ఆపరేషన్‌కు వెళ్తే ప్రాణం తీశారు
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:05 AM
కడుపులో నీటి బుడగలు ఉన్నాయని ఆసుపత్రిలో చేరితో వైద్యులు ప్రాణాన్ని తీశారంటూ మృతురాలి బంధువులు నగరంలోని గాయత్రీ ఎస్టేట్‌లో ఉన్న మౌర్య హాస్పిటల్ ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు.
వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి
చెందినట్లు బంధువుల ఆరోపణ
మౌర్య హాస్పిటల్ ఎదుట ఉద్రిక్తత
ఆసుపత్రి సామగ్రిని ధ్వంసం చేసిన బంధువులు
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కడుపులో నీటి బుడగలు ఉన్నాయని ఆసుపత్రిలో చేరితో వైద్యులు ప్రాణాన్ని తీశారంటూ మృతురాలి బంధువులు నగరంలోని గాయత్రీ ఎస్టేట్‌లో ఉన్న మౌర్య హాస్పిటల్ ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సామాగ్రిని ధ్వంసం చేశారు. కల్లూరు మండలం పందిపాడుకు చెందిన పావని (27) గత పది రోజుల క్రితం గాయత్రి ఎస్టేట్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడ గైనకాలజిస్టు డా. కళాసౌందర్య పరీక్షలు నిర్వహించి, కడుపులో నీటి బుడుగలు ఉన్నాయని, చికిత్స చేయాలని చెప్పింది. రూ.30వేలు ఖర్చు అవుతుందని, మరో ప్రైవేటు హాస్పిటల్‌లో ఆపరేషన్ చేస్తామని చెప్పింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మౌర్య హాస్పిటల్‌లో అడ్మిట్ చేయగా.. సాయంత్రం ఆపరేషన్‌కు తీసుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు రోగి కడుపు క్లీన్ చేస్తుండగా స్ర్టోక్ వచ్చిందని, 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని సీపీఆర్ చేసినట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రంతా హాస్పిటల్‌లో పడిగాపులు కాశామని, బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో 30 మంది పోలీసులు వచ్చి రోగి చనిపోయినట్లు మృతదేహాన్ని తీసుకెళ్లమని చెప్పారని బంధువులు తెలిపారు. ఉదయం హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సామగ్రి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. రోగి చనిపోయిన సమాచారాన్ని కూడా వైద్యులు ఇవ్వలేదని, రూ.30వేలు చెల్లించాక చనిపోయిన సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. వైద్యులు ఆసుపత్రి వెనుక డోర్ నుంచి వెళ్లిపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లారు