Share News

అన్నదాత సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:49 AM

అన్నదాత సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్‌, పశు సంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోడుమూరులోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉల్లి రైతులకు పరిహారం పంపిణీ సభ స్థానిక ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అధ్యక్షతన జరిగింది.

అన్నదాత సంక్షేమానికి  ప్రభుత్వం కృషి
స్టాల్‌ను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

ఉల్లి రైతులకు రూ.128.33 కోట్ల మెగా చెక్కు పంపిణీ

కోడుమూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): అన్నదాత సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్‌, పశు సంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోడుమూరులోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉల్లి రైతులకు పరిహారం పంపిణీ సభ స్థానిక ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అధ్యక్షతన జరిగింది. కర్నూలు, కడప జిల్లాలో ఉల్లి సాగు చేసిన ఆర్థికంగా నష్టపోయిన 37,752 మంది రైతులకు హెక్టారుకు రూ.50 వేలు చొప్పున రూ.128.33 కోట్ల మెగా చెక్‌ను రైతులకు అందజేశారు. కర్నూలు జిల్లాలో 31,352 మంది రైతులకు రూ.99.91 కోట్లు అందించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల ఉల్లి రైతులు తీవ్రంగా పట్టనష్టం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ధరలు పతనం కావడంతో క్వింటాకు మద్దతు ధర రూ.1,200 నిర్ణయించి ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేశాం. సీఎం చంద్రబాబు ఉల్లి రైతులను ఆదుకోవాలని హెక్టారుకు రూ.50 వేలు ప్రకటించారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి సాగునీటి పారుదల, వ్యవసాయం ఎంతో కీలకం. రాష్ట్ర విభజన తరువాత నాటి టీడీపీ ప్రభుత్వంలో ఈ రెండు రంగాలు స్వర్ణయుగంగా ముందుకు సాగాయి. దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా ప్రాజెక్టులకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం సర్వనాశం చేశారని తెలిపారు. ఇరిగేషన్‌కు ఒక్కపైసా ఇవ్వకుండా ప్రాజెక్టులు నిర్వర్యం చేశారని ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాలో కోకో పంట ధర పడితే ప్రభుత్వమే కిలో రూ.50లకు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. జగన్‌రెడ్డి లాగా ఉత్తుత్తి బటన్‌ నొక్కలేమని, కూటమి ప్రభుత్వం బటన్‌ నొక్కితే అర నిమిషంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. జగన్‌ దౌర్జన్యాలు, రౌడీయిజం, అక్రమ వసుళ్ల కారణంగా రాష్ట్ర సర్వనాశం చేశారని ఘాటుగా విమర్శించారు.

పెట్టుబడుల్లో అగ్రస్థానం ఏపీ

ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయని, రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ వల్లే అది సాధ్యమయిందని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. రైతులకు ఏ కష్టమోచ్చినా తామున్నామం టూ సీఎం చంద్రబాబు ఆర్థిక భరోసా అందస్తారని అన్నారు. కర్నూలు మార్కెట్‌లో ఉల్లి ధర పడిపోయిం దని తెలియగానే ముఖ్యమంత్రి తక్షణమే మద్దతు ధర రూ.1,200లకు ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయడమే కాకుండా బోనస్‌గా హెక్టారుకు రూ.50 వేలు ప్రకటించారు. జిల్లాలో దాదాపు రూ.వంద కోట్లు రైతులకు అందజేసిన ప్రభుత్వం మనదే అన్నారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం ముందు ఉంటుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్తి విత్తనాలు దిగుమతి చేసుకొని అధిక దిగుబడులు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కోడుమూరు నియోజకవర్గంలో 8,890 మంది ఉల్లి రైతులకు రూ.27 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. ఉల్లి నిల్వలకు ఏసీ గోదాములు నిర్మించాలని, కోడుమూరు పట్టణ తాగునీటి సమస్య తీర్చాలని మంత్రులను కోరారు.

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌తో రైతుకు రుణ విముక్తి

ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు, చక్రవడ్డీ భారాన్ని తగ్గించేందుకు వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ అమలు ప్రభుత్వం ప్రతిపాదించిందని గుర్తుచేశారు. పాణ్యం, కోడుమూరు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు గౌరు చరిత, కేఈ శ్యాంబాబు, బీవీ జయనాగేశ్వరరెడ్డి, కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ సునీత తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, మంత్రాలయం ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 12:49 AM