సమష్టి కృషితో గ్రంథాలయాల అభివృద్ధి
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:54 PM
జిల్లాలో గ్రంథాలయాల పురోభివృద్ధికి సమష్టి కృషి అవసరమని డీఈవో ఎల్. సుధాకర్ అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ఆరంభమయ్యాయి.
డీఈవో సుధాకర్
ఘనంగా ఆరంభమైన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
కర్నూలు కల్చరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రంథాలయాల పురోభివృద్ధికి సమష్టి కృషి అవసరమని డీఈవో ఎల్. సుధాకర్ అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ఆరంభమయ్యాయి. తొలిరోజు ముఖ్య అతిథిగా డీఈవో హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత గ్రంథాలయంలోని చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహానికి పూలదండలు వేసి, పూజలు చేశారు. అనంతరం వారు గ్రంథాలయం ఆవరణలోని జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. ఆ తర్వాత గాడిచర్ల హరి సర్వోత్తమరావు విగ్రహానికి, జవహర్‌లాల్ నెహ్రూ, గ్రంథాలయ పితామహులు అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, గాడిచర్ల, రంగనాథన్ చిత్రపటాలకు పులమాలలు వేసి నివాళి సమర్పించారు. విద్యార్థుల ర్యాలీని వారు ప్రారంభించారు. తెలుగు తల్లి విగ్రహానికి పూలదండలు వేశారు. అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సభలో డీఈవో మాట్లాడుతూ విద్యార్థి దశలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పారు.
గ్రంథాలయ సెస్ నేరుగా సంస్థకే అందాలి: చైర్మన్
ప్రజలు ఇంటి పన్నుల రూపంలో గ్రంథాలయ సెస్ 8శాతం కలిపి నగరపాలక, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు చెల్లిస్తున్నారని, అయితే ఆ నిధులు సక్రమంగా తిరిగి గ్రంథాలయాలకు అందడం లేదని, సెస్ నేరుగా సంస్థకే అందాలని చైర్మన్ తుగ్గలి చెప్పారు. ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయ సెస్‌లు రూ. 10 కోట్లకు పైనే బకాయలు ఉన్నాయని చెప్పారు. జిల్లాలోని గార్గేయపురం, తుగ్గలి, కోడుమూరులలో రూ. కోటితో ఇటీవల మూడు స్వంత భవనాలు నిర్మించామని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్, ఉప గ్రంథాలయ అధికారి వి. పెద్దక్క, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు కేజీ గంగాధర్‌రెడ్డి, టీడీపీ నాయకులు పి. హనుమంతరావు చౌదరి, పద్మా చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరికి వివిధ రకాల క్విజ్‌పోటీలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన నృత్య ప్రదర్శనలో ప్రభుత్వ శారద సంగీత, నృత్య కళాశాల, మాంటిస్సోరి విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.