సతీ్‌షకుమార్‌రెడ్డి లాగిన్‌కు సంబంధించిన అనుమతుల వినియోగంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయనకు తెలియకుండానే ఆ లాగిన్‌ ద్వారా ఓ టైటిల్‌ ట్రాన్స్‌ఫర్‌ దరఖాస్తుకు ఆమోదం తెలిపినట్లు ఆరోపణలు కలకలం రేపాయి. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా లాగిన్లు వినియోగిస్తే బాధ్యత ఎవరిది? కంప్యూటర్‌ విభాగంలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంఽధాలు ఉండటంతోనే వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నారా? అన్న సందేహలు వ్యక్తమవుతున్నాయి. విచారణ జరిగితే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రక్షాళన చేయాల్సిన..

నగర పాలక సంస్థలో పరిపాలన వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడంతో పాటు అవినీతికి తావులేకుండా కొత్త పాలకవర్గం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ విభాగంలో ఏళ్లుగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు ముగింపు పలుకుతుందా? ఉద్యోగుల లాగిన్‌ల వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి, ప్రతి దరఖాస్తు స్థితిని ప్రజలకు అందుబాటులో ఉంచుతుందా? అన్నది వేచి చూడాలి.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

రెవెన్యూ, కంప్యూటర్‌ విభాగంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేయిస్తాం. బాధ్యులపై ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటాం. ఆర్‌ఐలు, అడ్మిన్‌ను కూడా లాగిన్లను పదిహేను రోజులకోసారి పాస్‌వర్డ్‌ మార్చుకోవాలని సూచిస్తాం. ఎవరూ కూడా తమ లాగిన్లను ఇతరులకు ఇవ్వకూడదని ఆదేశాలు జారీచేస్తాం.

ఆర్‌జీవీ కృష్ణ,అడిషనల్‌ కమిషనర్‌, నగరపాలక సంస్థ, కర్నూలు

Updated Date - Nov 27 , 2026 | 11:13 PM